ఉప్పల్ లో ఊచకోత ... టీమిండియా రికార్డుల మోత!
మరోపక్క కెప్టెన్ సూర్య కుమార్ యదవ్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్ లతో 75 పరుగులతో తనదైన విధ్వంసం చేశాడు.
పాకిస్థాన్ తో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-0తో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ ను టీమిండియా కుర్రాళ్లు పసికూనను చేసి ఆడుకున్నారు.. కాదు కాదు.. బంతాడుకున్నారు. ఇప్పటికే టీ20 సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించిన టీమిండియా.. చివరిదైన మూడో మ్యాచ్ లో భారీ విక్టరీ సాధించింది.
ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బౌలర్లను భారత్ బ్యాటర్లు వణికించేశారు. ఏ బాల్ వేస్తే అది ఫోర్ పోతుందా.. సిక్స్ గా గాల్లో లేస్తుందో అర్ధం కాక బంగ్లా బౌలర్లు బెదిరిపోయారు! ప్రధానంగా సంజూ శాంసన్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్ ల సాయంతో చేసిన 111 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ న భూతో న భవిష్యతీ అని చెప్పినా అతిశయోక్తి కాదేమో!
మరోపక్క కెప్టెన్ సూర్య కుమార్ యదవ్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్ లతో 75 పరుగులతో తనదైన విధ్వంసం చేశాడు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా (47), రియాన్ పరాగ్ (34) అల్లల్లాడించారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 297 పరుగుల చేసింది. ఈ మ్యాచ్ లో రికార్డుల మోత మోగించింది.
అవును... ఉప్పల్ లో బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 సిరీస్ చివరిదైన మూడో మ్యాచ్ లో భారీ విజయం నమోదు చేస్తూ.. రికార్డుల మోత మోగించింది. ప్రధానంగా బ్యాటర్లు, మరో పక్క బౌలర్లు చెలరేగడంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మోగించిన రికార్డుల మోతను ఇప్పుడు చూద్దాం...!
* ఈ మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ఇవి టీ20 క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు కాగా.. టెస్ట్ హోదా ఉన్న జట్లలో అయితే భారత్ దే ఫస్ట్ ప్లేస్!
* ఇక పవర్ ప్లే లో చేసిన స్కోర్స్ లో టీమిండియా తాజాగా రికార్డ్ సృష్టించింది. ఈ మ్యాచ్ లో పవర్ ప్లే లో ఒక వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ఇప్పటికి ఇదే రికార్డు. రెండో టాప్ స్కోర్ 82/2 కూడా భారత్ ఖాతాలోనే ఉంది.
* ఇదే సమయంలో... నిర్ణీత 20 ఓవర్లలోనూ మొత్తం 18 ఓవర్లలో ప్రతీ ఓవర్ కూ 10కి మించి పరుగులు నమోదైన ఏకైన ఇన్నింగ్స్ కూడా భారత్ దే.
* ఇక సిక్స్ లు, ఫోర్ల రూపంలో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్ కూడా ఇదే. ఈ మ్యాచ్ లో భారత్ చేసిన 297 పరుగుల్లోనూ 232 పరుగులు పూర్తిగా బౌండరీల సాయంతోనే వచ్చాయి. ఇందులో భాగంగా... 22 సిక్స్ లు, 22 ఫోర్లతో అత్యధిక బౌండరీలు (6+4) నమోదు చేసిన లిస్ట్ లో భారత్ ఇన్నింగ్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
* ఈ క్రమంలోనే 100 పరుగుల మార్కును చేరుకొవడానికి భారత్ కు 7.1 ఓవర్లు పట్టింది. ఇది సరికొత్త రికార్డ్. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ 7.6 ఓవర్లతో భారత్ పేరిటే ఉండటం గమనార్హం.
ఇదే క్రమంలో... 200 పరుగుల మార్కును చేరుకొవడానికి భారత్ కు పట్టిన ఓవర్లు 14 కాగా... ఇప్పటి వరకూ ఈ రికార్డ్ సౌతాఫ్రికా పేరున ఉంది. సఫారీలు 13.5 ఓవర్లతో ఈ ఫీట్ సాధించారు.
* ఈ మ్యాచ్ లో తన స్థాయికి తగ్గట్టు ఆడి విధ్వంసం సృష్టించిన సంజు శాంసన్... టీ20ల్లో భారత్ తరుపున ఒకే ఓవర్ లో ఐదు కంటే ఎక్కువ సిక్స్ లు కొట్టిన రెండో బ్యాటర్ గా రికార్డ్ సృష్టించాడు. ఆ లిస్ట్ లో ఆరు సిక్స్ లతో యువరాజ్ టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే.
* ఇదే క్రమంలో... భారత్ తరుపున వేగంగా సెంచరీ చేసిన రెండో బ్యాటర్ గానూ సంజూ శాంసన్ నిలిచాడు. శాంసన్ 40 బంతుల్లో సెంచరీ చేయగా.. 35 బంతుల్లో రోహిత్ శర్మ ఆ ఫీట్ సాధించాడు.
* అదేవిధంగా... భారత్ తరుపున టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్. 2022లో శ్రీలంక మీద ఇషాన్ కిషాన్ చెసిన 89 పరుగులే ఇప్పటివరకూ ఇండియన్ కీపర్ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు.