'తుపాకీ' స్పెషల్ 'హేమా'సెమీస్.. ప్రపంచ కప్ లో ఆ 4 జట్లు ఇవే?
ప్రపంచ కప్ లో దూసుకెళ్తున్న జట్లు ఏవంటే ముందుగా భారత్ పేరు చెప్పాలి. ఆ తర్వాత న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వస్తాయి.
42 లీగ్ మ్యాచ్ ల వన్డే ప్రపంచ కప్ లో 26 మ్యాచ్ లు పూర్తయ్యాయి. పది జట్లలో సెమీ ఫైనల్స్ కు చేరేది నాలుగే. ఆ నాలుగు స్థానాల కోసం ఏడు పెద్ద జట్లు పోటీలో ఉన్నాయి. కానీ, మ్యాచ్ లు జరుగుతున్న కొద్దీ సమీకరణాలు మారుతున్నాయి. ముందుగా అంచనాలు పెట్టుకున్న జట్లు ఇంటిముఖం దిశగా ఉన్నాయి. కాస్త అనుమానంగానే సెమీ ఫైనల్ కు చేరతాయని భావించిన జట్లు ముందంజ వేస్తున్నాయి. మొత్తానికి భారత్ వేదికగా క్రికెట్ లో ఉత్తమమైనదిగా భావించే రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ప్రపంచ కప్ అందరినీ ఆకట్టుకుంటోంది.
చాంపియన్ చిత్తు..
ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే హాట్ ఫేవరెట్ గా క్రికెట్ పండితులు అంచనాలు వేసిన జట్టు.. అత్యంత దూకుడుగా ఆడుతూ.. బ్యాట్స్ మెన్ అనుకూల భారత పిచ్ లపై ఆకాశమే హద్దుగా చెలరేగుతుందనుకున్న జట్టు ఏదంటే.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్. కానీ, న్యూజిలాండ్ తో తొలి మ్యాచ్ లోనే ఆ జట్టుకు అంత సత్తా లేదని అర్థమైంది. మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడితే గెలిచింది ఒక్కటే. కానీ, నెట్ రన్ రేట్ అత్యంత దారుణం. మిగిలిన నాలుగు మ్యాచ్ లలో మూడు (భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్)తో ఆడాల్సినవి. ఇంగ్లండ్ ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే వీటిలో కనీసం రెండు గెలిచినా అద్భుతమే. సరే.. నాలుగుకు నాలుగు గెలిచినా, ఇంగ్లండ్ పాయింట్లు 10 మాత్రమే అవుతాయి. ఎలాగూ నెట్ రన్ రేట్ (-1.634) అత్యల్పంగా ఉంది కాబట్టి ఆ జట్టు సెమీస్ కు చేరడం కష్టమే. తద్వారా ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత అంచనాలతో ప్రయాణం మొదలుపెట్టి తీవ్ర వైఫల్యం మూటగట్టుకున్న జట్టుగా ఇంగ్లండ్ మిగిలిపోనుంది.
దాయాదికీ దారులు మూసుకున్నట్లే..?
స్వదేశం తరహా పిచ్ లు, అనుకూల వాతావరణం తదితర కారణాలతో ప్రపంచ కప్ లో పాకిస్థాన్ నూ కొందరు ఫేవరెట్ గా భావించారు. బాబర్ అజామ్, రిజ్వాన్ వంటి బ్యాట్స్ మెన్, షాహీన్ షా ఆఫ్రిది వంటి బౌలర్ ఉన్నందున పాక్ అద్భుతాలు చేస్తుందని అనుకున్నారు. కానీ, చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఎప్పటిలాగానే ఓడిపోయింది. సరే, కోలుకుంటుందిలే అనుకుంటుండగా.. అఫ్గానిస్థాన్ చేతిలో చిత్తయింది. ఐదు మ్యాచ్ లలో గెలిచింది రెండే. దక్షిణాఫ్రికాపై గెలుపు అంత సులభం కాదు. రన్ రేట్ కూడా (-0.400) మైనస్ లో ఉంది. దక్షిణాఫ్రికాపై గెలిస్తే ఏమైనా ఆశలుంటాయి. అప్పుడు పాయింట్లు 6కు చేరతాయి. కానీ, మిగతా మూడు మ్యాచ్ లలో విజయం సాధిస్తుందా? అనేది కచ్చితంగా చెప్పలేం. ఒకవేళ అన్నీ గెలిచినా పాయింట్లు 12 మాత్రమే అవుతాయి.
లంకకు వీలుందా?
