'చాంపియన్స్' రగడ.. దక్షిణాఫ్రికాలో టోర్నీ.. పాక్ సంచలన నిర్ణయం!

చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకారం పాక్ లో జరగాల్సి ఉంది. ఇందుకోసం మూడు స్టేడియాలను ముస్తాబు చేస్తున్నారు

Update: 2024-11-12 07:09 GMT

ఆతిథ్య దేశం నుంచి అనూహ్యంగా టోర్నీకే దూరమయ్యే పరిస్థితి బహుశా ప్రపంచంలో మరే జట్టుకూ రాదేమో..? సంధికి కూడా రాకుండా.. అసలుకే ఎసరు తెచ్చుకోవడం అంటే ఇదేనేమో..? వన్డే క్రికెట్ లో ప్రపంచ కప్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఇన్న చాంపియన్స్ ట్రోఫీ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ టోర్నీకి ఇప్పటికీ వేదిక ఎక్కడ నేది నిర్ధారణ కాలేదు. కారణం.. ‘పాకిస్థాన్’.

స్టేడియాలు సిద్ధం అవుతున్నా..

చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకారం పాక్ లో జరగాల్సి ఉంది. ఇందుకోసం మూడు స్టేడియాలను ముస్తాబు చేస్తున్నారు. కానీ, ఉగ్రవాదానికి ఆ దేశం అందిస్తున్న సాయం, భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్ కు వెళ్లేందుకు భారత జట్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడం లేదు. అయితే, భారత్ ఆడాల్సిన మ్యాచ్ లను వేరే దేశంలో నిర్వహిస్తే (దీనినే హైబ్రిడ్ మోడల్) మాత్రం చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటామని చెబుతోంది. దీంతో భారత్ మ్యాచ్‌ లను యూఏఈలో నిర్వహించాలని పాక్ క్రికెట్‌ బోర్డు ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కోరింది. దీనికి పాక్ బోర్డు ఒప్పుకోలేదని సమాచారం. తమ ఆతిథ్య హక్కులను తగ్గిస్తే టోర్నీనే వీడాలని నిర్ణయించుకుందట.

భారత్ కు అప్పటివరకు రాబోము

భారత్ లో నిరుడు జరిగిన వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు పాకిస్థాన్ సాకులు చెప్పింది. కానీ, ఎట్టకేలకు వచ్చి ఆడింది. ఇప్పుడు తమ దేశానికి భారత్ రానంటుండడంతో భారత్‌ లో జరిగే మరే ఇతర ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదని నిర్ణయించిందట. అంతేకాదు.. 2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు ఆసక్తి చూపుతున్న భారత్ కు వ్యతిరేకంగా లాబీయింగ్ చేయనుందట.

దక్షిణాఫ్రికాలో టోర్నీ..

చాంపియన్స్ ట్రోఫీపై పాకిస్థాన్ మొండిగా వ్యవహరిస్తే, టోర్నీని హైబ్రిడ్ మోడల్‌ లో నిర్వహించేందుకు అంగీకరించకపోతే టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాకు తరలించే చాన్సుందట. హైబ్రిడ్ మోడల్ పై చర్చలు జరగలేదని.. పరిస్థితిని పీసీబీ అంచనా వేస్తోందని.. ఏం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకోలేదని పీసీబీ అధికారి చెబుతున్నారు.

Tags:    

Similar News