విమానాన్ని గుల్ల చేసిన వడగళ్లు... ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ఈ సమయంలో ఈ వడగండ్ల వల్ల ఏకంగా ఒక విమానానికి చిల్లు పడిన సంఘటన

Update: 2023-07-26 10:40 GMT

ప్రస్తుతం దేశంలో భారీవర్షాలు కురుస్తున్నాయి.. ఫలితంగా వరదలతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదే సమయంలో గత కొన్ని రోజులుగా ఇటలీలోనూ వడగండ్ల వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భూవాతావరణం వేడెక్కడంతో తీవ్ర స్థాయిలో వడగండ్ల వానలు కురుస్తున్నాయి.

ఈ సమయంలో ఈ వడగండ్ల వల్ల ఏకంగా ఒక విమానానికి చిల్లు పడిన సంఘటన ఇటలీలో జరిగింది! అంటే... ఆ వడగండ్ల సైజు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇటలీలోని మిలన్‌ నుంచి అమెరికా లోని న్యూయార్క్‌ జేకేఎఫ్‌ ఎయిర్‌ పోర్టుకు బయల్దేరిన విమానం వడగళ్ల వాన వల్ల అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.

అవును... డెల్టా ఎయిర్‌ లైన్స్‌కు చెందిన 185 నంబర్‌ విమానం 215 మంది ప్రయాణికులతో మిలన్‌ నుంచి బయల్దేరింది. అనంతరం విమానం బయలుదేరిన 15 నిమిషాల తర్వాత తీవ్రమైన వడగళ్లు, పిడుగులతో కూడిన వాన స్టార్ట్ అయ్యింది. దీంతో విమానం ముందుభాగం, రెక్కలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.

ఇలా భారీసైజులో పడిన వడగండ్ల వల్ల విమానం దెబ్బతినడంతో విమానాన్ని నియంత్రించడం పైలట్లకు ఇబ్బందికరంగా మారింది. దీంతో మానాన్ని అత్యవసరంగా రోమ్‌ లో ల్యాండింగ్‌ చేశారు. ఈ విమానంలో 215 మంది ప్రయాణికులు, ముగ్గురు పైలట్లతోపాటు 8 మంది సహాయక సిబ్బంది ఉన్నారు.

ఇలా రోమ్‌ లో అత్యవసరంగా ల్యాండ్ అయిన తర్వాత... గాల్లో వారు ఎదుర్కొన్న పరిస్థితులను ప్రయాణికులు వివరించారు. ఒక దశలో విమానం ముక్కలైపోతుందేమోనని తాము భయపడ్డామని ఓ ప్రయాణికురాలు వెల్లడించారు. రోలర్‌ కోస్టర్‌ ఎక్కినట్లు తమకు అనిపించిందని తన అనుభవాన్ని పంచుకొన్నారు.

అనంతరం.. మిలన్‌ నుంచి న్యూయార్క్‌ బయల్దేరిన డెల్టా ఫ్లైట్‌ 185ను వాతవరణం కారణంగా రోమ్‌ లో ల్యాండ్‌ చేశాం.. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.. అని వెల్లడించిన డెల్టా ఎయిర్‌ లైన్స్‌ ప్రతినిధులు విమానానికి జరిగిన నష్టాన్ని మాత్రం వెల్లడించలేదు. కానీ... ప్రయాణికులు సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన చిత్రాల్లో విమానం ముందుభాగం పూర్తిగా ధ్వంసమైనట్లు ఉంది.

Tags:    

Similar News