కామన్ సెన్స్ మరిచి.. షేక్ 'హ్యాండిచ్చిన' ఆర్సీబీ.. మాజీల ధ్వజం
కేవలం 7 మ్యాచ్ లలోనే గెలిచినా.. ఐపీఎల్ 17వ సీజన్ లో ప్లే ఆఫ్స్ చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)
కేవలం 7 మ్యాచ్ లలోనే గెలిచినా.. ఐపీఎల్ 17వ సీజన్ లో ప్లే ఆఫ్స్ చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). ఇందులో వరుసగా ఆరు మ్యాచ్ లను బెంగళూరు నెగ్గడం గమనార్హం. బహుశా ఐపీఎల్ చరిత్రలో గతంలో ఏ జట్టుకూ లేని ప్రత్యేకత ఇది అనడంలో సందేహం లేదు. అయితే, రెండు రోజుల కిందట సొంతగడ్డపై బెంగళూరు చివరి లీమ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి ప్లేఆఫ్స్ చేరింది. డిఫెండింగ్ చాంపియన్ అయిన చెన్నైతోనే తొలి మ్యాచ్ ఆడి ఓడిన బెంళూరు చివరి మ్యాచ్ లో మాత్రం అద్భుత ప్రదర్శనతో నెగ్గింది. దీంతోనే ఆ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. ఆఖరి ఓవర్లో ఆర్సీబీ బౌలర్ యశ్ దయాళ్ ఏడు పరుగులే ఇచ్చి దిగ్గజం ధోనీ వికెట్ తీయడంతోనే బెంగళూరు గెలుపు ఖరారైంది.
కరచాలనం మరిచారా?
విజయం సాధించిన ఆనందంలో వేడుకల్లో మునిగిపోయిన బెంగళూరు ఆటగాళ్లు.. చెన్నైఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని విస్మరించారు. కాస్త సమయం తర్వాత చేతులు కలిపినా అప్పటికే ఆలస్యమైంది. మరోవైపు చివరి ఓవర్ రెండో బంతికి ఔటయి డగౌట్ లో కూర్చుకున్న ధోనీ మ్యాచ్ ముగిశాక మైదానంలోకి వచ్చి ఆర్సీబీ ఆటగాళ్ల కోసం వేచి చూశాడు. అయితే, వారు ఎంతకూ రాకపోవడంతో పక్కనున్నవారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ధోనీ తీరును ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేశారు. అయితే, ధోనీ వద్దకు కోహ్లి వెళ్లినట్లు వీడియోలు ట్రెండ్ అయ్యాయి.
ముందే వెళ్లి ఉండాల్సింది..
ఉత్కంఠగా సాగిన మ్యాచ్ అనంతరం వెంటనే వెళ్లి చెన్నై ఆటగాళ్లకు ఆర్సీబీ ప్లేయర్లు కరచాలనం చేసి ఉండాల్సిందని, సంబరాలు ఆ తర్వాత చేసుకున్నా సరిపోయేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ తో పాటు క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లే వ్యాఖ్యానించాడు. ‘‘మ్యాచ్ పూర్తయ్యాక కూడా అంతా చూశా. ఆర్సీబీ గెలుపును చాలా ఎంజాయ్ చేసింది. ఆటగాళ్లు అభిమానులకు చేతులు ఊపారు. ఇంటికెళ్లే దశ నుంచి ప్లే ఆఫ్స్ చేరడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, ప్రత్యర్థితో కరచాలనం చేసేంత సమయం కూడా లేదా? వారు చేసిన దానికి పశ్చాత్తాప పడతారా? బహుశా దిగ్గజం ధోనీకిదే చివరి మ్యాచ్ ఏమో? ఆటగాళ్లందరూ అతడి చుట్టూ చేరి ఒక్క క్షణం కరచాలనం చేసి ఉంటే బాగుండేది. మ్యాచ్ ముగిసిన తర్వాత గౌరవం కోసం కరచాలనం చేసి ఉన్నా మర్యాదగా ఉండేది’’ అని వాన్ వ్యాఖ్యానించాడు. కాగా, బోగ్లే మాట్లాడుతూ ‘ఏం జరిగిందో నేను గమనించలేదు. మీరు వరల్డ్ కప్ విజేతగా నిలిచినా సరే.. భావోద్వేగాలను ప్రదర్శించడంలో తప్పేంలేదు. కానీ, ప్రత్యర్థి ఆటగాళ్లతో మర్యాదపూర్వకంగా కరచాలనం చేయాలి. క్రికెట్ గొప్పదనాన్ని తెలిపేందుకు ఇదొక మార్గం. మ్యాచ్ లోనే పోరాడుతాం.. విరోధులం కాదు అని తెలియజేసే పద్ధతి ఇది’’ అని భోగ్లే తెలిపాడు.