రోహిత్‌ కు నేర్పాలా... ఆ అవసరం లేదంటున్న అశ్విన్!

అక్షర్ పటేల్ గాయపడటంతో ప్రపంచకప్ జట్టులోకి ఆఖరి సమయంలో ఎంట్రీ ఇచ్చిన అశ్విన్.. కేవలం మొదటి మ్యాచ్‌ కే పరిమితమయ్యాడు.

Update: 2023-11-24 04:55 GMT

వన్డే ప్రపంచకప్ లో తొలిమ్యాచ్ నుంచి సెమీస్ వరకూ వరుస విజయాలతో టీమిండియా సాగించిన జైత్రయాత్రకు ఫైనల్‌ లో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ప్రపంచకప్‌ ను మిస్ చేసుకుంది. అయితే ఇదే టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌ లో టీమిండియా అదరగొట్టింది. చెన్నైవేదికగా జరిగిన మ్యాచ్‌ లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. నాటి మ్యాచ్‌ లో ఆడిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆ తర్వాత రిజర్వ్ బెంచ్‌ కే పరిమితం అయ్యాడు.

ఆ మ్యాచ్ అనంతరం ప్రపంచకప్‌ లో టీమిండియా ఆడిన 10 మ్యాచ్‌ లకు అశ్విన్‌ కు అవకాశం దక్కలేదు. అక్షర్ పటేల్ గాయపడటంతో ప్రపంచకప్ జట్టులోకి ఆఖరి సమయంలో ఎంట్రీ ఇచ్చిన అశ్విన్.. కేవలం మొదటి మ్యాచ్‌ కే పరిమితమయ్యాడు. ఆ మ్యాచ్ లో 10 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రపంచకప్ అనుభవాలను పంచుకున్నాడు అశ్విన్. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ పై ఆసక్తికవ్యాఖ్యలు చేశాడు.

అవును... తాజాగా వరల్డ్ కప్ లో తన అనుభవాలు పంచుకున్న అశ్విన్... కెప్టెన్ రోహిత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందులో భాగంగా... రోహిత్‌ శర్మకు సెంచరీలు చేయడం నేర్పాల్సిన అవసరం లేదని అన్నాడు. ఇదే సమయంలో... ప్రపంచకప్‌ ఫైనల్లో రోహిత్‌ క్రీజులో కొనసాగివుంటే సెంచరీ సాధించేవాడని చాలామంది అంటున్నారని.. కాని జట్టు కోసం అతను అలా ఆడాల్సివచ్చిందని స్పష్టం చేశాడు.

ఇదే సమయంలో టాస్‌ గెలిచి ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ తీసుకోవడంపై ఆసీస్ చీఫ్‌ సెలక్టర్ జార్జ్‌ బెయిలీని అడగ్గా... అతడు చెప్పిన సమాధానం విస్తుపోయేలా చేసిందని అశ్విన్ తెలిపాడు. ఇందులో భాగంగా... తాము ఇప్పటికే ఐపీఎల్‌, ద్వైపాక్షిక సిరీస్‌ లు చాలానే ఆడినట్లు చెప్పిన జార్జ్ బెయిలీ... సాధారణంగా ఎర్రమట్టి అనేది మ్యాచ్‌ జరిగే కొద్దీ విచ్చిన్నమవుతుందని.. అదే... నల్ల మట్టితో తయారు చేసిన పిచ్‌ అయితే అలా ఉండదని క్లారిటీ ఇచ్చాడని తెలిపాడు.

అదేవిధంగా... ఫ్లడ్ లైట్ల కింద ఈ పిచ్ చాలా బాగుంటుందని.. ఎర్రమట్టి పిచ్‌ పై తేమ ప్రభావం ఉండదని.. అయితే, మధ్యాహ్నం వేళ నల్లమట్టి పిచ్‌ పై టర్నింగ్‌ ఉంటుంది కానీ... అది రాత్రి సమయానికి కాంక్రీట్‌ లా మారిపోతుందని.. అందుకే తాము తొలుత బౌలింగ్ ఎంచుకున్నామని చెప్పాడని అశ్విన్ చెప్పాడు. దీంతో... ఆ సమాధానం తనను విస్తుపోయేలా చేసిందని అశ్విన్ తెలిపాడు.

Tags:    

Similar News