ఆ యువ క్రికెటర్ ది స్వీయ తప్పిదామా? కాలదోషమా?

పృథ్వీ ఇంగ్లండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేయడంతో టీమిండియాలోకి ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.

Update: 2023-08-12 09:59 GMT

స్కూల్ క్రికెట్ లోనే సంచలనాలు రేపి రంజీల్లోనూ అదరగొట్టి 18 ఏళ్లకే టీమిండియాలోకి వస్తూ వస్తూనే సెంచరీ బాదేసిన క్రికెటర్ ఇప్పడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాడు. ప్రతిభ లేదని కాదు.. ఫామ్ లేదని కాదు.. ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడ ఉన్నాడు? అని అంటున్నారు. మూడేళ్ల కిందటే టీమిండియాకు దూరమైన అతడు మూడు రోజుల కిందట ఇంగ్లండ్ గడ్డపై వన్డేలో డబుల్ సెంచరీ కొట్టి ఔరా అనిపించాడు. అయితే, అతడి రూపం చూసినవారంతా మళ్లీ విమర్శలకు దిగారు. ఇదంతా ముంబై బ్యాట్స్ మన్ పృథ్వీ షా గురించి.

ఏ జట్టులోనూ లేడు..

టీమిండియా ప్రస్తుతం మూడు జట్లుగా ఉంది. వెస్టిండీస్ తో టి20 సిరీస్, ఐర్లాండ్ టి20 సిరీస్, ఆసియా కప్, ఏసియన్ గేమ్స్ ఇలా ప్రతి టోర్నీకి కొందరు మినహా వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేశారు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ఆఖరికి రుతురాజ్ గైక్వాడ్ వంటి వారూ కెప్టెన్ అయిపోయారు. కానీ, వీరందరి కంటే ప్రతిభావంతుడిగా పేరుతెచ్చుకున్న పృథ్వీ షా మాత్రం ఏ జట్టులోనూ లేడు. బహుశా దీంతోనే విరక్తి చెందాడేమో..? ఇంగ్లాండ్‌ దేశవాళీ జట్టు నార్తాంప్టన్‌ షైర్‌ కు ఆడేందుకు వెళ్లిపోయాడు. ఇటీవల సోమర్‌ సెట్‌ పై డబుల్ సెంచరీ కొట్టాడు.

ఫిట్ నెస్ ఉందా అసలు..?

ప్రస్తుతం పృథ్వీ షా వయసు 23. కానీ, అతడి ఆకారం చూస్తే అలా లేడు. పృథ్వీ ఫిట్ నెస్ కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నదా? అన్న అనుమానం కలుగుతోంది. బరువు పెరిగిపోయిన అతడు టీమిండియా ప్రమాణాలకు సరిపోతాడా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు యువత అందరూ మదనపడుతున్న జట్టు రాలిపోవడం (హెయిర్ ఫాల్) పృథ్వీ షానూ వదల్లేదు. 23 ఏళ్లకే తలపై దాదాపు జుట్టుంతా ఊడిపోయిన అతడిని అంకుల్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి హెల్మెట్ వాడకం జుట్టు రాలేందుకు ప్రధాన కారణం. క్రికెటర్లకూ ఇది తప్పలేదు. ఒకప్పుడు సెహ్వాగ్ ఇలానే ఇబ్బంది పడ్డాడు. చివరకు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకున్నాడు.

తిరిగొస్తాడా?

భారత జట్టు ఇప్పడు ట్రాన్స్ ఫార్మ్ దశలో ఉంది. రోహిత్, కోహ్లి, జడేజా వంటి స్టార్లు మూడేళ్లకు మించి ఆడరు. ఇదే సమయంలో ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్, తిలక్ వర్మ వంటి యువతేజాలు దూసుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో పృథ్వీకి పునరాగమనం చాన్సుందా? అంటే కాస్త క్లిష్టమేనని చెప్పాలి. అయితే, అత్యంత ప్రతిభావంతుడైన అతడు నిలకడ చూపితే టీమిండియాకు ఎంపికవడం కష్టం మాత్రం కాదు. ఇటీవల 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్సర్లతో అతడు 244 పరుగులు చేసిన తీరు చూస్తే మాత్రం షా ఇంకా శ్రమించాలి అన్న అభిప్రాయం కలుగుతోంది. ముఖ్యంగా ఫిట్ నెస్ లో.

డబుల్ సెంచరీతో వార్తల్లోకి..

పృథ్వీ ఇంగ్లండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేయడంతో టీమిండియాలోకి ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. వాస్తవానికి ఇందులో అతడి తప్పిదం కొంత. మరికొంత బ్యాడ్ లక్ ఉంది. 2018 వెస్టిండీస్ పై అరంగేట్ర టెస్టులోనే సెంచరీ కొట్టని షాను 2020 ఆస్ట్రేలియా టూర్ లో బ్యాడ్ లక్ వెంటాడింది. అనవసర క్యాచ్ కు ప్రయత్నిస్తూ పాదానికి గాయం చేసుకున్నాడు. దాన్నుంచి కోలుకునే లోపే నడుం దగ్గర మరో గాయమైంది. 2019లో అనాలోచితంగా వాడిన దగ్గు మందు కారణంగా డోపీగా తేలి 8 నెలల నిషేధానికి గురయ్యాడు. ఈలోపు ఫామ్ కోల్పోయాడు. దేశవాళీల్లో, ఐపీఎల్‌ లో విఫలమయ్యాడు. క్రమంగా సెలక్టర్లు అతడిని పరిగణించడం మానేశారు. 2023 ఐపీఎల్ లో తుది జట్టులో చోటే దక్కలేదు. ఇక కొన్ని నెలల కిందట ఇన్‌ స్టా గ్రామ్‌ ఇన్ఫ్లూయెన్సర్‌ తో గొడవపడి పృథ్వీ వార్తల్లో నిలిచాడు. అతడి తప్పేమీ లేదని పోలీసులు తేల్చినా వివాదంలో మాత్రం పేరు అతడిదే ఎక్కువగా వినిపించింది.

ఫిట్ నెస్ మెరుగుపడాలి..

అత్యంత సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన షా.. టీమిండియాకు తిరిగి ఎంపికయ్యేందుకు చాలా కష్టపడాల్సి ఉంది. స్ట్రోక్ ప్లే, టెక్నిక్‌ ఉన్న అతడు. ఎలాంటి బౌలింగ్‌ నైనా బాదేస్తాడు. అలవోకగా భారీ షాట్లు ఆడగలడు. కానీ ఈ ప్రతిభ చాలామందిలో ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం కొనసాగాలంటే కావాల్సింది ఆట మీద శ్రద్ధ, ఫిట్‌ నెస్‌. కాగా, షా సహచరుడు శుభ్‌ మన్‌ ప్రస్తుతం టీమిండియా కొత్త సూపర్‌ స్టార్‌. యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్‌ దుమ్మురేపుతున్నారు. పంత్ తిరిగి ఎలాగూ వస్తాడు. తిలక్ గట్టి పోటీదారుగా ఎదుగుతున్నాడు. వీరందరినీ దాటుకుని షా రావాల్సి ఉంది. అయితే, ప్రతిభకు లోటు లేని పృథ్వీ.. ఇప్పటికైనా ఫిట్‌ గా తయారవడం, క్రమశిక్షణతో ఆట మీద దృష్టిసారించడం అవసరం. తద్వారా త్వరలోనే టీమిండియాలోకి తిరిగొస్తాడు.

Tags:    

Similar News