ట్రెండింగ్: పట్టు విడవని పాక్.. తగ్గేదేలే అంటున్న భారత్!
త్వరలో పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందా లేదా అనే విషయం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్స్ లో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే.
త్వరలో పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందా లేదా అనే విషయం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్స్ లో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో నిన్న మొన్నటి వరకూ ఉన్న హోప్స్ కూడా ఆవిరైపోతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం... వాస్తవ పరిస్థితులకు విభిన్నంగా పాక్ క్రికెట్ బోర్డు మొండి వైఖరే అని తెలుస్తోంది.
అవును... ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని అంటున్నారు. మరోపక్క టోర్నమెంట్ ను హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తేనే పాల్గొంటానని భారత్ (బీసీసీఐ) ఐసీసీకి తేల్చి చెప్పింది. అయినప్పటికీ పాకిస్థాన్ మాత్రం మొండిపట్టు వీడటం లేదు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఛైర్మన్ మొహసీన్ నఖ్వీ మీడియాతో మాట్లాడారు. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో పనులను పరిశీలించిన అనంతరం స్పందించిన ఆయన... ఛాంపియన్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించడానికి ఆసక్తి చూడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా... ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన ప్రతీ జట్టూ పాకిస్థాన్ కు వచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పిన నఖ్వీ... ఈ విషయంలో భారత్ కు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తాము వారితో చర్చించి పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా అన్ని జట్లూ పాకిస్థాన్ కు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ప్రధానంగా... "క్రీడలు వేరు, రాజకీయాలు వేరు.. క్రీడలను రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు.. త్వరలో ఐసీసీ షెడ్యూల్ ను ప్రకటిస్తుంది.. తద్వారా మేము సన్నాహాలను పూర్తి చేస్తాం.. ఐసీసీ స్పందన కోసం ఎదురుచూస్తున్నాం" అంటూ నఖ్వీ స్పష్టం చేశారు!
కాగా... వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. పాక్ వెళ్లి ఆడేందుకు భారత్ జట్టు సిద్ధంగా లేని విషయాన్ని ఐసీసీకి స్పష్టం చేసింది. దీంతో... టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించాలని.. ఇందులో భాగంగా భారత్ ఆడే మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డును ఐసీసీ కోరింది. అయితే... అందుకు పీసీబీ అంగీకరించడం లేదు!