టైపింగ్‌ తప్పు... అమెరికా రహస్యాలు రష్యా మిత్ర దేశానికి?

Update: 2023-07-18 11:03 GMT

టైంపింగ్ లో జరిగిన ఒక్క చిన్న మిస్టేక్ కారణంగా పెద్ద విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది. టైంపింగ్ లో ఒక్క అక్షరం మిస్ అవ్వడం వల్ల అగ్రరాజ్యం అమెరికా రహస్యాలు రష్యా మిత్రదేశమైన మాలి చేతికి చిక్కాయని తెలుస్తుంది. అలా మాలికి చేరిన అగ్రరాజ్యం రహస్యాల్లో ఏయే వివరాలు ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం..!

అమెరికాకు చెందిన సైనిక రహస్యాలు, మ్యాప్‌ లు, పాస్‌ వర్డ్‌ లు ఉన్న లక్షల కొద్దీ ఈమెయిల్స్‌... రష్యా మిత్రదేశమైన మాలి చేతికి దక్కాయని తెలుస్తుంది. దీనంతటికీ ఒక టైపింగ్‌ తప్పు కారణమైందనే విషయం జోహన్నస్‌ జూర్బిర్‌ అనే డచ్‌ వ్యాపారవేత్త గుర్తించాడని తెలుస్తుంది. అతడు మాలి డొమైన్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడని అంటున్నారు.

అసలు మేటర్ లోకి వెళ్తే... సాధారణంగా అమెరికా సైన్యం తమ బృందాలతో కమ్యూనికేషన్ల కోసం .MIL అనే ఎక్స్‌టెన్షన్‌ ఉన్న డొమైన్‌ వాడుతుందట. కానీ, చాలా సందర్భాల్లో అమెరికా సైన్యంలోని వారు మెయిల్‌ చేసే సమయంలో పొరబాటున .ML అని టైపు చేసేవారట. దీంతో ఆ మెయిల్స్‌ మొత్తం మాలి డొమైన్‌ కు వెళ్లాయని తెలుస్తుంది.

ఈ విషయాన్ని మొదట్లో పొరబాటున వస్తున్నట్లు భావించిన జోహన్నస్‌ జూర్బిర్‌... అదేపనిగా మెయిల్స్ వస్తుండటాన్ని గమనించాడని అంటున్నారు. దీంతో ఇటువంటి మెయిల్స్‌ ను ఓ చోటకు చేర్చడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశాడట. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఇటువంటివి 1,17,000 ఈమెయిల్స్‌ వచ్చినట్లు చెబుతున్నాడంట!

ఆ మెయిల్స్ లో అమెరికా సైన్యానికి చెందిన మ్యాప్‌ లు, పాస్‌ వర్డ్‌ లు, సైనికుల మెడికల్‌ రికార్డులు, సైనిక స్థావరాల ఫొటోలు, స్థావరాల్లోని సిబ్బంది సంఖ్య, నౌకాదళ కదలికలు, నౌకల్లో సిబ్బంది వివరాలు వంటి అత్యంత సెన్సిటివ్ ఇన్ ఫర్మేషన్ ఉందని అంటున్నారు. వీటిల్లో అమెరికా ఆర్మీ చీఫ్‌ పర్యటనలో బసచేసే హోటల్‌ గది నంబర్ల వంటివి కూడా ఉన్నాయని చెబుతున్నారంట.

దీంతో అగ్రరాజ్యంలో ఇది హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు. మరోపక్క మాలి ప్రభుత్వంతో జోహన్నస్‌ జూర్బిర్‌ కాంట్రాక్టు సోమవారంతో ముగిసిందని తెలుస్తుంది. దీంతో మాలి ప్రభుత్వమే నేరుగా ఈ డొమైన్‌ ను ఆధీనంలోకి తీసుకొందని అంటున్నారు. ఫలితంగా ఇక ఆ ఈమెయిల్స్ అన్నింటినీ నేరుగా ఆ దేశ సిబ్బందే చూసే అవకాశం ఉందన్నమాట.

అయితే ఈ విషయాలపై అమెరికా రక్షణ శాఖ స్పందించిందని సమాచారం. ఈ మేరకు అమెరికా రక్షణశాఖ ప్రతినిధి టామ్‌ గోర్మన్‌... ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారని అంటున్నారు. ఇదే సమయంలో.. .MIL వెళ్లకుండా మాలి డొమైన్‌ కు వెళుతున్న ఈమెయిల్స్‌ ను బ్లాక్‌ చేసినట్లు తెలిపారని తెలిసింది.

Tags:    

Similar News