జగన్‌ ని పొగడడమే ఆయన చేసిన తప్పా?

Update: 2019-07-30 14:42 GMT
జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ను పార్టీ నేతలు కార్నర్ చేసినట్లుగా చెబుతున్నారు. అందుకు కారణం ఆయన అసెంబ్లీలో సీఎం జగన్ విధానాలను ప్రశంసించడమేనని చెబుతున్నారు.  సీఎం జగన్‌ ని రాపాక పొగిడిన తీరుని కొంతమంది తప్పుపట్టారట. జనసేన విధానాలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా.. ఐడియాలజీని సభలో వివరించకుండా వైసీపీ అధినేతను పొగడడమేంటన్న వాదనను కొందరు వినిపించినట్లు తెలుస్తోంది.

బడ్జెట్ సమావేశాల్లో భాగంగాఆ రోజు సభలో రాపాక ప్రసాద్ పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావిస్తూనే మెల్లగా జగన్ భజనలోకి వెళ్లారంటూ.. అలా ఎందుకు చేశారో చెప్పాలంటూ ఆయన్ను వివరణ కోరినట్లు తెలుస్తోంది. అయితే.. రాపాక మాత్రం ఆ ప్రశ్నలన్నిటికీ మౌనం వహించారని సమాచారం. అయితే.. సమావేశం అనంతరం రాపాక ఈ విషయంపై తన అనుచరుల వద్ద వాపోయారని.. పార్టీ నుంచి తాను తప్ప ఎవరూ గెలవలేకపోయారని.. కానీ, ప్రతి ఒక్కరూ తనను ప్రశ్నించారని, ప్రజల్లో బలం లేనివారంతా జనసేనలో పెత్తనం చేస్తున్నారని ఆయన ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది.

ఈ విషయంలో పవన్ కూడా తనను అర్థం చేసుకోకపోవడంపై రాపాక అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. అసలు పొలిటికల్ అపైర్స్ కమిటీపైనే రాపాక అసంతృప్తిగా ఉన్నారని.. అందులో ఎంతమందికి రాజకీయ  అనుభవం ఉందో జనాలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు.

జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రాపాక విషయంతో పాటు ప్రధానంగా బీజేపీతో పొత్తు విషయంలోనూ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, పవన్ మాత్రం ఇంకా ఇప్పటికీ తనకు బలం ఉందని భావిస్తున్నారని.. జగన్‌కు పోటీ తానేనని భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

   
   
   

Tags:    

Similar News