ఒలింపిక్స్ లో ఆశల పల్లకీ హకీ.. సెమీస్ లో టీమ్ ఇండియా

2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత్ క్వార్టర్స్ లో బ్రిటన్ పైనే నెగ్గి సెమీస్ చేరింది. సెమీస్ లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది.

Update: 2024-08-04 11:37 GMT

బాక్సింగ్ ల్ ఆశలు చల్లారాయి.. బంగారు బాతు బ్యాడ్మింటన్ లోనూ నిరాశే మిగిలింది.. మను మూడో పతకం తేలేకపోయింది.. మిగిలింది ఇక ఏముంది పారిస్ ఒలింపిక్స్ లో..? పోయినసారిలా డబుల్ డిజిట్ పతకాలు అయినా దక్కుతాయా? లేక గతంలో లాగా మూడు, నాలుగు పతకాలతో తిరిగి రావడమేనా? ఇవీ అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలు. ఇలాటి సందేహాల నడుమ ఆశల పల్లకీ ఎక్కిస్తోంది పురుషుల హాకీ జట్టు. ఒలింపిక్స్‌ లో భారత జట్టు దూకుడు అలా సాగుతోంది.

52 ఏళ్ల తర్వాత మొన్న ఆస్ట్రేలియాపై

ధ్యాన్ చంద్ వంటి అరుదైన మేటి క్రీడాకారుడి హయాంలో ఒకప్పుడు ప్రపంచ హాకీలో మేటి జట్టు అయిన భారత్.. టర్ఫ్ మైదానాలు వచ్చాక పూర్తిగా వెనుకబడిపోయింది. ఓ సాదాసీదా జట్టుగా మిగిలిపోయింది. అయితే, కొంతకాలంగా పూర్వ వైభవం సాధించే ప్రయత్నం సాగిస్తోంది. గత ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. ఇక పారిస్ ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాపై నెగ్గింది. 52 ఏళ్లలో ఆ జట్టుపై భారత్ గెలవడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో క్వార్టర్‌ ఫైనల్ చేరింది. ఆదివారం ఏకంగా ప్రపంచ నంబర్‌-2 బ్రిటన్‌ ను ఓడించింది. తొలుత ఈ మ్యాచ్‌ 1-1తో టై అయింది. షూటౌట్‌ లో భారత్ 4-2తో గెలుపొందింది. తొలి క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్ చేయలేదు. రెండో క్వార్టర్‌ లో కాసేపటికే భారత డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌ మ్యాచ్‌ కు దూరమయ్యాడు. స్టిక్‌ తో బ్రిటన్ ఆటగాడి తలపై ఉద్దేశపూర్వకంగా కొట్టాడని భావించిన రిఫరీలు రెడ్‌కార్డ్ చూపారు. 10 మందితోనే ఆడిన భారత్ కు.. 22వ నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్ పెనాల్టీ కార్నర్‌ ద్వారా గోల్‌ సాధించి పెట్టాడు. అయితే, 27వ నిమిషంలో బ్రిటన్ ఆటగాడు మోర్టన్ లీ గోల్‌ చేయడంతో స్కోర్ 1-1 అయింది. తర్వాతి రెండు క్వార్టర్స్‌ లో జట్లు గోల్ చేయకపోవడంతో మ్యాచ్‌ షూటౌట్‌ కు వెళ్లింది. అందులో 4-2తో భారత్ గెలిచింది.

అప్పట్లోనూ బ్రిటన్ పైనే

2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత్ క్వార్టర్స్ లో బ్రిటన్ పైనే నెగ్గి సెమీస్ చేరింది. సెమీస్ లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. మళ్లీ ఇప్పుడు బ్రిటన్ ను మట్టికరిపించి సెమీస్ కు వచ్చింది. ఈ సెంటిమెంట్ వర్క్ ఔట్ అయితే మనకు ఓ పతకం ఖాయం. వరుసగా రెండోసారి ఒలింపిక్స్ సెమీస్ కు వచ్చిన భారత్ అభిమానులను అలరిస్తుందా? లేదా? చూడాలి.

Tags:    

Similar News