సఫారీ బ్యాటర్స్ ఊచకోత... డికాక్ సరికొత్త రికార్డ్!
అవును... తొలుత బ్యాటింగ్ కి దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ లో ఓపెనర్ డికాక్... 140 బంతుల్లో 174 పరుగులు సాధించాడు.
ప్రపంచకప్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈస్థాయిలో భారీ స్కోర్ రావడంలో ఓపెనర్ డికాక్ కీలక భూమిక పోషించాడు. ఆన్ సైడ్, ఆఫ్ సైడ్, స్ట్రైట్ డ్రైవ్, ఫుల్ షాట్... ఒకటేమిటి మైదానం నలువైపులా బౌండరీలు బాదాడు. బాల్ వేయడం ఆలస్యం... మైదానంలో ఫీల్డర్స్ తో పాటు ప్రేక్షకుల మెడలు పైకి చూశాయంటే అతిశయోక్తి కాదు.
అవును... తొలుత బ్యాటింగ్ కి దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ లో ఓపెనర్ డికాక్... 140 బంతుల్లో 174 పరుగులు సాధించాడు. ఇందులో 15 ఫోర్లు, 7 సిక్స్ లు ఉన్నాయి. దీంతో ఈ వరల్డ్ కప్ లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా నిలిచింది. ఇంతకముందు పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 163 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. సెంచరీ అనంతరం "తగ్గేదేలే" అనే యాక్షన్ కూడా చేసి చూపించాడు.
ఇలా డబుల్ సెంచరీకి సమీపిస్తున్న సమయంలో సిక్స్ కి ప్రయత్నించిన డికాక్... బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... డికాక్ అవుట్ అయిన తర్వాత కూడా బంగ్లా ఫీల్డర్ల్ కళ్లల్లో ఆనందం కలగలేదు. అంటే... అప్పటికే చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేశాడు డికాక్. అయినా సరే ఎంతో కొంత హ్యాపీ ఫీలవుదామనుకుంటే అప్పటికే మార్క్ రం (69 బంతుల్లో 60; 7 ఫోర్లు) బాదేసిన చేదు జ్ఞాపం వెంటాడుతోంది.
అనంతరం... మార్క్ రం అవుటయ్యాడు, డికాక్ అవుటయ్యాడు అని ఆనందపడదామనే ఆలోచన కూడా బంగ్లా బౌలర్లకు రాకుండా జాగ్రత్తపడ్డాడు మాస్ మహారాజ్ క్లాసిన్! 49 బంతులు ఆడిన క్లాసిన్... 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 90 పరుగులు చేశాడంటే... ఊచకోత ఏ రీతిగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. బంగ్లా బౌలర్ల ముఖాల్లో నెత్తుటి చుక్క లేకుండా అయిపోయిందన్నా అతిశయోక్తి కాదు! అనంతరం... లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా... 15 బంతులు ఆడిన డేవిడ్ మిల్లర్ 1 ఫోరు 4 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు.
ఇలా వచ్చిన ప్రతీ బ్యాట్స్ మెన్ ఫీల్డర్లకు పెద్దగా పని లేకుండా.. బౌండరీ బాయ్స్ కు మాత్రమే పని చెబుతూ ముందుకు కదిలారు! ఫలితంగా... 5 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 382 భారీ స్కోర్ చేసింది. ఈ వరల్డ్ కప్ లో డికాక్ కు ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం. ఈ ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా బ్యాటర్స్ మొత్తం 26 ఫోర్లు, 19 సిక్సర్లు బాదారు. అంటే... 218 పరుగులు కేవలం బౌండరీలతోనే రాబట్టారన్నమాట.
ఇక బంగ్లా బౌలర్లలో హసన్ మహ్ముద్ 2 వికెట్లు తీసుకోగా.. షకిబుల్ హసన్, మెహ్డీ హసన్, షరిఫుల్ ఇస్లాం లు తలో వికెట్ తీసుకున్నారు.