విజయ పథంలో ఉన్న నాలుగు జట్లు కాకుండా.. ఇప్పటికైతే సెమీస్ అవకాశాలు కాస్త సజీవంగా ఉన్న జట్టు శ్రీలంక. ఐదు మ్యాచ్ లలో మూడు ఓడినప్పటికీ, రన్ రేట్ (-0.205) ఫర్వాలేదు. అయితే, సెమీస్ చేరుతుందని పూర్తి నమ్మకంతో మాత్రం చెప్పలేం. ఎందుకంటే లంక ఆట అంత గొప్పగా ఏమీలేదు. నాలుగు మ్యాచ్ లకు నాలుగు గెలిస్తేనే చాన్స్. కానీ, ఇందులో భారత్ తో ఒక మ్యాచ్ ఉంది. ఇటీవలే ఆసియా కప్ లో హైదరాబాదీ సిరాజ్ ధాటికి లంక ఎలా కుప్పకూలిందో అందరికీ తెలిసిందే.
ఈ నాలుగు అయితే సెమీస్ కు పక్కా చక్కటి ఆటతీరుతో, ఆటగాళ్ల రాణింపుతో ప్రపంచ కప్ లో దూసుకెళ్తున్న జట్లు ఏవంటే ముందుగా భారత్ పేరు చెప్పాలి. ఆ తర్వాత న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వస్తాయి. సొంత గడ్డపై టీమిండియా దుమ్మురేపుతోంది. ఐదుకు ఐదు మ్యాచ్ లు గెలిచింది. సెమీస్ రేసులో అందరికంటే ముందుంది. ఆదివారం ఇంగ్లండ్ పైనా నెగ్గితే సెమీస్ బెర్తు దాదాపు ఖాయం. ఎందుకంటే.. మిగతా మ్యాచ్ లలో ఒకటి శ్రీలంక, రెండు దక్షిణాఫ్రికా, మూడు నెదర్లాండ్స్. వీటిలో రెండైనా భారత్ గెలవగలదు. అందుకే రోహిత్ సేనకు సెమీస్ చాన్స్ దక్కినట్లే. ఇక దక్షిణాఫ్రికా కేవలం నెదర్లాండ్స్ చేతిలో మాత్రమే ఓడింది. అది కూడా అనూహ్యం. అయితే, నాలుగు మ్యాచ్ లు గెలిచి +2.370 రన్ రేట్ తో అందరి కంటే మెరుగ్గా ఉంది. మరో రెండు గెలిచినా చాలు.. సఫారీలు సెమీస్ చేరినట్లే. కాగా, న్యూజిలాండ్ కు ప్రపంచ కప్ లలో సెమీస్ ఖాయంగా చేరే జట్టుగా పేరుంది. దానిని నిలుపుకొంటూ ఆ జట్టు ముందంజ వేస్తోంది. భారత్ పై తప్ప ఆడిన వాటిలో మిగతా నాలుగు జట్లపై గెలుపొంది, +1.481 రన్ రేట్ తో మెరుగ్గా ఉంది. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాది మరో కథ. భారత్, దక్షిణాఫ్రికాలతో ఓడిపోయినప్పటికీ, బలంగా పుంజుకున్నది. పాయింట్ల పట్టికలో టాప్ -3లో ఉన్న మిగతా మూడు జట్లు ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడగా, ఆసీస్ రెండింట్లో పరాజయం పాలైంది. కాకపోతే +1.142 రన్ రేట్ తో నిలిచింది. ఇప్పటికైతే ఈ నాలుగు జట్లు సెమీస్ చేరతాయని భావింవచ్చు.
భారత్-ఆసీస్, దక్షిణాఫ్రికా-కివీస్ పైన చెప్పుకొన్న నాలుగు జట్లూ సెమీస్ చేరడం సరే. అక్కడ ఎవరితో ఎవరు తలపడతారు? అనేది కీలకం. ఎందుకంటే గత ప్రపంచ కప్ లో భారత్ ను ఓడించింది న్యూజిలాండ్. గత కప్ లలో దక్షిణాఫ్రికాను సెమీస్ లలో పడగొట్టింది ఆస్ట్రేలియా. ఫామ్ ప్రకారం చూస్తే.. టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్ లో నిలుస్తుంది. 2వ స్థానంలో దక్షిణాఫ్రికా, మూడో ప్లేస్ లో న్యూజిలాండ్, నాలుగులో ఆస్ట్రేలియా ఉంటాయని అంచనా వేద్దాం. దీనిప్రకారం భారత్-కివీస్, దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా సెమీస్ లో తలపడతాయి. లేదా.. భారత్ రెండో స్థానానికి పరిమితమై, దక్షిణాఫ్రికా టాప్ లోకి వచ్చి, నంబర్ 3గా ఆస్ట్రేలియా, నంబర్ 4గా న్యూజిలాండ్ నిలిస్తే ప్రత్యర్థులు మారతారు. భారత్ అప్పడు కూడా న్యూజిలాండ్ తో సెమీస్ ఆడాల్సి ఉంటుంది. ఇలా.. పాయింట్లలో మార్పులు వచ్చే కొద్దీ స్థానాలు మారి ప్రత్యర్థులూ మారతారు.