లోకేష్ ఎఫెక్ట్.. ఏపీలో రెడ్ బుక్ లా.. తెలంగాణలో క్రికెటర్ ఎమ్మెల్యే బ్లాక్ బుక్!

గత ఏడాది చివరలో ఎన్నికలు జరిగిన రాజస్థాన్ లో ఓ అంశం బాగా ప్రచారంలోకి వెళ్లింది.

Update: 2024-06-26 10:10 GMT

గత ఏడాది చివరలో ఎన్నికలు జరిగిన రాజస్థాన్ లో ఓ అంశం బాగా ప్రచారంలోకి వెళ్లింది. అదే రెడ్ బుక్. కాంగ్రెస్ కు చెందిన అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని ప్రభుత్వంపై ఆరోపణలతో వచ్చిన ‘రెడ్ డైరీ’ సంచలనం రేపింది. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజేంద్ర గధ ఏకంగా ఈ బుక్ ను అసెంబ్లీలోనే ప్రదర్శించారు. గెహ్లాట్ కుమారుడు వైభవ్.. రాజస్థాన్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని చదివి వినిపించారు. ఇక రెడ్ బుక్ ను రాజస్థాన్ ఎన్నికల సందర్భంగా బీజేపీ బలంగా ప్రచారం చేసింది. ప్రధాని మోదీ నుంచి ఆ రాష్ట్ర నాయకుల వరకు రెడ్ బుక్ ను చూపుతూ ప్రసంగాలు చేశారు. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ సర్కారు ఏర్పాటైంది.

ఏపీలోనూ రెడ్ బుక్

ఇటీవల ఏపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా రెడ్ బుక్ ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలిచిన అధికారుల పేర్లను అందులో పేర్కొన్నారు. ఇష్టారీతిన కేసులు పెట్టడం, దాడులు చేయడం వెనుక ఉన్నవారి గురించి రెడ్ బుక్ లో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఇదే రెడ్ బుక్.. టీడీపీ గెలిచాక ఏకంగా పోస్టర్ అయింది. మరి లోకేశ్ ఇప్పుడు కీలక మంత్రిగా ఉన్నారు. తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో?

బ్లాక్ బుక్ రాస్తున్న క్రికెటర్ ఎమ్మెల్యే

తెలంగాణలోని హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి గతంలో పేస్ బౌలర్. హైదరాబాద్ రంజీ జట్టుకు అంబటి రాయుడితో కలిసి ఆడారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ (బీజేపీ)ని ఓడించారు. అయితే, నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఉమ్మడి కరీంనగర్ నాయకుడిగా ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను టార్గెట్ చేశారు. ఎన్టిపిసి ఫ్లై యాష్ విషయంలో మంత్రిపై అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతి చేయలేదంటేహైదరాబాద్ ఫిలింనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పొన్నం ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి సవాల్ కు మంత్రి స్పందించలేదు. దీంతో ఆయన 100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తేలిందని కౌశిక్ ఆరోపించారు. తాను పొన్నం ప్రభాకర్ పేరుతో బ్లాక్ బుక్ రాస్తానని ప్రకటన చేశారు. దీంతో ఏపీలో రెడ్ బుక్ లాగా.. తెలంగాణలో బ్లాక్ బుక్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ వారికేదీ బుర్ర?

బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయాక బాగా డీలాపడింది. దీంతో కాంగ్రెస్ పై సాధారణ ఆరోపణలే తప్ప గట్టిగా పోరాటం చేయడం లేదు. ఇలాంటి సమయంలో బ్లాక్ బుక్ అంటూ కౌశిక్ రెడ్డి కొత్తగా ప్రయత్నం చేయడం ప్రజలను ఆలోచింపజేస్తోంది.

Tags:    

Similar News