భారత్.. పాక్.. ప్రపంచ క్రికెట్ లో ఓ కృష్ణుడు.. ఓ కుచేలుడు

పోలికలో ఏమైనా అభ్యంతరాలు ఉండవచ్చేమో కానీ.. పోల్చిన తీరు మాత్రం నిజంగా అలాంటిదే.

Update: 2024-10-07 23:30 GMT

పోలికలో ఏమైనా అభ్యంతరాలు ఉండవచ్చేమో కానీ.. పోల్చిన తీరు మాత్రం నిజంగా అలాంటిదే. ప్రపంచ క్రికెట్ లో భారత్, పాకిస్థాన్ రెండూ పెద్ద జట్లే.. ఉమ్మడి భారత దేశ విభజన అనంతరం ఏర్పడిన పాక్.. భారత్ తో పాటే క్రికెట్ లో బలమైన శక్తిగా ఎదిగింది. గత 40 ఏళ్లలో చూసినా.. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఇంజమాముల్ హక్, షోయబ్ అక్తర్ వంటి ఎందరో దిగ్గజాలు పాక్ నుంచి వచ్చారు. కానీ, ఇప్పుడు ఆ దేశ క్రికెట్ పరిస్థితి చూస్తుంటే..?

భారత్ జేబులు నిండుగా..

ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడు అత్యంత ధనిక బోర్డు ఏదంటే అది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అని చెప్పాలి. కేవలం ఐపీఎల్ ను చూసుకున్నా రూ.లక్ష కోట్ల విలువైన లీగ్ అది. ఈ లీగ్ లో 2024లో ఆడిన ఓ ఆటగాడికి (విదేశీ) దక్కిన వేలం మొత్తం రూ.25 కోట్లు కావడం విశేషం. అంతేకాదు.. రూ.20 కోట్లు పొందినవారూ ఉన్నారు. ఇక అది వదిలిపెట్టినా.. వచ్చే ఏడాది జరిగే లీగ్ లో ఓ మార్పు చేశారు. దాని ప్రకారం లీగ్‌ మ్యాచ్‌ లు ఆడేందుకు ఎంపికైన ఆటగాళ్లకే మ్యాచ్ ఫీజుగా రూ.7.50 లక్షలు రానున్నాయి. కాంట్రాక్ట్‌ మొత్తంతో పాటు ఒక ఆటగాడు అన్ని మ్యాచ్‌ లు ఆడితే రూ.1.05 కోట్లు దక్కుతాయి. అంటే కేవలం ఐపీఎల్ ద్వారానే మ్యాచ్ ఫీజుగా రూ.కోటి వస్తున్నాయి. ఇక జాతీయ జట్టులో గ్రేడ్ ప్రకారం చూస్తే ఏ ప్లస్ గ్రేడ్ ఆటగాళ్ల కాంట్రాక్టు రూ.7 కోట్లు. కానీ, పాకిస్థాన్ పరిస్థితి మాత్రం..

పాక్ జేబులు ఖాళీ..

భారత్ తో పాటే ఓ దశలో ప్రపంచ క్రికెట్ లో గట్టి జట్టుగా ఉంది పాకిస్థాన్. కానీ, దాని జట్టు ప్రదర్శనే కాదు.. క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితి కూడా దిగజారింది. జాతీయ క్రికెటర్లకే 4 నెలలుగా జీతాలు ఇవ్వలేని దైన్యం. దీంతో బోర్డు దివాలా అంచున ఉందంటున్నారు. పాకిస్థాన్ కు మూడు ఫార్మాట్లలో ఆడే బాబర్ అజామ్, వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదిలకూ జీతాలు లేవట. గత ఏడాది జూలై నుంచి 2026 జూన్ 30 వరకు దాదాపు 25 మందికి పాక్ క్రికెట్ బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. మరి వీరిలో ఎందరికి చెల్లింపులు చేస్తుందో చెప్పలేం. ఇక మరో విషయం ఏమంటే.. పాకిస్థాన్ క్రికెటర్ల జెర్సీలపై లోగో వేసుకున్నందుకు స్పాన్సర్‌ షిప్ పేమెంట్‌ కూడా పెండింగ్ పడిందని చెబుతున్నారు.

అందుకే కృష్ణుడు.. కుచేలుడు

మహా భారతంలో కృష్ణుడు, కుచేలుడు బాల్య స్నేహితులు. కుచేలుడు అత్యంత పేదవాడు. అలాంటి పరిస్థితుల్లో కృష్ణుడు ఆదుకుంటాడు. మరి పాకిస్థాన్ క్రికెట్ బోర్డునూ కృష్ణుడు వంటి భారత్ ఆదుకుంటుందా?

Tags:    

Similar News