భారత్ దెబ్బకు ఆ దేశ క్రికెట్ బోర్డు రద్దు.. దిగ్గజానికి బాధ్యతలు

వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుత విజయాలతో దూసుకెళ్తోంది. దంచుడే లక్ష్యంగా దూసుకెళ్తున్న దక్షిణాఫ్రికానూ కిందకు దించేసింది.

Update: 2023-11-06 06:39 GMT

వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుత విజయాలతో దూసుకెళ్తోంది. దంచుడే లక్ష్యంగా దూసుకెళ్తున్న దక్షిణాఫ్రికానూ కిందకు దించేసింది. అంతకముందు పాకిస్థాన్ ను, దానికిముందు ఆస్ట్రేలియాను, ఇంకా ముందుకెళ్తే న్యూజిలాండ్ ను, ఇంగ్లాండ్ నూ చిత్తు చేసింది. అది కూడా భారీ తేడాలతో మట్టికరింపించింది. ఈ జోరు మధ్యలో ఎదురైంది ఆ మాజీ చాంపియన్. పాపం.. ఇప్పటికే పలుసార్లు భారత్ చేతిలో దెబ్బతిని ఉన్న ఆ జట్టు.. బెబ్బులిలాంటి టీమిండియా దెబ్బకు బెంబేలెత్తింది.

అవి మామూలు దెబ్బలు కావు మరి..

మొదట బ్యాటింగ్ కు దిగితే 350 పైనే.. ప్రత్యర్థి 50కి ఆలౌట్.. ఇదేదో బ్యాడ్ లక్ కొద్దీ ఒక్కసారి జరిగింది కాదు. నెల వ్యవధిలో రెండుసార్లు జరిగింది. అసలే ప్రపంచ కప్ లో ఆ జట్టు తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. మూలిగే నక్కపై తాటిపండులా విరుచుకుపడింది భారత్. ఘోర అవమానంలాంటి ఓటములను ఏవిధంగానూ జీర్ణించుకోలేని పరిస్థితి. అందుకే ఆ దేశ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఏకంగా క్రికెట్ బోర్డునే రద్దు చేసింది. ఓ విధంగా చెప్పాలంటే భారత్ చేతిలో ఓటమి శ్రీలంకను కుదిపేస్తోంది. ఇప్పటికే ఆ దేశ బోర్డు క్రికెట్‌ బోర్డు కార్యదర్శి రాజీనామా చేశాడు. తాజాగా క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌ బోర్డును రద్దు చేసేసింది.

అక్కడ ఎప్పుడూ అనిశ్చతమే..

భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ లో క్రికెట్ ఎప్పుడూ అనిశ్చిత పరిస్థితుల్లో ఉండడం మనం చూశాం. కానీ, ఓ పదేళ్లుగా శ్రీలంక బోర్డు కూడా ఇలానే తయారైంది. మరీ ముఖ్యంగా దిగ్గజ ఆటగాళ్లు జయవర్ధనే, కుమార సంక్కర, దిల్షాన్ వంటి వారు రిటైర్ అయ్యాక లంక జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు బోర్డులో శక్తులు, రాజకీయాలు జట్టుపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ తప్పింది. ఆటగాళ్ల ప్రతిభకు గుర్తింపు లేకపోయింది. జట్టు ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. 1996 చాంపియన్, 1999, 2007 రన్నరప్ అయిన శ్రీలంక.. ఈసారి ప్రపంచ కప్ ఆడేందుకు అర్హత టోర్నీల్లో పాల్గొనాల్సి వచ్చిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ, శ్రీలంకది ప్రస్తుత కప్ లో దారుణ పరిస్థితే. ఏడు మ్యాచ్ లు ఆడి రెండే గెలిచింది. అందులోనూ ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 358 పరుగుల లక్ష్య ఛేదనలో ఘోరంగా విఫలమైంది. 55 పరుగులకే కుప్పకూలింది. వరల్డ్ కప్‌ చరిత్రలోనే నాలుగో అత్యల్ప స్కోరు ఇది. దీంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు రేగాయి. అయితే, అంతకుముందు ఆసియా కప్‌ ఫైనల్లోనూ 50 పరుగులకే ఆలౌటైంది.

దిగ్గజం సరిదిద్దుతాడా?

శ్రీలంక క్రికెట్ కు దిగ్గజం అంటే మాజీ కెప్టెన్ అర్జున రణతుంగనే. అనామక జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన ఘనత అతడి సొంతం. ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించి వారిని జాతీయ జట్టులోకి తీసుకున్నాడు. అలాంటి రణతుంగ నేతృత్వంలో ఇప్పుడు తాత్కాలిక క్రికెట్ బోర్డును నియమించారు.. ఏడుగురు సభ్యులున్న ఈ కమిటీలో శ్రీలంక సుప్రీం కోర్డు విశ్రాంత న్యాయమూర్తి కూడా ఉన్నారు. కాగా, ప్రపంచ కప్ లో సోమవారం శ్రీలంక.. బంగ్లాదేశ్‌ తో తలపడనుంది.

కొసమెరుపు : చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది శ్రీలంక ప్రభుత్వం తీరు. జట్టు ఓటమిపై సమీక్ష ఏమీ లేకుండానే.. చర్యలకు దిగింది. అంతేకాదు.. బోర్డుపై ఆ దేశ క్రీడల మంత్రి రోషన్‌ రణసింగే తీవ్రంగా విమర్శలకు దిగారు. ‘‘క్రికెట్ బోర్డు సభ్యులకు పదవిలో ఉండే హక్కు లేదు. జట్టు ఘోర ఓటముల నేపథ్యంలో తక్షణమే వారంతా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే బాగుండేది. బోర్డులో అవినీతి మితిమీరింది. అందుకే తొలగించాం’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు బోర్డు కార్యాలయంపై దాడి జరిగే ప్రమాదం ఉందని భావించిన కొలంబో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం గమనార్హం.

Tags:    

Similar News