కంప్లైంట్ వస్తే అధికారుల్ని ఆడోళ్లతో తన్నిస్తానంటున్న గులాబీ ఎమ్మెల్యే

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని గొల్లచర్లలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు

Update: 2023-07-24 05:23 GMT

ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ.. ప్రజల మీద ప్రేమ పొంగించే ప్రోగ్రాం కొందరు నేతలు చేస్తుంటారు. వారి వరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వానికి జరిగే డ్యామేజ్ ను అధికార పార్టీ ఎమ్మెల్యేలు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు అలాంటి తీరును ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పడేశారు తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యే కమ్ మాజీ మంత్రి రెడ్యా నాయక్.

అధికారుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే కేసీఆర్ సర్కారు మీద గుర్రుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మరింత మంట పుట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

ఇంతకీ రెడ్యా నాయక్ ఏమన్నారన్నది చూస్తే.. తన నియోజకవర్గంలో ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని ఎవరైనా తనకు కంప్లైంట్ ఇస్తే.. అందుకు బాధ్యులైన అధికారుల్ని ఆడోళ్లతో తన్నిస్తానంటూ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేశారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని గొల్లచర్లలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.ఫకీరాతండాలో నీళ్లు రావటం లేదని ఫిర్యాదు వచ్చిందని.. ఆ సమస్య పరిష్కారం కోసం రూ.5 లక్షలు ఇచ్చి ఇప్పటికి నాలుగు నెలలు అవుతుందని.. నేటికీ ఆ పని పూర్తి చేయలేదన్నారు.

ఇలా అయితే.. ప్రజలు తమ పార్టీకి ఎందుకు ఓట్లు వేస్తారన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రెడ్యా నాయక్.. ఫిర్యాదులు వస్తే అధికారుల్ని ఆడోళ్ల చేత తన్నిస్తానంటూ భావ్యం కాదంటున్నారు. తన నియోజకవర్గ ప్రజల మెప్పు కోసం ఇలాంటి వ్యాఖ్యలు.. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారతాయని గులాబీ నేతలు వాపోతున్నారు. సంచలనంగా మారిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు కారణమవుతుందో చూడాలి.

Tags:    

Similar News