2024లో టూర్ ప్లాన్ చేస్తున్నారా.. హోటల్ గదుల రెంట్లతో జాగ్రత్త?
ఈ అంచనా కోసం సుమారు 80 నగరాల్లోని ధరలను పరిశీలించిన అనంతరం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ గ్లోబల్ బిజినెస్ ట్రావెల్ సంస్థ... "హోటల్ మానిటర్ 2024" నివేదికను విడుదల చేసింది.
టూరిజం డెవలప్ అయితే... ముందుగా అభివృద్ధి చెందేది హోటల్ రంగం అని అంటారు! పైగా గత కొంతకాలంగా విదేశీ పర్యటనలు పెరుగుతున్న నేపథ్యలో... వచ్చే ఏడాది ఆరంభం నుంచీ హోటల్ గదుల అద్దెలు కాస్త ఎక్కువగానే పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ మేరకు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ గ్లోబల్ బిజినెస్ ట్రావెల్ తనదైన అంచనా వేస్తూ కీలక విషయాలు వెల్లడించింది.
అవును... ప్రపంచవ్యాప్తంగా హోటల్ గదులకు 2024లో గిరాకీ భారీగా పెరగనుందని అంతర్జాతీయ ప్రయాణ నిర్వహణ సంస్థ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ గ్లోబల్ బిజినెస్ ట్రావెల్ అంచనా వేస్తోంది. ప్రధానంగా పెరగనున్న పర్యాటకుల కారణంగా, అత్యధికంగా హోటల్ గదుల అద్దెలు కూడా తదనుగుణంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇలా వచ్చే ఏడాది హోటల్ గదుల అద్దెలు పెరిగే తొలి 10 సిటీస్ లో 3 సిటీలు ఇండియాలో ఉండటం గమనార్హం.
ఈ అంచనా కోసం సుమారు 80 నగరాల్లోని ధరలను పరిశీలించిన అనంతరం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ గ్లోబల్ బిజినెస్ ట్రావెల్ సంస్థ... "హోటల్ మానిటర్ 2024" నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం... మిగిలిన అన్ని నగరాలతో పోలిస్తే అర్జైంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో హోటళ్ల గదుల రేట్లు 17% పెరగనున్నాయి.
ఇదే సమయంలో... పర్యాటకం పెరగడంతో కైరో, చికాగో, పారిస్, బోస్టన్ నగరాలు ప్రయోజనం పొందనున్నాయని నివేదిక చెబుతుంది. అదేవిధంగా... ఆస్ట్రేలియాలో ఏ ఒక్క నగరంలోనూ 6.8% కంటే ఎక్కువ ధరలు పెరగకపోవచ్చని అంచనా వేసింది. ఇక ఇలా ధరలు పెరిగే అవకాశం ఉన్న టాప్ 10 నగరాల్లో మూడు నగరాలు ఇండియాలో ఉన్నాయని నివేదిక చెబుతుంది.
ఈ జాబితాలోని తొలి 10 నగరాల్లో భారత్ నుంచి ముంబయి, చెన్నై, ఢిల్లీ ఉన్నాయి. ఈ నగరాల్లో వరుసగా 15%, 14.6%, 12% మేర హోటల్ గదుల అద్దెలు పెరగచ్చని నివేదిక చెబుతోంది. ఈ జాబితాలో హోటల్ గదుల అద్దెలు పెరిగే టాప్ సిటీస్, అవి ఏ దేశం వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.!
బ్యూనస్ ఎయిర్స్ (అర్జైంటీనా), ముంబయి (భారత్), కైరో (ఈజిప్ట్), చెన్నై (భారత్), బొగోటా (కొలంబియా), చికాగో (అమెరికా), ఢిల్లీ (భారత్), బోస్టన్ (అమెరికా), పారిస్ (ఫ్రాన్స్), జకార్తా (ఇండోనేషియా) లు వరుసగా ఉన్నాయి!