వర్షాలకు వారం సరిపోలేదు.. మరో 3 రోజులు తప్పవట

రానున్న మూడు (సోమ-బుధవారం) రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది

Update: 2023-07-24 04:50 GMT

వారం కావొస్తోంది. తెలంగాణను పట్టిన వర్షాలు ఇప్పటికి వదల్లేదు. ఎండ పొడ అన్నది లేక.. సూరీడు కనిపించి వారమైంది. మేఘాలు పట్టేసిన ఆకాశం.. వదలకుండా కురుస్తున్న వానతో తెలంగాణతో పాటు ఎక్కువగా ఎఫెక్టు అయ్యింది హైదరాబాద్ మహానగరమే. రికార్డుల ప్రకారం కోటి మంది ఉన్నట్లు చెబుతున్నప్పటికి.. అనధికారికంగా మాత్రం మహా నగర పరిధిలో కోటిన్నర వరకు ప్రజలు ఉండొచ్చంటున్న వేళ.. విడవకుండా కురుస్తున్న వానలతో మహా నగర ప్రజలు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో హైదరాబాద్ మహానగరాన్ని వానలకు తట్టుకునేలా చేయటంలో కేసీఆర్ అడ్డంగా ఫెయిల్ కావటమే కాదు.. ఇవాల్టి రోజున గట్టిగా వాన పడుతుందంటే చాలు.. స్కూళ్లకు సెలవులు ఇచ్చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి దారుణ పరిస్థితుల వేళ.. నగర ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్. రానున్న మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

రానున్న మూడు (సోమ-బుధవారం) రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళ.. బుధవారం రెండు రోజులు అతి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందన్న అంచనాల్ని వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో పిల్లలు స్కూళ్లకు వెళ్లిన తర్వాత సెలవు ప్రకటించి అభాసుపాలు కాకుండా.. కాస్తంత ముందే అలాంటి నిర్ణయాల్ని తీసుకుంటే మంచిదన్న మాట వినిపిస్తోంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం దక్షిణ ఒడిశా పరిసరాల్లో సముద్ర మట్టం నుంచి సగటున 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతుందని..ఈ కారణంగా రానున్న మూడు రోజులు భారీ వర్షాలకు వీలుందని వెల్లడించారు. ఈ నెల 24న ఒక అల్పపీడనం దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బలమైన గాలులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. కాస్తంత స్కూల్ సెలవుల గురించి.. ఆఫీసుల్ని బంద్ చేసే విషయం గురించి సీఎం కేసీఆర్ కాసింత ఆలోచించాల్సిన అవసరముంది.

Tags:    

Similar News