క్రమశిక్షణ తప్పిన టీమ్ ఇండియా.. గంభీర్ మార్క్ రూల్స్?
మైదానంలో ఎంతో కలివిడిగా కనిపించే టీమ్ ఇండియా క్రికెటర్లది కేవలం నటనేనా? వారి మధ్య ఇదే తరహా వాతావరణం డ్రెస్సింగ్ రూమ్ లో లేదా..? భారత క్రికెట్ జట్టు వర్గాలుగా విడిపోయిందా..?
మైదానంలో ఎంతో కలివిడిగా కనిపించే టీమ్ ఇండియా క్రికెటర్లది కేవలం నటనేనా? వారి మధ్య ఇదే తరహా వాతావరణం డ్రెస్సింగ్ రూమ్ లో లేదా..? భారత క్రికెట్ జట్టు వర్గాలుగా విడిపోయిందా..? ఇటీవలి కాలంలో వైఫల్యాలకు ఇదే ప్రధాన కారణం అవుతోందా..? దీంతో హెడ్ కోచ్ గంభీర్ రంగంలోకి దిగాడా..? ఫిట్ నెస్ విషయంలోనే కాదు.. విదేశీ టూర్ల సందర్భంగా కుటుంబాలను అనుమతించే అంశంలోనూ కొత్త రూల్స్ తేనున్నాడా? బీసీసీఐ వర్గాలు వీటన్నిటికీ ఔననే చెబుతున్నాయి.
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్ క్లీన్ స్వీప్.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో 1-3తో ఓటమి.. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తు దూరం.. ఇదీ టీమ్ ఇండియా గత రెండు నెలల్లో ఎదుర్కొన్న కఠిన పరిస్థితి. సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఫామ్ దారుణంగా ఉంది. ఇలాగైతే లాభం లేదనుకున్న గంభీర్ తన మార్క్ చూపడం మొదలుపెట్టాడని సమాచారం.
గంభీర్ పట్టుదలతో భారత జట్టులో సమూల మార్పులకు బీసీసీఐ సిద్దమైందట. విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులు రెండు వారాలకు మించి ఉండకుండా నిబంధన తెచ్చింది. గత శనివారం బీసీసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశంలో గంభీర్.. టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లో క్రమశిక్షణ లోపించడాన్ని ప్రస్తావించాడట.
ఆస్ట్రేలియా టూర్ లో ఒక్కసారే కలిసి డిన్నర్ చేయడం, బయటకు వెళ్లేప్పుడు గ్రూపులుగా విడిపోవడం గమనించిన గంభీర్ మళ్లీ పాత రూల్స్ తేవాలని పట్టుబట్టినట్లు సమాచారం.
దీంతో అత్యంత కఠినమైన ఫిట్ నెస్ టెస్టు యో-యోతో పాటు కొవిడ్ కు ముందు ఉన్న నిబంధనలను తేవాలని బీసీసీఐ చూస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన సూచన ప్రకారం.. సిరీస్ ముగిసిన వెంటనే మ్యాచ్ ఫీజు మొత్తాన్ని ఇవ్వకుండా.. ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా మంజూరు చేయాలి. దేశవాళీ, జాతీయ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వని వారిని పక్కన పెట్టాలని సూచించాడట.
మొత్తానికి ఇటీవలి ఓటములు భారత జట్టుపై గట్టిగానే ప్రభావం చూపుతున్నాయి. దీని ఫలితంగా ఒకరిద్దరు సీనియర్లు రిటైరైనా ఆశ్చర్యం ఉండదేమో?