వణికించిన విమానం... 3 నిమిషాల్లో 15000 అడుగులు కిందకు...!

అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం కేవలం మూడు నిమిషాల వ్యవధిలో ఏకంగా 15 వేల అడుగులు కిందకు దిగింది.

Update: 2023-08-14 06:56 GMT

గతకొన్ని రోజులుగా వణికిస్తోన్న విమాన ప్రయాణ సంఘటనలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా అత్యంత వేగంతో కిందకు దిగిన ఒక విమాన ప్రయాణం సంఘటన తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ప్రయాణికులు అనుభవించిన ఊహించని అనుభవం హాట్ టాపిక్ గా మారింది.

అవును... అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం కేవలం మూడు నిమిషాల వ్యవధిలో ఏకంగా 15 వేల అడుగులు కిందకు దిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఊహించని అనుభవం నుంచి తేరుకోవడానికి వారికి చాలా సమయమే పట్టిందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలో అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన విమానం (5916) ఇటీవల ఉత్తర కరోలినాలోని షార్లెట్‌ నుంచి ఫ్లోరిడాలోని గెయిన్జ్‌ విల్‌ కు బయల్దేరింది. ఈ సమయంలో మార్గమధ్యలో 29వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో పీడనం సమస్య తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు.

ఈ క్రమంలోనే విమానాన్ని వీలైనంత త్వరగా కిందకు దించి, తక్కువ ఎత్తులో నడపాలని నిర్ణయించిన పైలట్లు.. ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. ఇదే సమయంలో మాస్కుల ద్వారా ప్రయాణికులకు ఆక్సిజన్‌ అందజేశారు. దీంతో ఆ విమానం కేవలం ఆరు నిమిషాల్లో 18,600 అడుగుల కిందకు దిగినట్లు "ఫ్లైట్‌ అవేర్‌" వెబ్‌ సైట్‌ పేర్కొంది.

అయితే ప్రయాణికులు ఆందోళన చెందినంతగా ప్రమాదం ఏమీ జరగలేదు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ప్రయాణికులు తమ అనుభవాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. "తాము చాలాసార్లు విమానంలో ప్రయాణించాము కానీ... ఇది భయానక అనుభవం" అని ఆన్ లైన్ వేదికగా స్పందించారు.

దీంతో విమానంలో పీడనానికి సంబంధించిన సమస్య తలెత్తినందునే కిందకు దించినట్లు విమానయాన సంస్థ తెలిపింది. ఆ సమయంలో ప్రయాణికులకు మాస్కుల ద్వారా ఆక్సిజన్ సప్లై చేసినట్లు చెప్పింది. ఈ సమయంలో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది!

Tags:    

Similar News