"శివమ్"మెత్తిన చెన్నై... గుజరాత్ పై భారీ విక్టరీ!
తాజాగా తొలిమ్యాచ్ గెలిచి ఉత్సాహంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ ను తేరుకోలేని స్థాయిలో అన్నట్లుగా భారీ దెబ్బ కొట్టింది.
కొత్త కుర్రాడు కెప్టెన్ అయ్యాడు.. ఇలా ధోనీ కాకుండా కెప్టెన్ మారాడు కదా పెర్ఫార్మెన్స్ లోను, ఫలితాల్లోనూ ఏమైనా మార్పు ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం చేసిన వారికి మరోసారి క్లారిటీ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్! ప్రత్యర్థి ఎవరైనా, సీజన్ ఏదైనా తమ పెర్ఫార్మెన్స్ లో తేడా ఉండదని.. కష్టపడేతత్వం తమకు పుష్కలంగా ఉందని చెప్పకనే చెబుతున్నారు. తాజాగా తొలిమ్యాచ్ గెలిచి ఉత్సాహంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ ను తేరుకోలేని స్థాయిలో అన్నట్లుగా భారీ దెబ్బ కొట్టింది.
చెన్నై భారీ స్కోర్!
అవును... ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా తన రెండో మ్యాచ్ లో ఇంకో రెండో మ్యాచ్ ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ తో తలపడింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సమయంలో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై... భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
కెప్టెన్ తో కలిపి అదిరే ఆరంభం "రచిన్"చెన్!:
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కి అదిరే ఆరంభం దొరికింది. ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్నాడన్న ఫీలింగ్ ఎక్కడా రానివ్వలేదు. పైగా.. ప్రపంచ కప్ లోనే దుమ్ము దులిపాను గుర్తుందా అన్నట్లుగ గతం గుర్తు చేస్తూ విరుచుకుపడ్డాడు. స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించాడు. బౌలర్ ఎవరైనా బాదుడు మాత్రమే ముఖ్యం అన్నట్లుగా చెలరేగాడు.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ దెబ్బకు చెన్నై 5 ఓవర్లకే వికెట్లేమీ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. పైగా మొదటి ఓవర్ కేవలం 2 పరుగులే రాగా... మిగిలిన నాలుగు ఓవర్లలో, ప్రతీ ఓవర్ లోనూ ఫోరూ, స్కిక్సూ ఉండేలా చూసుకుంటూ 56 పరుగులు సాధించారు.
రచిన్ ను బోల్తా కొట్టించిన రషీద్!:
మాంచి దూకుడు మీదున్న రచిన్ రవీంద్ర హాఫ్ సెంచరీకి దగ్గరవుతున్నాడనుకున్న సమయంలో... రషీద్ ఖాన్ వేసిన గుడ్ లెంగ్త్ బాల్ కి స్టంప్ అవుట్ అయ్యాడు. అప్పటికి రచిన్ స్కోరు (46: 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లు). ఈ నెంబర్స్ ని చూసి అర్ధం చేసుకోవచ్చు రచిన్ దూకుడు ఎలా సాగిందని చెప్పడానికి!
వంద దాటించిన రుతురాజ్ - రహానే!:
రచిన్ ఔటైన అనంతరం రహానే బ్యాటింగ్ కి వచ్చాడు. ఈ సమయంలో రహానే తో కలిపి అదే దూకుడు కంటిన్యూ చేసే బాధ్యత రుతురాజ్ తీసుకున్నాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 42 పరుగులు జోడించారు. దీంతో... 10 ఓవర్లకు చెన్నై స్కోరు ఒక వికెట్ నష్టానికి 104 పరుగులకు చేరింది.
రహానే – రుతురాజ్ ఔట్!:
10 ఓవర్లకు వందపైగా పరుగులతో చెన్నై పటిష్టమైన స్థితికి చేరిన తర్వాత 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రహానే అవుటయ్యాడు. అనంతరం జాన్సన్ బౌలింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ పెవిలియన్ కు చేరాడు. రుతురాజ్ గైక్వాడ్ (46: 36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అప్పటికి చెన్నై స్కోరు 13 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 128 పరుగులకు చేరింది.
