క‌నిక‌రించిన కేసీఆర్‌.. ఎంత‌కైనా సై?

తెలంగాణ ఎన్నిక‌ల్లో హ్యాట్రిక్ విష‌యంపై క‌న్నేసిన బీఆర్ఎస్

Update: 2023-07-26 02:30 GMT

తెలంగాణ ఎన్నిక‌ల్లో హ్యాట్రిక్ విష‌యంపై క‌న్నేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. అందుకు త‌గ్గ క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ముందుగా స‌ర్వేలు, ఇత‌ర నివేదిక‌ల ఆధారంగా ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు జాబితాపై ఓ అంచ‌నాకు రానున్నారు. ఇప్ప‌టికే మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీలో నిల‌బెట్టే అభ్య‌ర్థుల‌పై కేసీఆర్ ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చారు. దీంతో ఆగస్టు మూడో వారంలో అభ్య‌ర్థులు తొలి జాబితాను వెల్ల‌డించేందుకు ఆయ‌న సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఎలాంటి స‌మ‌స్య‌లు లేని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు జాబితాను ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది.

ఇక ఇత‌ర పార్టీల్లో గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన నాయ‌కులు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో, అవినీతి త‌దిత‌ర ఆరోప‌ణ‌లు , వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేతలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో నిల‌బెట్టే అభ్య‌ర్థుల జాబితాను రెండో విడ‌త‌లో ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ సారి ఎన్నిక‌ల్లో టికెట్ కోసం కొంత‌మంది బీఆర్ఎస్ నాయ‌కులు తీవ్రంగా పోటీప‌డుతున్నారు.

మ‌రోవైపు ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యేలు ఉన్న చోట‌.. పాత బీఆర్ఎస్ నాయ‌కులు కూడా టికెట్ల కోసం ప‌ట్టు ప‌డుతున్నారు. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల‌ను కాద‌ని త‌మ‌కు అవ‌కాశం ఇస్తార‌ని మ‌రికొంత మంది నాయ‌కులు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం త‌న‌కు న‌చ్చిన వాళ్ల‌కే టికెట్లు ఇస్తార‌న‌డంలో సందేహం లేదు.

కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అసంతృప్త నేత‌ల‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాల్లో బీఆర్ఎస్ ఉంది. ఎన్నిక‌ల్లో టికెట్ కాకుండా ఇత‌ర ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తామ‌ని చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ విన‌ని నాయ‌కులు పార్టీ నుంచి వెళ్లిపోయినా స‌రే ఏం ఇబ్బంది లేద‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. టికెట్ ఇవ్వ‌క‌పోతే పార్టీ మార‌తామ‌నే ధోర‌ణిలో ఉన్న వాళ్ల విష‌యంలో ఏం చేసేది లేద‌ని పార్టీ అధిష్ఠానం అనుకుంటోంది. ఇప్ప‌టికే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. జూప‌ల్లి కృష్ణారావు కూడా అదే బాట‌లో సాగుతున్నారు.

ఈట‌ల రాజేంద‌ర్‌తో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద్ర‌రెడ్డి బీజేపీలో చేరిపోయారు. తాండూర్‌లో ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి టికెట్ కోసం ప‌ట్టు ప‌డుతున్నారు. టికెట్ దొరికే అవ‌కాశం లేక‌పోవ‌డంతో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన తీగ‌ల కృష్ణారెడ్డి, వీరేశం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పాలేరులో మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆశ‌తో ఉన్నారు. మ‌రి వీళ్లంద‌రి విష‌యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News