రోహిత్ కు టి20 కెప్టెన్సీ? నిజమైతే బీసీసీఐ బిగ్ రాంగ్ స్టెప్
టీమిండియా టి20 కెప్టెన్సీ బాధ్యతలు మరోసారి రోహిత్ శర్శకు అప్పగిస్తారనే కథనాలు వస్తున్నాయి. బీసీసీఐ ఈ దిశగా ఆలోచన కూడా చేస్తోందని చెబుతున్నారు.
వయసు పైబడింది.. ఫిట్ నెస్ లేదు.. దూకుడు తగ్గింది.. కుర్రాళ్ల ఆటకు సెట్ కాడు.. అని చెప్పి కెప్టెన్ గా తప్పించి.. జట్టులోకి ఎంపికకు కూడా ఆలోచించని క్రికెటర్ ను ఏడాది తర్వాత పిలిచి మరీ కెప్టెన్సీ ఇస్తోంది బీసీసీఐ. ఇందులో ఆ ఆటగాడు తప్పేమీ లేదు.. వాస్తవానికి టీమిండియా దిగ్గజాల్లో అతడు ఒకడు. తప్పంతా బీసీసీఐదే. అసలు ఎందుకు ఏడాది కిందట వద్దనుకున్నారు..? ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? అనేది జవాబివ్వాల్సిన ప్రశ్న.
కుర్రాళ్లు ఉండగా..?
టీమిండియా టి20 కెప్టెన్సీ బాధ్యతలు మరోసారి రోహిత్ శర్శకు అప్పగిస్తారనే కథనాలు వస్తున్నాయి. బీసీసీఐ ఈ దిశగా ఆలోచన కూడా చేస్తోందని చెబుతున్నారు. అయితే, రోహిత్ ఇందుకు సుముఖంగా ఉన్నాడా? లేడా? అనేది తెలియరాలేదు. కాగా, నిరుడు టి20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ టి20 ఆడలేదు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చేసి వరుసగా టోర్నీలు ఆడిస్తున్నారు. స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లిని కూడా ఎంపికలోకి తీసుకోవడం లేదు. రోహిత్, కోహ్లి స్థాయి ప్రకారం వేటు వేసేంత నిర్ణయం బీసీసీఐ తీసుకోలేదు. కానీ, టి20లకు మాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని వారు కోరారని అనుకోవాలి. ఇప్పుడు హార్దిక్ గాయపడిన నేపథ్యంలో మళ్లీ రోహిత్ ను కెప్టెన్ చేయాలని బీసీసీఐ చూస్తున్నట్లు తెలుస్తోంది
వన్డే ప్రపంచ కప్ ప్రదర్శన ఆధారంగా
ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ కప్ లో టీమిండియాను ఫైనల్ కు చేర్చాడు రోహిత్ శర్మ. జట్టును ఫైనల్ వరకు అద్భుతంగా నడిపించాడు. గొప్ప నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. అందుకనే.. టి20లకు మళ్లీ కెప్టెన్ చేయాలని బీసీసీఐ యోచిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, రోహిత్ ఏ స్థాయి ఆటగాడో అందరికీ తెలిసిందే. వన్డేల్లో పదివేలకు పైగా పరుగులు, మూడు డబుల్ సెంచరీలు, అంతర్జాతీయ టి20ల్లో నాలుగు సెంచరీలు, టెస్టుల్లో మంచి సగటు.. ఇలా ఎందులోనూ వంక పెట్టడానికి వీల్లేదు. కానీ, రోహిత్ కు ఇప్పుడు 37 ఏళ్లు. పైగా ఫిట్ నెస్ సమస్యలు ఉన్నాయి. టి20లు కుర్రాళ్ల గేమ్. దూకుడులో రోహిత్ కు ఎవరూ సాటిరాకున్నా.. ఫిట్ నెస్ కూడా ముఖ్యమే కదా? అందులోనూ యశస్వి జైశ్వాల్ వంటి 20 ఏళ్ల వయసు కుర్రాళ్లు దూసుకొస్తుండగా, రోహిత్ ను మరోసారి జట్టులోకి తీసుకోవడం సరికాదు.
మరో రెండేళ్లు టెస్టులు, వన్డేలు
టి20ల విషయం పక్కన పెడితే రోహిత్ మరో ఏడాదిన్నర అయినా వన్డేలు, టెస్టులు ఆడగలడు. టి20లకు ఎలాగూ హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లను కెప్టెన్లుగా పరిగణిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు. ఇలాంటి సమయంలో పొట్టి ఫార్మాట్ కు ఏడాదికాలంగా దూరంగా ఉన్న రోహిత్ శర్మను మళ్లీ పిలవడం ఎందుకనేది ప్రశ్న. మరోవైపు వచ్చే ఏడాది మేలో టి20 ప్రపంచ కప్ ఉంది. అలాంటిది భవిష్యత్ వ్యూహాలకు తగినట్లు జట్టును తయారు చేసుకోకుండా వెటరన్ అయిన రోహిత్ వైపు చూడడం ఏమిటో అర్థం కాని విషయం.
కొసమెరుపు: బీసీసీఐ ఆలోచన ఎలా ఉన్నా.. రోహిత్ తిరిగి అంతర్జాతీయ టి20ల్లోకి వచ్చేందుకు మొగ్గుచూపకపోవచ్చు. ఇదే బాటలో కోహ్లి నిర్ణయం కూడా ఉంటుందని చెప్పొచ్చు. అయితే, వీరిద్దరూ దిగ్గజాలు. ఏ ఫార్మాట్ కైనా తగినట్లు ఆడగలరు. తమలో సత్తా ఉందని భావిస్తే టి20ల్లోకి తిరిగొచ్చినా ఆశ్చర్యం లేదు.