17 మందికి 60 రూమ్ లు.. పాక్ క్రికెటర్ల ప్రపంచ కప్ హాలిడే టూర్

పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థ అంటేనే అంత.. దేనిమీదా ఎవరికీ అదుపు ఉండదు. ఆటగాళ్లు ఫిట్ నెస్ తో ఉన్నారా? లేదా? తెలియదు

Update: 2024-06-20 15:30 GMT

పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థ అంటేనే అంత.. దేనిమీదా ఎవరికీ అదుపు ఉండదు. ఆటగాళ్లు ఫిట్ నెస్ తో ఉన్నారా? లేదా? తెలియదు.. అసలు కెప్టెన్ ను మించి ఇతరుల పెత్తనం.. బంధుప్రీతితో చోటు పొందినవారు.. ఇలా అనేక విమర్శలు. అందుకే ఆ జట్టు ప్రపంచ కప్ లు గెలిచినా ఆశ్చర్యమే. ఓడినా ఆశ్చర్యమే.. తాజా టి20 ప్రపంచ కప్‌ లో అమెరికా చేతిలో ఓటమి పాలై.. ఆపై భారత్ చేతిలో చిత్తయింది. దీనికితోడు ఐర్లాండ్-అమెరికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పాక్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. లీగ్ దశలోనే అవమానకరంగా నిష్క్రమించింది.

ఇంటికి వెళ్లకుండా ఇంగ్లండ్ కు

చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే పిల్లలు ఇంటికి వెళ్లేందుకు భయపడి దాక్కునేవారు. అలానే ఇప్పుడ పాక్ ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లలేదు. అభిమానుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే భయంతో కెప్టెన్ బాబర్‌ అజామ్‌, ఐదారుగురు అమెరికా నుంచి వస్తూ ఇంగ్లండ్ లో ఆగినట్లు సమాచారం. కొన్ని రోజులు ఇక్కడే ఉండి పాక్‌ కు వెళ్తారని కథనాలు వచ్చాయి. ఇప్పుడు వారి గురించి మరో కీలక విషయం బయటపడింది.

ప్రపంచ కప్ నకు కాదు.. హాలిడేకు

17 మంది ఆటగాళ్లకు.. మరో 17 మంది అధికారులు.. వీరికి 60 రూమ్ లు. ఇదీ పాకిస్థాన్ వ్యవహారం. ఎప్పుడూ అమెరికా చూడనట్లుగా ఇంతమంది వెళ్లడం ఏమిటంటూ మాజీ క్రికెటర్ అతిక్ ఉజ్‌ జమాన్‌ ప్రశ్నిస్తున్నాడు. క్రికెట్‌ ఆడటానికి కాకుండా కుటుంబంతో కలిసి హాలి డే ట్రిప్‌ ఎంజాయ్‌ చేసినట్లు ఉందని ధ్వజమెత్తాడు.

తమ కాలంలో కోచ్, మేనేజర్‌ మాత్రమే జట్టుతో ఉండేవారని, అంతా క్రమశిక్షణతో సాగేదని పేర్కొన్నాడు. కాగా, ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలకు ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులను ఎందుకు అనుమతిచ్చారని అతడు నిలదీశాడు. కుటుంబంతో ఉంటే ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని వ్యాఖ్యానించాడు. జట్టు సభ్యులంతా కూర్చుని తినాల్సిన సమయంలోనూ ఆటగాళ్లు కుటుంబసభ్యులతో ఉన్న వీడియోలు బయటకొచ్చాయని ఆరోపించాడు.

జట్టులో మూడు వర్గాలు.. కెప్టెన్ ఎవరో?

పాక్ క్రికెట్ కెప్టెన్ గా 2023 వన్డే ప్రపంచ కప్ వరకు బాబర్ ఆజామ్ కొనసాగాడు. ఆ కప్ లో ఘోర వైఫల్యంతో అతడు తప్పుకొన్నాడు. దీంతో పేసర్ షాహీన్ షా ఆఫ్రీదీకి పగ్గాలు అప్పగించారు. టి20 ప్రపంచ కప్ నకు ముందు మళ్లీ బాబర్ ను కెప్టెన్ చేశారు. అయితే, అతడూ ఇప్పడు తప్పుకొన్నాడు. దీంతోపాటు వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ తనను కెప్టెన్ చేయలేదని ఆగ్రహంతో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. దీంతో పాక్ జట్టు మూడు వర్గాలుగా చీలిపోయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి కాబోయే కెప్టెన్ ఎవరో?

Tags:    

Similar News