శివమెత్తిన శివమ్!
రహానే అవుటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన శివమ్ దుబే చెలరేగి ఆడాడు. బౌలర్ ఎవరు, బౌండరీ ఎంత పొడుగు అనే విషయాలను పరిగణలోకి తీసుకోలేదు. కేవలం 23 బంతుల్లో రెండు ఫోర్లు, 5 సిక్స్ ల సాయంతో 53 పరుగులు సాధించాడు. తాను ఉతకడం మొదలుపెడితే ఎలా ఉంటుందనేది మరోసారి చేసి చూపించాడు.
ఈ దూకుడు బ్యాటింగ్ లకు తోడు చివర్లో మిచెల్ (24) కూడా తోడవ్వడంతో చెన్నై సూపర్ కింగ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్!:
207 పరుగుల భారీ లక్ష్యంతో గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగింది. ఈ సమయమో సాహో, శుభ్ మన్ గిల్ లు మైదానంలోకి బ్యాట్లు చేతపట్టి అడుగుపెట్టారు. అయితే... వీరికి బ్యాట్ ఝులిపించే పరిస్థితి ఏమాత్రం కల్పించలేదు చెన్నై బౌలర్లు. బ్యాటర్స్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కు ఏమాత్రం తగ్గకుండా వాళ్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు.
శుభ్ మన్ గిల్, సాహో అవుట్:
2.4 ఓవర్లకు 28 పరుగులతో కాస్త పోటీ ఇచ్చేట్లు కనిపించిన గుజరాత్ టైటాన్స్ కు నెక్స్ట్ బంతికే భారీ దెబ్బ తగిలింది. ఇందులో భాగంగా... 2.5 ఓవర్లో దీపక్ చహార్ బౌలింగ్ లో శుభ్ మన్ గిల్ (8) పెవిలియన్ కు చేరాడు. ఇదే క్రమంలో 4.3 ఓవర్లో దీపక్ చాహర్ బౌలింగ్ లోనే సాహో (21) కూడా అవుటయ్యాడు. దీంతో 5 ఓవర్లకు గుజరాత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 35!
ఏమాత్రం పోటీలో నిలవని గుజరాత్:
తొలి ఐదు ఓవర్ల లోపే తక్కువ స్కోరుకే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ కు చేరడం తో మిగిలిన బ్యాటర్స్ పై ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఓపెనర్లు ఇద్దరూ ఔట్ అయిన తర్వాత ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ వచ్చిన విజయ్ శంకర్ (12) కూడా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో... 8 ఓవర్లు ముగిసే సరికి టైటాన్స్ కోరు 3 వికెట్ల నష్టానికి 57 పరుగులకు చేరింది.
మిల్లర్ ఉన్నంత సేపు ఆశలు సజీవం!:
ఒకపక్క సాధించాల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోతుంది.. మరొపక్క వికెట్లు పడిపోతున్నాయి.. అయినప్పటికీ విధ్వంసకారుడు మిల్లర్ ఉన్నారనే ధైర్యం ఒక్కటే టైటాన్స్ కి మిగిలింది. అయితే తుషార్ బౌలింగ్ లో రహానే అందుకున్న ఓ అద్భుతమైన క్యాచ్ కు 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు కూడా ఔటయ్యాడు. మరోవైపు సుదర్శన్ ఆటలో మార్పులేదు.
30 బంతుల్లో 93 పరుగులు!:
ఈ సమయంలో గుజరాత్ స్కోరు 15 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 114 పరుగులకు చేరుకుంది. అప్పటికే గుజరాత్ ఓటమి ఖాయమైపోయిందనే కామెంట్లు వినిపించాయి. ఈ పరిస్థితుల్లో టెయిలెండర్లు కూడా ఎలాంటి అద్భుతాలూ చేయకపోయే సరికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
భారీ విక్టరీ:
ఈ విధంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... అన్ని డిపార్ట్మెంట్లలోనూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 63 పరుగుల తేడాతో.. శుభ్ మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ను మట్టికరిపించింది.