అనూహ్యం.. ఆ ప్లేయర్ కు సన్ రైజర్స్ రూ.20 కోట్ల రికార్డు ధర

ఈ ధరకు కొనుక్కున్నది ఎవరో కాదు.. సన్ రైజర్స్ హైదరాబాద్ కావడం గమనార్హం.

Update: 2023-12-19 10:11 GMT

మేటి ఆటగాడే కానీ.. గాయాల బెడద ఉంది.. ఉత్తమ పేసర్.. కానీ స్ట్రయిక్ బౌలర్ కాదు. గతంలోనూ రికార్డు ధర పలికినా.. దానికి న్యాయం చేయలేదు. సీజన్ మధ్యలో ఎప్పుడైనా గాయపడవచ్చు. లేదా.. జాతీయ జట్టుకే ప్రాధాన్యం అని వచ్చే సీజన్ నుంచి ఆడకపోవచ్చు. అయినా.. ఆ ఆటగాడికి రికార్డు స్థాయి ధర పెట్టారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో. ఈ ధరకు కొనుక్కున్నది ఎవరో కాదు.. సన్ రైజర్స్ హైదరాబాద్ కావడం గమనార్హం.


ఐపీఎల్ వేలం మంగళవారం దుబాయ్‌ లో ప్రారంభమైంది. దేశ, విదేశీ ఆటగాళ్లు ఈ వేలం జాబితాలో ఉన్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్‌లు కోసం పోటీపడుతున్నాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు ఉన్నాయి. భారత్ లో జరిగిన ప్రపంచ కప్ ప్రతిభ చాటి న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్‌ మిచెల్‌ ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 14 కోట్లు పెట్టి దక్కించుకుంది. పంజాబ్‌ కింగ్స్ చివరి వరకూ పోటీ పడి విఫలమైంది. కొన్నాళ్లుగా భారత జట్టులోకి వచ్చి పోతున్న పేసర్ హర్షల్‌ పటేల్‌ కు ఏకంగా రూ.11.75 కోట్లు దక్కాయి. అతడు 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రావడం గమనార్హం. గుజరాత్‌ టైటాన్స్‌ తో పోటీపడి మరీ పంజాబ్‌ అతడిని దక్కించుకుంది.

కనీవినీ ఎరుగని.. బేస్ ప్రైస్ కు పదిరెట్లు

తాజా వేలంలో రికార్డులకే రికార్డు ధర ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ది. ఐపీఎల్‌ చరిత్రలోనే అతడు రికార్డు సృష్టించాడు. రూ. 20.5 కోట్లకు కమ్మిన్స్ ను సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. ఇందుకోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తీవ్రంగా పోటీ పడింది. అసలు కమిన్స్‌ కనీస ధర రూ. 2 కోట్లు మాత్రమే. అంటే.. దానికి పది రెట్లు ఎక్కువ ధరకు అతడు అమ్ముడుపోయాడు.

సన్ రైజర్స్ నిర్ణయం సరైనదేనా?

నిరుడు కూడా సన్ రైజర్స్ ఇంగ్లండ్ హిట్టర్ హ్యారీ బ్రూక్ ను రూ.13.5 కోట్లకు దక్కించుకుని సంచలనం రేపింది. కానీ, బ్రూక్ విఫలం కావడంతో అవకాశాలు ఇవ్వలేదు. మళ్లీ ఇప్పుడు కమ్మిన్స్ పై రూ.20 కోట్లు పెట్టింది. దీంతో సన్ రైజర్స్ నిర్ణయం సరైనదేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాకు భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ అందించాడు కమ్మిన్స్. బహుశా దానిని చూసి కెప్టెన్సీ ఇవ్వాలని భావిస్తున్నదేమో? అయితే, కమ్మిన్స్ తరచూ గాయాలపాలవుతుంటాడు. అతడి కెరీర్ ప్రారంభమే గాయాలతో మొదలైంది. గతంలో కోల్ కతా అత్యధిక ధర పెట్టినా గాయంతో తప్పుకొన్నాడు. అలాంటి ఆటగాడిపై సన్ రైజర్స్ డబ్బులు ధారపోసింది. బహుశా కమ్మిన్స్ కూడా ఈ రేటు చూసి ఆశ్చర్యపోయి ఉంటాడనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News