భారత టూరిస్ట్ లకు మరో గుడ్ న్యూస్... ఈసారి థాయిలాండ్ వంతు!
ఇందులో భాగంగా... భారత్, తైవాన్ దేశాలవారు వీసా లేకుండానే తమ దేశంలో 30 రోజులపాటు పర్యటించేందుకు అనుమతించాలని నిర్ణయించింది.
పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇటీవల పలు దేశాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయిస్తున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని చేపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల శ్రీలంక కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ వెల్లడించగా.. ఇప్పుడు థాయిలాండ్ కూడా ఆ పనిచేసింది.
అవును... గతేడాది తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నుంచి బయట పడేందుకు శ్రీలంక ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా... శ్రీలంక ఆర్ధిక వ్యవస్ధకు కీలకమైన పర్యాటకాన్ని భారీ ఎత్తున, యుద్ధ ప్రాతిపదికన ప్రోత్సహించాలని నిర్ణయించిన అనంతరం తాజాగ థాయిలాండ్ నుంచి కూడా ఆఫర్ వచ్చింది.
ఈ క్రమంలో... పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... భారత్, తైవాన్ దేశాలవారు వీసా లేకుండానే తమ దేశంలో 30 రోజులపాటు పర్యటించేందుకు అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు నవంబరు 10వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు ఈ సడలింపు ఇవ్వనున్నట్లు థాయిలాండ్ కేబినెట్ నిర్ణయించింది.
ఈ విషయాలపై థాయి ప్రధాని శ్రేట్టా థవిసిన్ స్పందించారు. ఇందులో భాగంగా... ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో థాయిలాండ్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే... గత నెలలోనే చైనా నుంచి వచ్చే పర్యాటకులకు థాయిలాండ్ వీసా మినహాయింపును ఇచ్చింది. ఈ క్రమంలోనే భారతీయులకు కూడా ఆ అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.
వాస్తవానికి చైనా, మలేసియా, దక్షిణ కొరియా తర్వాత ఇండియా నుంచే ఎక్కువ మంది పర్యాటకులు థాయిలాండ్ కు వెళ్తుంటారని చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే థాయి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా... కొద్దిరోజుల క్రితం భారత్ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే సందర్శనకు అనుమతివ్వాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది.