ప్రోటోకాల్ డ్రైవర్ ను ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అంత మాట అన్నారా?
ఒకటి తర్వాత ఒకటిగా వివాదాల్లోకి జారుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
ఒకటి తర్వాత ఒకటిగా వివాదాల్లోకి జారుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కమ్ మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి. ఇప్పటికే తన మాటలతో.. చేతలతో వార్తల్లోకి వస్తున్న ఆయన.. తాజాగా మరో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయనకు ప్రోటోకాల్ డ్రైవర్ గా పని చేస్తున్న ఉద్యోగి.. కౌశిక్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు.
అంతేకాదు.. సీపీకి కూడా కంప్లైంట్ చేశారు. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు దగ్గరకు వచ్చేసిన వేళలో.. ఈ తరహా ఆరోపణలు రావటం పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన సాయి క్రిష్ణ రెండు నెలలుగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వద్ద ప్రోటోకాల్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ నెల పదమూడున కరీంనగర్ లోని తీగలగుట్టలో జరిగిన ఒక ప్రోగ్రాం అనంతరం నర్సింగాపూర్ సర్పంచ్ ఇంటికి వెళ్లారు. అక్కడ కౌశిక్ రెడ్డి పీఏ సాగర్ రెడ్డితో ఫిర్యాదుదారుడు మాట్లాడుతున్నాడు.
ఆ టైంలో కౌశిక్ రెడ్డి పర్సనల్ డ్రైవర్ సంపత్ వచ్చి తనపై దాడి చేసినట్లుగా ఆరోపించారు. అదే రాత్రి సంపత్ మరో ఇద్దరితో కలిసి వచ్చి కులం పేరుతో తిడుతూ.. తనపై దాడికి పాల్పడినట్లుగా పేర్కొన్నాడు.
తనపై దాడి చేస్తుండటంతో తాను పరిగెత్తుకుంటూ ఎమ్మెల్సీ కౌశిక్ వద్దకు వెళ్లినట్లుగా చెప్పాడు. ''జరిగింది చెప్పాను. నీది ఏ కులం రా అని అడిగారు. ఎస్సీ అని చెప్పటంతో.. మీరు ఇగ మారరారా? అని తిడుతూ చెంపపై కొట్టాడు. తర్వాత పీఏని పిలిపించి.. మెడ పట్టి బయటకు గెంటేశాడు' అని వెల్లడించాడు.
తనకు ప్రాణభయం ఉందని.. తనకు న్యాయం చేయాలంటూ సీపీని కలిసి ఫిర్యాదు చేశాడు. అంతకు ముందు వచ్చినా.. సీపీ అందుబాటులో లేకపోవటంతో కాస్త ఆలస్యంగా కంప్లైంట్ చేసినట్లుగా చెప్పారు. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వివాదంపై గులాబీ ఎమ్మెల్సీ స్పందించాల్సి ఉంది.