ఊటీ, కొడై కెనాల్ కాదు... ఈ సారి కెమ్మనగుండి కి వెళ్లండి!

Update: 2015-06-08 10:20 GMT
కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలో ఉన్న కెమ్మనగుండి ఒక హిల్ స్టేషన్! చుట్టూ బాబా బూదాన్ గిరి కొండలు, జలపాతాలు, దట్టమైన అడవులు, పచ్చటి మైదానాలు ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక ప్రదేశంగా మార్చాయి. కెమ్మనగుండి పర్వత కేంద్రంలో వాడేయార్ రాజు "కృష్ణరాజ వాడేయార్" వేసవి విడిది చేసేవాడట... దాంతో ఈ పర్వత ప్రాంతాన్ని "కెఆర్ కొండలు" అని కూడా పిలుస్తారు. దట్టమైన అరణ్యాల మధ్య సంవత్సరం పొడవునా సెలయేళ్ళతో పచ్చగా కళకల్లాడుతూ ఉంటుంది ఈ ప్రాంతం. పూల తోటలతో, వంపులు తిరిగిన దారులతో, కొండ లోయలతో ఉండే ఈ పర్వత కేంద్ర గురించి ఎంత చెప్పినా తక్కువే! ఈ ప్రాంతంలో ఉండే రకరకాల గులాబీ తోటలు చూసి తీరాల్సిందే అని చెప్పొచ్చు!

కెమ్మన గండికి ఎలా వెళ్లగలమో ఇప్పుడు చూద్దాం...

మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ కెమ్మనగుండి 190 కి.మీ.ల దూరంగా ఉంటుంది! మంగుళూరు నుండి కెమ్మనగుండికి టాక్సీలు, క్యాబ్ లలో చాలానే ఉంటాయి! ఇక బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే... కెమ్మనగుండికి 295 కి.మీ.ల దూరంలో ఉంటుంది.

రైలు మార్గం ద్వారా కెమ్మనగుండికి చేరుకోవడానికి ముందుగా తరికెరె రైలు స్టేషన్ లో దిగిపోవాలి! ఎందుకంటే కెమ్మనగుండిలో రైల్వే స్టేషన్ లేదు! ఈ తరికెరె స్టేషన్... కెమ్మనగుండికి  15 కి.మీ.ల దూరంలో ఉంటుంది. అక్కడ నుండి కెమ్మనగుండికి టాక్సీలలో చేరవచ్చు.

ఇక బస్సు మార్గంద్వారా కెమ్మనగుండికి చేరాలంటే...  బెంగుళూరు, మంగుళూరుల నుండి కర్నాటక ఆర్.టీ.సీ. ప్రత్యేక బస్సులను నడుపుతుంది!

ఇప్పుడు కెమ్మనగుండిలో చూడాల్సిన ప్రదేశాలను గురించి తెలుసుకుందాం...

రాక్ గార్డెన్:           

కెమ్మనగుండి వెళ్లాలనుకునేవారు నూటికీ నూరుపాళ్లూ చూడాల్సిన ప్రదేశం రాక్ గార్డెన్! కెమ్మనగుందికి పోగానే మరో ఆలోచన లేకుండా ముందుగా వెళ్ళి  చూడాల్సింది రాళ్ళతో మలచబడిన రాక్ గార్డెన్! సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు కొండలలోకి జారిపోవటాన్ని ఈ ప్రదేశంలో చూసి తీరాల్సిందే! ఈ గార్డెన్ లో కేవలం రాళ్లే కాదు... అందమైన పూల మొక్కలు కూడా దర్శనమిస్తాయి!

జీ పాయింట్:

రాక్ గార్డెన్ చూసిన వెంటనే మరో ఆలోచన లేకుండా వెంతనే చూడాల్సిన ప్రదేశం జీ పాయింట్! ఇది ఎత్తైన కొండ మీద ఉండే అద్భుత ప్రదేశం. స్వశక్తిని నమ్ముకునే ఈ కొండపైకి చేరుకోవాలి! నడిచి వెళ్లడమే అత్యంత శ్రేయస్కరం! నడుచుకుంటూ బయలుదేరితే సుమారుగా అరగంటలో ఈ కొండకి చేరుకోవచ్చు! ఈ కొండ పైనుంచి ప్రకృతి అందాలను, దగ్గరలో ఉండే జలపాతాన్ని చూసి ఆనందించాల్సిందే! ఈ కొండపైన తీసుకునే ఫోటోలు అద్భుత జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి!

జలపాతాలు:

ఇక్కడ హెబ్బే, కాళహట్టి, శాంతి అనే మూడు జలపాతాలు ఉంటాయి! వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది హెబ్బే జలపాతం గురించి! ఈ జలపాతాన్ని చూడటానికి వెళ్లే మార్గం చాలా ఇబ్బందిగా ఉంటుంది! అయితే నడిచి వెళ్లాలి లేదా జీపులో వెళ్లాలి! చూడటానికి 13 కి. మీ. దూరమే ఉంటుంది కానీ... నడవడం మొదలుపెడితే మాత్రం 39 కి.మీ. దూరం అనిపించినా ఆశ్చర్య పోనక్కరలేదు! కానీ... ఇంతటి అందమైన జలపాతాన్ని చూసిన తర్వాత పడ్డ కష్టం అంతా మరిచిపోవడం తథ్యం! ప్రశాంత వాతావరణం ఆనందించాలనుకునేవారికి హెబ్బే జలపాతాలు, చుట్టుపక్కల ప్రదేశాలు చాలా అనువుగా ఉంటాయి.

హెబ్బే తర్వాత చెప్పుకునే జలపాతం కాళహట్టి జలపాతం! వీటినే కాళ హస్తి జలపాతాలని కూడా అంటారు. ఈ జలపాతాల దగ్గరలో వీరభద్రుడి గుడి ఉంటుంది. ఇది విజయనగర రాజుల కాలం నాటిది!

ఇక మూడో జలపాతం శాంతి జలపాతం! కెమ్మనగుండి పర్యటించే వారికి శాంతి జలపాతాలను తప్పక సందర్శించాలి. ఈ ప్రదేశం నుండి చూస్తే... పడమటి కనుమల మైదానాలు కూడా కనపడతాయి. ముందుగా చెప్పుకున్న జీ పాయింట్ ను కూడా ఈ జలపాతం దగ్గరనుండి మరికాస్త దగ్గరగా చూడవచ్చు!

ఏమాత్రం అవకాశం ఉన్నా... సీజన్ తో సంబందం లేకుండా ఈ ప్రాంతాలని చూసిరావచ్చు! వర్షాకాలం కంటే వేసవి, శీతాకాలాలు ఈ ప్రాంతంలో ప్రయాణిస్తే సూపర్ ఉంటుంది మరి!


Tags:    

Similar News