లుక్ బ్యాక్ స్పోర్ట్స్..24లో రిటైరైన 28 మంది అంతర్జాతీయ క్రికెటర్లు
ఏ ఆటగాడికైనా.. ఎంతటి ఆటగాడికైనా.. ఏదో ఒక దశలో రిటైర్మెంట్ తప్పదు.. ఇది వారి క్రీడా జీవితంలో భాగం అనే అనుకోవాలి.
ఏ ఆటగాడికైనా.. ఎంతటి ఆటగాడికైనా.. ఏదో ఒక దశలో రిటైర్మెంట్ తప్పదు.. ఇది వారి క్రీడా జీవితంలో భాగం అనే అనుకోవాలి. అయితే, యాక్సిడెంటల్ గానో మరే విధంగానో ఒకే ఏడాది భారీగా రిటైర్మెంట్లు ఉండడం మాత్రం ఆశ్చర్యకరమే.. అది కూడా ఈ ఏడాదే కావడం మరింత అనూహ్యం. పైగా క్రికెట్ లో కావడం గమనార్హం.
అశ్విన్ తో ఆఖరా.. రోహిత్ కూడానా?
టీమ్ ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. బహుశా ఈ ఏడాదిలో చివరగా రిటైర్ అవుతున్న అంతర్జాతీయ క్రికెటర్ ఇతడేనేమో? వాస్తవానికి ఈ సిరీస్ లో తీవ్రంగా విఫలం అవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని భావించారు. అలాకాకుండా అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇక రోహిత్ తో పాటు స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి ఈ ఏడాది టి20 ప్రపంచ కప్ విజయం అనంతరం రిటైర్ అయిన సంగతి తెలిసిందే. మరో అంతర్జాతీయ క్రికెటర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఈ ఏడాదే తప్పుకొన్నాడు.
రవీంద్ర జడేజా (టి20లు) వంటి మ్యాచ్ విన్నర్ తో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్, వ్రద్ధిమాన్ సాహా, కేదార్ జాదవ్, సౌరభ్ తివారీ, వరుణ్ అరోన్, బరీందర్ శరణ్, సిద్థార్థ్ కౌల్ ఈ ఏడాది రిటైరైన భారత క్రికెటర్లు. జడేజా మాత్రం టెస్టులు, వన్డేలు ఆడుతున్నాడు.
విదేశీయులూ అధికమే..
హెన్రిచ్ క్లాసెన్ (టెస్టులు) వంటి విధ్వంసక బ్యాట్స్ మన్ తో పాటు ఐపీఎల్ ద్వారా మనకు ఎంతో దగ్గరైన డేవిడ్ వార్నర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్, న్యూజిలాండ్ కు చెందిన మేటి పేసర్ టిమ్ సౌథీ, నీల్ వాగ్నర్, కొలిన్ మన్రో క్రికెట్ నుంచి తప్పుకొన్నారు.
పేస్ దిగ్గజం పరుగు ఆపాడు
ఓ పేసర్ కు టెస్టుల్లో 500 వికెట్లు తీయడమే కష్టం అనుకుంటే 704 వికెట్లు పడగొట్టాడు జేమ్స్ అండర్సన్. దాదాపు 22 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అతడు 42 ఏళ్ల వయసులో రిటైరయ్యాడు. అంతేకాదు.. తొలిసారిగా ఐపీఎల్ లోనూ వేలానికి రిజిష్టర్ చేసుకున్నాడు. కానీ, మెగా వేలంలో ఎవరూ కొనలేదు. ఇంగ్లండ్ కే చెందిన టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ డేవిడ్ మలాన్, స్పిన్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ కూడా 2024లోనే విరమించారు.
27 ఏళ్లకే..
ప్రతిభావంతుడైన బ్యాట్స్ మన్ గా పేరుతెచ్చుకున్నా.. బంతిని తలకు పలుసార్లు తగిలించుకుని.. సిరీస్ ల మధ్యలోనే తప్పుకొనే అలవాటున్న ఆస్ట్రేలియన్ విల్ పకోవ్ స్కీతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ మాధ్యూ వేడ్, పాకిస్థాన్ కు చెంది మొహమ్మద్ ఆమిర్, ఇమాద్ వాసీం కూడా 2024లోనే ఆట ముగించారు.
ఎంపీ అయి.. రాజకీయంలో చిక్కుకుని..
బంగ్లాదేశ్ కు చెందిన మేటి ఆల్ రౌండర్ షకిబ్ ఉల్ హసన్ కెరీర్ ఈ ఏడాదే ముగిసింది. టెస్టులు, టి20ల నుంచి తప్పుకొన్న షకిబ్.. ఈ ఏడాదే అవామీ లీగ్ పార్టీ తరఫున ఎంపీ అయ్యాడు. కానీ, షేక్ హసీనా ప్రభుత్వం ప్రతనంతో ఇబ్బందుల్లో పడ్డాడు. ఓ దశలో స్వదేశానికి రాలేని పరిస్థితి. సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడాలన్న కోరిక కూడా తీరలేదు. ఇతడితో పాటు బంగ్లాకు ఆల్ రౌండర్ గా సేవలందించిన మొహ్మదుల్లా కూడా టి20 కెరీర్ చాలించాడు.