అక్టోబర్ తరువాత జంపింగ్ జఫాంగులు సందడి

ఏపీలో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది

Update: 2023-07-26 04:35 GMT

ఏపీలో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. అయితే విజయదశమి తరువాత అసలైన రాజకీయ సినిమా చూసే అవకాశం ఉంది. ఎందుకు అంటే అక్టోబర్ లో ఏపీలో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. టీడీపీ తన ఎన్నికల మ్యానిఫేస్టోని అక్టోబర్ లో విజయదశమి సందర్భంగా రిలీజ్ చేయనుంది.

అంతే కాదు అప్పటికి దాదాపుగా నూటికి ఎనభై శాతం మందికి టికెట్లు ఖరారు చేయనుంది. మరో వైపు అధికార వైసీపీ కూడా అక్టోబర్ ని డెడ్ లైన్ గా పెట్టుకుంది అని అంటున్నారు. రానున్న మూడు నెలలలో మరో విడత సర్వేను గ్రాస్ రూట్ లెవెల్ దాకా చేయించి ఆయా నివేదికలను దగ్గర పెట్టుకుని మరీ అభ్యర్ధులను ఖరారు చేసే పనిలో వైసీపీ ఆనాటికి ఉంటుంది అని టాక్.

అంటే అక్టోబర్ వైసీపీకి డెడ్ లైన్ అన్న మాట. అప్పటికీ పనితీరుని మెరుగుపరచుకోని వారిని పార్టీ పూర్తిగా పక్కన పెడుతుంది అని అంటున్నారు. వైసీపీలో ప్రచారంలో ఉన్న దాని ప్రకారం చూస్తే ఆ నంబర్ నలభై దాకా ఉండవచ్చు అని అంటున్నారు. ఆ నలభై మందిలో అప్పటికీ ఎవరూ పుంజుకోకపోతే కనుక టికెట్లకు నో చెబుతారు. అందులో పుంజుకున్న వారు ఉంటే పది నుంచి పదిహేను మందిని చాన్స్ ఉన్నా ఉంటుంది.

అంటే ఎలా చూసుకున్నా పాతిక మంది దాకా వైసీపీ నుంచి టికెట్ దక్కించుకోకుండా ఉండిపోవచ్చు అంటున్నారు. అయితే వీరికి ఎమ్మెల్సీ కానీ నామినేటెడ్ పదవులు కానీ ఇస్తామని ఆ పార్టీ భరోసా ఇవ్వవచ్చు కానీ రాజకీయం అంటే ఈ రోజుకే చూసుకునే కాలమిది. దాంతో జంపింగ్ జఫాంగులు అక్టోబర్ నుంచి ఏపీలో సందడి చేయడం ఖాయమని అంటున్నారు.

ఇక ఏపీలో టీడీపీకి కొన్ని చోట్ల అభ్యర్ధులు వీక్ గా ఉన్నారు. మరి ఆ పార్టీ జంపింగ్ జఫాంగుల వైపు చూస్తుందా అన్నది ఆలోచించాలి. అలాగే ఈసారి టీడీపీతో పొత్తు ఉంటే యాభైకి తగ్గకుండా పోటీకి దిగాలని జనసేన చూస్తోంది. ఒకవేళ పొత్తు లేకపోతే బీజేపీతో కలసి బరిలోకి దిగాలని చూస్తోంది.

అదే జరిగితే మాత్రం దాదాపుగా 150 సీట్లలో జనసేన పోటీ పడాల్సి ఉంటుంది. అందువల్ల జంపింగ్ జఫాంగులకు మంచి డిమాండ్ వచ్చినా రావచ్చు అంటున్నారు. టికెట్ రాని సిట్టింగులే కాదు టికెట్ ఆశించి దక్కని వారు కూడా పార్టీలు మారే చాన్స్ ఉంది. అలా వైసీపీ నుంచే కాకుండా పొత్తు లేకపోతే టీడీపీ నుంచి కూడా జనసేనలోకి వచ్చే వారు ఉంటారని అంటున్నారు.

అదే విధంగా వైసీపీ వైపు నుంచి వచ్చే వారిని చేర్చుకుని తగిన హామీ ఇవ్వాలని టీడీపీ ఆలోచిస్తోంది. టికెట్ ఇవ్వకపోయినా వారి సేవలను వాడుకుని ఎన్నికల్లో గెలిచిన తరువాత పదవులు ఇస్తామని హామీ ఇవ్వవచ్చు అని టీడీపీ సైతం భావిస్తోంది. ఇంకో వైపు వైసీపీ కూడా ఇతర పార్టీలకు గేలం వేస్తోంది. ప్రత్యేకించి టీడీపీ మీద ఫోకస్ పెడుతోంది.

టీడీపీలో బలమైన అభ్యర్ధులు ఉంటే టికెట్ గ్యారంటీ హామీతో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అంటే ఏ విధంగా చూసుకున్నా జంపింగ్ జఫాంగులు దసరా నుంచి సరదా చేయడం ఖాయమని తేలుతోంది. చూడాలి మరి ఈ జంపింగ్ జఫాంగుల హడావుడి ఏ విధంగా ఉంటుందో విధేయతలు కండువాలు ఎటు నుంచి ఎటు మారుతాయో. ఏ రకమైన చిలక పలుకులు ఈ గూటి పక్షి ఆ గూడుకు చేరి పలుకుతుందో అన్నీ వింతగానూ విశేషంగానూ ఉంటాయి.

Tags:    

Similar News