బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై 'డెవలప్‌మెంట్ దెబ్బ'.. ఏం జరుగుతోందంటే!
ఆయనే మంచిర్యాల జిల్లా మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు
ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. సీనియర్ నాయకుడు కూడా. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్ పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. పైగా చిద్విలాసంగా ఉంటారు. హంగు ఆర్భాటా లకు అవకాశమే ఇవ్వరు. నవ్వుతూ పలకరిస్తారు. వయసు కూడా 70లలోకి వచ్చింది. అయితే.. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఆయనకు ఇప్పుడు అభివృద్ధి దెబ్బేస్తోందని అంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయనకు అసలు టికెట్ వస్తుందా? వచ్చినా.. ఆయన గెలుస్తారా? అనే సందేహాలు ముసురుకున్నాయి.
ఆయనే మంచిర్యాల జిల్లా మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు. ఈయన కు స్థానికంగా చాలా హిస్టరీ ఉంది. అందరితోనూ కలివిడిగా ఉంటారనే పేరు కూడా ఉంది. ఇదే ఆయన మంచితనం.
అయితే.. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చేసిన అభివృద్ది, తీసుకువచ్చిన ప్రాజెక్టులు ఇప్పుడు ఆయన చేయలేక పోతున్నారని స్థానికంగా పెద్దటాకే వినిపిస్తోంది. వరుసగా 2014, 2018లో బీఆర్ ఎస్ నుంచి విజయం దక్కించుకున్నా.. ఆయన ఇక్కడ పెద్దగా చేసింది ఏమీ లేదని స్థానికులు చెబుతున్నారు.
గోదావరి నది పక్కనే పారుతున్నా.. ఇంటింటికీ నీటిని అందించలేక పోయారని, కనీసం రోడ్లు కూడా నిర్మించలేక పోతున్నారని.. ఉపాధి, ఇతర ప్రాజెక్టులను పరుగులు పెట్టించడంలో వెనుకబడిపోయారని స్థానికంగా పెద్ద విమర్శలు వినిపిస్తున్నాయి.దీంతో దివాకర్ గ్రాఫ్ పడిపోయింది.
మరోవైపు.. ఈయన పరిస్థితిపై ఇప్పటికే ఎమ్మెల్యే నివేదికను తెప్పించుకున్న సీఎం కేసీఆర్ దాదాపు పక్కన పెట్టేశారని అంటున్నారు. ఈయన ప్లేస్‌లో మాజీ ఎమ్మెల్యే గడ్డం అర్వింద్ రెడ్డిని రంగంలోకి దింపేలా ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
అర్వింద రెడ్డి కూడా వరుసగా రెండు సార్లు ఇక్కడ విజయం దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసంజరిగిన ఉప ఎన్నికల్లో వరుసగా ఆయన రాజీనామా చేయడం.. మళ్లీ గెలవడం ద్వారా రికార్డు సృష్టించారు.
ఈ నేపథ్యంలో ఆయనకు ఈ సారి టికెట్ ఇవ్వడం ద్వారా.. ఇక్కడ విజయాన్ని వదులు కోకూడదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో దివాకర్ విషయం డోలాయమానంలో పడిందనే చర్చ సాగుతోంది. ఇదిలావుంటే.. కాంగ్రెస్ కూడా ఇక్కడ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకుని.. ప్రజల్లోకి వెళ్తుండడం గమనార్హం.