జగిత్యాల ముదురుతున్న వివాదం !
జీవన్ రెడ్డి అలకపై ఢిల్లీలో అధిష్టానంతో సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అలజడి రేగిన విషయం తెలిసిందే. జీవన్ రెడ్డిని సముదాయించడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ప్రయత్నించినా కొలిక్కి రాకపోవడంతో నేరుగా అధిష్టానం రంగంలోకి దిగి జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించింది.
జీవన్ రెడ్డి అలకపై ఢిల్లీలో అధిష్టానంతో సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చాయి. స్వయంగా రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి జీవన్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడం తన తప్పిదం అని, భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు రాకుండా చూసుకుంటానని స్పష్టంచేశాడు. ఈ సంధర్భంగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తారా అని మీడియా జీవన్ రెడ్డిని ప్రశ్నించగా అధిష్టానంతో కలిసి పనిచేస్తానని చెప్పారు. పరోక్షంగా ఎమ్మెల్యేతో కలిసే ప్రసక్తే లేదన్నారు.
బయట వ్యవహారం ఇలా ఉంటే జగిత్యాల గల్లీలలో మాత్రం పంచాయతీ ముదురుతుంది. పార్టీలో చేరిన సంజయ్ కుమార్ తన అనుకూలురతో కాంగ్రెస్ చేరిక సంధర్భంగా శుభాకాంక్షలు అని ఫ్లెక్సీలు వేయించారు. ఇందులో ఎక్కడా జీవన్ రెడ్డి పేరు లేకపోవడం గమనార్హం. అయితే కాంగ్రెస్ లో ఎమ్మెల్యే చేరికను జీర్ణించుకోలేని జీవన్ రెడ్డి అనుచరులు పోటీగా కౌంటర్ ఫ్లెక్సీలు వేయించారు. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అని అందులో పేర్కొన్నారు. దీంతో వివాదం మరింత ముదురుతుంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారానికి ఎలాంటి ముగింపు పలుకుతారో వేచిచూడాలి.