తెలంగాణ సమాజ్ కాంగ్రెస్.. బలమైన వాదంతోబరిలోకి

తెలంగాణ లో అత్యధిక శాతం ఓట్లున్న వెనుకబడిన వర్గాల గళం వినిపించడమే లక్ష్యంగా తెలంగాణ సమాజ్ కాంగ్రెస్ (టీఎస్సీ)ని స్థాపించారు డాక్టర్ వినయ్ కుమార్.

Update: 2023-07-22 14:42 GMT

తెలంగాణ లో కొత్త పార్టీ పురుడుపోసుకుంది. బలమైన వాదంతో బరి లో దిగుతానంటోంది. తమదైన ముద్ర చాటే ప్రయత్నాల్లో ఉంది. అందులోనూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అంతర్థానమై బీఆర్ఎస్ గా మారిన పరిస్థితుల్లో 'తెలంగాణ' నేపథ్యంతో రాజకీయ పార్టీ లేని లోటు ను తీరుస్తామంటోంది. వాస్తవానికి తెలంగాణ వాదం ప్రాతిపదికగా ఏర్పడిన టీఆర్ఎస్ తన పేరులో తెలంగాణ ను తొలగించి భారత్ ను చేర్చడం తెలంగాణ వాదుల మనోభావాల ను గాయపరిచింది. ఇదే సమయంలో ''తెలంగాణ'' నేటివిటీతో మిగిలిన పార్టీలు ఏమున్నాయా? ఇక అని వెదుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అప్పట్లో గుర్తుకు వచ్చినవే తెలంగాణ జన సమితి (టీజేఎస్), వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ). వీటిలో టీజేఎస్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరాం. జేఏసీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రయత్నాలను అందరూ గౌరవిస్తారు. కానీ, ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గుకురాలేక పోతున్నారు. ఇక వైటీపీ రెండేళ్ల కిందట ఏర్పడింది. ఉమ్మడి ఏపీ కి సీఎం గా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల దీనిని నెలకొల్పారు. అయితే, నేపథ్యం రీత్యా ఎవరూ ఆమెను తెలంగాణ వ్యక్తిగా గుర్తించడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే అసలు సత్తా ఏమిటో తేలనుంది.

వచ్చింది తెలంగాణ సమాజ్ కాంగ్రెస్ (టీఎస్సీ)

తెలంగాణ పేరుతో పార్టీ లేదనే లోటు ను తీర్చేలా.. తెలంగాణ లో అత్యధిక శాతం ఓట్లున్న వెనుకబడిన వర్గాల గళం వినిపించడమే లక్ష్యంగా తెలంగాణ సమాజ్ కాంగ్రెస్ (టీఎస్సీ)ని స్థాపించారు డాక్టర్ వినయ్ కుమార్. ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అయిన ఈయన లండన్ లో చాలాకాలం పాటు పనిచేశారు. కొన్నేళ్ల కిందట స్వదేశం తిరిగొచ్చారు. ప్రజల కు ఏదైనా చేయాలనే లక్ష్యంతో ఉండే ఆయన ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక ఆయన కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఘనమైన నేపథ్యంతో

వ్యక్తిగతంగా పేరున్న వైద్యుడైన డాక్టర్ వినయ్ కుమార్ ప్రజా సేవ లక్ష్యంతో తనకెంతో ఇష్టమైన వైద్యాన్ని సైతం వదులుకున్నారు. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే డాక్టర్ వినయ్ తండ్రి పుంజాల శివశంకర్ గురించి. ఉమ్మడి రాష్ట్రం లో హైకోర్టు న్యాయమూర్తిగా, కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా శివశంకర్ పనిచేశారు. కేరళ, సిక్కిం రాష్ట్రాల కు గవర్నర్ గానూ వ్యవహరించారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయలో పుంజాల శివశంకర్ ప్రభుత్వంలో నంబర్ 2గా పేరుగాంచారు. ఆయన చిన్న కుమారుడు సుధీర్ కుమార్ 1989లో మలక్ పేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

బీసీ వాదమే బలంగా..

ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు దాదాపు రెండేళ్ల కిందటే ప్రకటించిన వినయ్ కుమార్.. కొద్దిరోజుల కిందట తెలంగాణ సమాజ్ కాంగ్రెస్ (టీఎస్సీ) పేరును వెల్లడించారు. ఆదివారం ఫిలిం నగర్ లోని కార్యాలయం లో పార్టీ మొదటి సమావేశం నిర్వహించనున్నారు. అందులోనూ తెలంగాణ లో అత్యధిక శాతం ఓట్లున్న బీసీ వర్గాలను ప్రోత్సహిస్తామని.. అసెంబ్లీలో ఆ వర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎన్నికయ్యేలా చూస్తామని చెబుతున్నారు. ''తెలంగాణ'' పేరిట పార్టీ తగ్గిందని భావిస్తున్న సమయం లో.. బీసీ నినాదంతో ముందుకొచ్చిన టీఎస్సీ భవిష్యత్ ప్రణాళిక ఆదివారం వెల్లడికానుంది.

Tags:    

Similar News