కాంగ్రెస్ సస్పెండ్ చేసినా బీసీ ఉద్యమం ఆగదు : తీన్మార్ మల్లన్న

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్న బీసీ వాదులకు కృతజ్ఞతలు తెలిపారు.;

Update: 2025-03-05 10:35 GMT

తనను సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని, బీసీలకు రాజ్యాధికారం ఎలా సాధ్యమవుతుందో నిరూపిస్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజు నోటీసులను స్వీకరించిన తాను, బీసీలకు ఎందుకు తగిన హక్కులు రావడం లేదో ప్రశ్నిస్తానని తెలిపారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్న బీసీ వాదులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు షోకాజు నోటీసులు పంపించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనను పార్టీ నుండి తొలగించినా, బీసీల హక్కుల కోసం తన పోరాటం కొనసాగుతుందని అన్నారు.

తాము గత బీసీలలా కాదని, ఆధునిక ఆలోచనలతో ముందుకు వచ్చామని, మలిదశ బీసీ ఉద్యమకారులమని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో పొరపాట్లు ఉన్నాయని, దీని నివేదికను చిత్తు కాగితంగా అభివర్ణిస్తూ తగులబెట్టిన విషయాన్ని ఆయన సమర్థించుకున్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని, తప్పు అయితే వెయ్యిసార్లు చేస్తానని తెలిపారు.

సకల జనుల సర్వేను 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్రంగా నిర్వహించిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం తూతూమంత్రంగా సర్వే నిర్వహించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణనపై నిత్యం మానిటరింగ్ చేయాల్సిందని, కానీ ఆయన సర్వే పూర్తయిన తర్వాత సమీక్ష నిర్వహించారని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన సర్వే తప్పుడు లెక్కలు చూపించిందని, బీసీలను కించపరిచే విధంగా ఉందని మండిపడ్డారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడేందుకే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించిందని, అణగారిన వర్గాలను మరింత నష్టపరిచే విధంగా సర్వే ఉందని అన్నారు. తనలాంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే సీఎం రేవంత్ రెడ్డికి నచ్చదని, అందుకే తనను సస్పెండ్ చేయించారని ఆరోపించారు. 6.98% ఉన్న ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం సమంజసమా? 67% బీసీలకు కేవలం 27% రిజర్వేషన్లు ఇవ్వడం న్యాయమా? అంటూ ప్రశ్నించారు.

సమగ్ర సర్వే నిజమైనదైతే, సీఎం రేవంత్ రెడ్డి దానికి బాధ్యత వహించాలని సవాల్ విసిరారు. సర్వేపై సీఎం చర్చకు సిద్ధమా? తాను ఎక్కడైనా రమ్మంటే సిద్ధమని తీన్మార్ మల్లన్న అన్నారు. తన పార్టీ స్థాపనపై తుది నిర్ణయం తీసుకోలేదని, కానీ బీసీల కోసమే పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Full View
Tags:    

Similar News