'పాక్ గెలవాలి'.. మహిళ టి20 వరల్డ్ కప్ లో భారత్ కు వింత పరిస్థితి

తాజాగా మరోసారి ప్రపంచ కప్ జరుగుతున్నప్పటికీ.. సెమీఫైనల్ కు అయినా చేరుతుందా? అనే సందిగ్ధ నెలకొంది.

Update: 2024-10-14 13:30 GMT

హార్డ్ హిట్టర్లు.. మేటి స్పిన్నర్లు.. మెరుగైన పేస్ బౌలర్లతో ఆధునిక మహిళల క్రికెట్ లో పెద్ద జట్టే అయినా ఇప్పటివరకు టి20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకోలేకపోయింది భారత జట్టు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లు మనకంటే బలంగా ఉండడమే దీనికి కారణం. న్యూజిలాండ్ ను కూడా తీసిపారేయలేం. ఆసీస్ మహిళలు అయితే మరీ పురుషుల తరహాలో దూకుడుగా ఆడుతుంటారు. ఈ నేపథ్యంలోనే మన జట్టు ప్రపంచం చాంపియన్ అయ్యే అవకాశాలు దక్కడం లేదు. తాజాగా మరోసారి ప్రపంచ కప్ జరుగుతున్నప్పటికీ.. సెమీఫైనల్ కు అయినా చేరుతుందా? అనే సందిగ్ధ నెలకొంది.

ఉప ఖండం జట్లపైనే ప్రతాపం?

మహిళల క్రికెట్ లో భారత్ ప్రతాపం అంతా ఉప ఖండం జట్లపైనే అన్నట్లుంది. ప్రస్తుత టి20 ప్రపంచ కప్ లో తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన మన జట్టు.. ఆ తర్వాత పాకిస్థాన్, శ్రీలంక మహిళలపై గెలిచింది. ఆదివారం ఆస్ట్రేలియాపై పరాజయం పాలైంది. దీంతోపాటే సెమీస్ అవకాశాలూ సంక్లిష్టంగా మారాయి. గ్రూప్-ఎ లో సెమీస్ చేరాలంటే కనీసం మూడు మ్యాచ్ లు గెలవాలి. కానీ, భారత్ రెండే నెగ్గింది. ఇక మనం చేయాల్సింది ఏమంటే.. ‘పాకిస్థాన్’ గెలవాలని కోరుకోవడమే. అంటే మొన్న ఓడించిన జట్టును నేడు గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే..?

ఈ ఒక్కసారి గెలువు..

పాకిస్థాన్ పై మనపై ఆడినా, వేరే జట్లపై ఆడినా ఓడిపోవాలనే కోరుకుంటాం. కానీ, ఈసారి మాత్రం గెలవాలని కోరుతున్నారు భారత అభిమానులు. ఎందుకంటే.. టీ20 ప్రపంచకప్‌ లో అలాంటి పరిస్థితి నెలకొంది. సోమవారం గ్రూప్‌ చివరి మ్యాచ్‌ లో న్యూజిలాండ్‌ తో పాకిస్థాన్ ఆడనుంది. ఒకవేళ పాక్ గెలిస్తే భారత్‌ సెమీస్‌ కు చేరే చాన్స్ లు సజీవంగా ఉంటాయి. కివీస్‌ విజయం సాధిస్తే మాత్రం భారత్ ఇంటికే. అప్పుడు న్యూజిలాండ్‌ సెమీస్‌ వెళ్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా నాలుగుకు నాలుగు విజయాలతో సెమీస్‌ చేరింది. 4 మ్యాచ్‌ లలో 2 విజయాలతో భారత్ రెండో స్థానంలో ఉంది. కివీస్‌ 3 మ్యాచ్‌ లలో రెండు నెగ్గింది. పాయింట్లలో మూడో స్థానంలో కొనసాగుతోంది. రన్‌ రేట్‌ లో భారత్‌ (+0.322) కంటే న్యూజిలాండ్‌ (+0.282) వెనకబడింది. పాకిస్థాన్ చేతిలో కివీస్‌ ఓడిపోతే.. భారత్‌ గ్రూప్-ఎలో రెండో స్థానంతో సెమీస్ కు వెళ్తంది.

ఓ మెలిక ఉంది..

న్యూజిలాండ్ పై పాకిస్థాన్ గెలిచినా ఓ మెలిక ఉంది. అదేంటంటే.. రన్ రేట్ తేడా మరీ ఎక్కువ ఉండకూడదు. ప్రస్తుతం పాక్‌ నెట్‌ రన్‌ రేట్‌ (-0.488) చాలా తక్కువగానే ఉంది. ఈ విషయంలో భారత్ ను అధిగమించని విధంగా పాకిస్థాన్ గెలుపు ఉండాలి. అలాగైతేనే భారత్‌ సెమీ ఫైనల్స్ కు వెళ్తుంది. అంటే పాక్ గెలవాలి కానీ.. మన కంటే తక్కువ స్థాయిలో ఉండాలి అని కోరుకోవాలి. ఉదాహరణకు న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌ కు దిగి 150 పరుగులు చేస్తే.. పాకిస్థాన్ ఈ స్కోరును 9.1 ఓవర్లలోనే అందుకోకూడదు. పాక్ గనుక 55 బంతుల్లోనే టార్గెట్ ఛేదిస్తే ఆ జట్టే సెమీస్ కు వెళ్తుంది.

అదే పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు 150 పరుగుల టార్గెట్ పెడితే.. దానిని అందుకోలేకపోతే కివీస్ ఇంటికెళ్లిపోతుంది. కానీ.. పాకిస్థాన్ గెలుపు తేడా మాత్రం 53 పరుగులుగా ఉండకూడదు.53 కంటే ఎక్కువ పరుగుల తేడాతో పాక్ గెలిస్తే ఆ జట్టే సెమీ ఫైనల్స్ కు వెళ్తుంది. ఇవేవీ కాకుండా మ్యాచ్ రద్దయినా న్యూజిలాండ్ కే మేలు. కారణం.. చెరో పాయింట్ ఇస్తారు కాబట్టి. మ్యాచ్ రద్దయితే, భారత్-పాక్ రెండూ ఇంటికే. అంతేకాక.. పాకిస్థాన్ పై ఒక్క పరుగుతో గెలిచినా చాలు న్యూజిలాండ్ కే సెమీస్ బెర్తు.

కొసమెరుపు: భారత్ నే ఓడించిన న్యూజిలాండ్ కు పాకిస్థాన్ పెద్ద కష్టం కాదు. అయితే, మన దాయాది అద్భుతం చేయాలని కోరుకుందాం.

Tags:    

Similar News