బీసీసీఐ 'ధనా'ధన్.. 32 వేల కోట్లు 'వయా' మీడియా రైట్స్
భారీ జాక్ పాట్ ను అత్యధిక బిడ్ ను వేయటం ద్వారా సొంతం చేసుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన వయాకామ్ 18
బహుశా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆదాయం.. భవిష్యత్తులో ఓ చిన్న దేశపు బడ్జెట్ అంత అయినా ఆశ్చర్యం లేదు. ఒకటా.. రెండా? ఏకంగా రూ.32 వేల కోట్లు.. టీవీ, డిజిటల్ మీడియా ప్రసార హక్కులు పొందేందుకు బీసీసీఐకి వయాకామ్ చెల్లించనున్న మొత్తం ఇది. కళ్లుచెదిరే ఈ డబ్బుకు ఇంకొన్ని ఇతర ఆదాయా మార్గాలూ తోడవుతాయి. వాటిని కూడా కలిపితే ఇంకొన్ని వేలకోట్లు బీసీసీఐ ఖాతాలో చేరడం ఖాయం.
మొన్న రూ.26 వేల కోట్లు..
నిన్నగాక మొన్న బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) డిజిటల్ మీడియా హక్కులకు టెండర్లు ఆహ్వానించింది. దీనిని భారీ మొత్తానికి ఓ సంస్థ గెలుచుకుంది. ఆ మొత్తం ఎంతనో తెలిస్తే నోరెళ్లబెట్టక తప్పదు. ఎందుకంటే.. అది ఐపీఎల్ మరి.. కేవలం డిజిటల్ హక్కులే రూ.26,000 కోట్లు. దీనిని వయాకామ్ సొంతం చేసుకుంది. అంటే.. టీవీ రైట్స్ వేరే అన్నమాట. ఇప్పుడదే వయాకామ్ రూ.6 వేల కోట్లకు టీమిండియా స్వదేశీ సిరీస్ ల టీవీ, డిజిటల్ మీడియా హక్కులను దక్కించుకుంది. తద్వారా భారత క్రికెట్ ప్రసార రంగంలో తనదైన ఆధిపత్యం సాగించనుంది. ఇటీవల టీవీ, డిజిటల్ మీడియా హక్కుల కోసం బీసీసీఐ విడివిడిగా ఈ-బిడ్స్‌ను కోరింది.
ఆ రెండిటినీ తోసిరాజని..
బీసీసీఐ ఈ బిడ్స్ కు వయాకామ్ తో పాటు స్టార్ ఇండియా, సోనీ పోటీపడ్డాయి. కానీ, స్టార్, సోనీలను వయాకామ్ వెనక్కునెట్టింది. టీమిండియా సొంతగడ్డపై ఆడే టీవీ, డిజిటల్ మీడియా హక్కులను దక్కించుకుంది. కాగా, డిజిటల్ కు రూ.3101 కోట్లు, టీవీ ప్రసార హక్కులకు రూ.2862 కోట్లను వయాకామ్ చెల్లించనుంది. ప్రస్తుత సరళి ప్రకారం రూ.5963 కోట్లలో డిజిటల్ ప్రసారాలకు ఎక్కువ ఆదాయం లభించింది. ఇటీవల రూ.26 వేల కోట్లకు ఐపీఎల్ డిజిటల్ హక్కులను వయాకామ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ (టీవీ), ఐసీసీ టోర్నీలు మినహా అన్ని ప్రధాన క్రికెట్ మ్యాచ్ ల ప్రసార హక్కులు వయాకామ్ చేతిలో ఉన్నట్లవుతోంది.
ఈ నెల 22న స్వదేశంలో ఆస్ట్రేలియాతో మొదలయ్యే మూడు మ్యాచ్ ల సిరీస్ తో వయాకామ్ ఒప్పందం అమల్లోకి రానుంది. 2028 మార్చి 31న ఒప్పందం ముగుస్తుంది. ‘‘ఐదేళ్ల కాలానికి బీసీసీఐ టీవీ, డిజిటల్
మీడియా హక్కులను గెలుచుకున్న వయాకామ్ 18కు అభినందనలు. ఐపీఎల్, డబ్ల్యూఐపీఎల్ తర్వాత రెండు రంగాల్లోనూ భారత క్రికెట్ వృద్ధి చెందుతూనే ఉంది’’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు.
వచ్చే అయిదేళ్లలో స్వదేశంలో భారత్ 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20లు సహా మొత్తం 88 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. అంటే ఒక్కో మ్యాచ్ విలువ రూ.67.76 కోట్లు. గత ఒప్పందంతో (రూ.60 కోట్లు)తో పోల్చుకుంటే ఒక్కో మ్యాచ్‌కు రూ.7.76 కోట్లు ఎక్కువ. ఆ ఒప్పందంలో బీసీసీఐకి రూ.175 కోట్లు ఎక్కువ ఆదాయం లభించింది. భారత్ 102 మ్యాచ్‌లు ఆడటంతో రూ.6138 కోట్లు ఆదాయం సమకూరింది. వచ్చే అయిదేళ్ల భారత్ అత్యధికంగా ఆస్ట్రేలియాతో 21 మ్యాచ్‌లు ఆడనుంది. ఇంగ్లాండ్‌తో 18, న్యూజిలాండ్ 11, దక్షిణాఫ్రికాతో 10, వెస్టిండీస్‌తో 10, అఫ్గానిస్తాన్‌తో 7, శ్రీలంకతో 6, బంగ్లాదేశ్‌తో 5 మ్యాచ్‌లలో తలపడుతుంది.