ఓటీటీ సొంత కుంప‌టితో సినిమాకి పెద్ద ముప్పే!

ఓటీటీల మ‌ధ్య పోటీ ఎలా ఉంద‌న్న‌ది చెప్పాల్సిన పనిలేదు. అలాగ‌ని కంటెంట్ ని అంత ఈజీగా కొన‌డం లేదు.

Update: 2024-11-29 17:30 GMT

ఓటీటీల మ‌ధ్య పోటీ ఎలా ఉంద‌న్న‌ది చెప్పాల్సిన పనిలేదు. అలాగ‌ని కంటెంట్ ని అంత ఈజీగా కొన‌డం లేదు. మునుప‌టిలా డిజిట‌ల్ ప్లాట్ ఫాంపై లావ‌దేవీలు అంత సుల‌భం కాదు. ఎన్నో ఆంక్ష‌ల మ‌ధ్య బ‌య‌ట కంటెట్ ని ఓటీటీలు కొనుగోలు చేస్తున్నాయి. ఎంత పెద్ద సినిమా అయినా...ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా? ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ఓటీటీలిప్పుడు ఎంతో తెలివిగా బిజినెస్ చేస్తున్నాయి. న‌ష్టాలొస్తే మావ‌ల్ల కాదంటూ ముందే స్కిప్ అయిపోతున్నాయి.

దీంతో నిర్మాత ఓటీటీకి సినిమా అమ్మాలంటే ర‌క‌ర‌కాల ఒప్పందాల మీద విక్ర‌యించాల్సి వ‌స్తోంది. దీంతో నిర్మాత‌లకు ఒత్తిడి త‌ప్ప‌డం లేదు. అమెజాన్ ప్రైమ్నె, నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద ప్లేయర్‌లు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత సినిమాల సంఖ్య భారీగా పెరిగింది. 2025 ఓటీటీ రిలీజ్ లు అప్పుడే షెడ్యూల్ చేయ‌డం కూడా జ‌రిగిపోయింది. ముఖ్య‌మైన హాలీడే సీజ‌న్లు అన్నింటిని రిలీజ్ ప్ర‌కారం లాక్ చేసి పెట్టుకున్నాయి.

దీంతో కొత్త‌గా వ‌చ్చే డిజిట‌ల్ ఒప్పందాలన్నింటి స‌ద‌రు సంస్థ‌లు తిర‌స్క‌రిస్తున్నాయి. దీంతో అనేక మీడియం బడ్జెట్ -చిన్న బడ్జెట్ చిత్రాలు విక్ర‌యం కాని ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ఇక్క‌డే నెట్ ప్లిక్స్- అమెజాన్ మ‌రింత తెలివిగా వ్య‌వ‌హ‌రించి చౌక ధ‌ర‌కే కొనుగోలు చేస్తున్నాయి. ఎవ‌రికి వారు రిలీజ్ లు క‌ష్టం అంటూ చెతులెత్తేయ‌డంతో? ఏదోలా రిలీజ్ చేయండి అంటే నిర్మాత‌లు బ్ర‌తిమలాడుకునే ప‌రిస్థితికి తీసుకొచ్చి చివ‌రిగా పేప‌ర్ వ్యూ డీల్ లో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.

మ‌రి ఈ ర‌క‌మైన ప‌రిస్థితి కి అస‌లు కార‌ణం ఏంటి? అంటే ఓటీటీ సంస్థ‌లు సొంత కంటెంట్ ని నిర్మించుకో వ‌డంతోనే ఈ స‌మ‌స్య మొద‌లైన‌ట్లు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌తీ ఒటీటీ సంస్థకు సొంత కంటెంట్ ఉంటుంది. వాళ్ల కంటెట్ ని వాళ్లే నిర్మించుకుని త‌మ మాధ్య‌మాల్లో రిలీజ్ చేసుకుంటున్నారు. అలాంట‌ప్పుడు బ‌య‌ట కంటెంట్ మీద ఆధార‌ప‌డాల్సిన ప‌నేముంది? అన్న‌ది ఓటీటీల వాద‌నగా క‌నిపిస్తుంది.

Tags:    

Similar News