ఒడిషా సీఎం తో జగన్ని పోల్చిన పురంధేశ్వరి
కేంద్రంలో తమ ప్రభుత్వానికి వైసీపీ ఎందుకు మద్దతు ఇస్తుందో తమకు తెలియదు అని ఆమె చెప్పడం విశేషం.
ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. సవాల్ చేస్తూ ప్రభుత్వం తప్పులను ఎండగడుతున్నారు. ఈ నెల 13న ఆమె బీజేపీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె జోన్ల వారీగా ఏపీలో కీలక పాంతాలలో పర్యటిస్తూ కార్యకర్తలతో మీటింగ్స్ పెడుతున్నారు.
అలా ఉత్తరాంధ్రాకు శుక్రవారం వచ్చిన పురంధేశ్వరి విశాఖలో మీడియా మీటింగులో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం మీద నిప్పులే చెరిగారు. అధికారికంగా ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు రెండున్నర లక్షల కోట్లు అయితే అనధికారికంగా నాలుగున్నార లక్షల కోట్లు అని చెప్పుకొచ్చారు.
ఈ మొత్తం కలిపితే నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి ఏపీని అధోగతిపాలు చేసింది అని ఘాటు విమర్శలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా కలుపుకుంటే ఏపీలో మొత్తం పది లక్షల కోట్లు పైన అప్పులు ఉన్నాయని ఆమె నిర్ధారించారు.
ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోంది అవినీతి చేస్తోంది అని ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఏపీ ప్రభుత్వం మీద తనకు ఏమీ ప్రత్యేక అభిమానాలు లేవని పురంధేశ్వరి అన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వానికి వైసీపీ ఎందుకు మద్దతు ఇస్తుందో తమకు తెలియదు అని ఆమె చెప్పడం విశేషం. దాని గురించి వారినే అడగాలి అని ఆమె మీడియాకు సూచించడమూ విశేషం.
కేవలం వైసీపీ మాత్రమే తమకు మద్దతు ఇవ్వడం లేదని ఒడిషాలోని బిజూ జనతాదళ్, తమిళనాడులోని కొన్ని పార్టీలు కూడా ఇస్తున్నాయని అన్నారు. విపక్షాలు మోడీ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దానికి వ్యతిరేకంగా వైసీపీ మోడీకి మద్దతు ఇస్తోంది.
అలాగే రాజ్యసభలో రెండు కీలక బిల్లులను గెలిపించుకోవడానికి కూడా వైసీపీ మద్దతు ఇస్తోంది. కానీ పురంధేశ్వరి మాత్రం తమకు వైసీపీ మద్దతు ఎందుకు ఇస్తుందో వారికే అడగమంటున్నారు. ఆ మధ్యన కేంద్ర మంత్రి కిరణ్ రిజూ స్వయంగా ఢిల్లీ నుంచి వచ్చి మరీ జగన్ నివాసంలో ఆయనను కలసి కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు అడిగారని ప్రచారం సాగింది.
అంతే కాదు విపక్షాలు అన్నీ కలసి మోడీ ప్రభుత్వానికి ఊపిరి ఆడనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేళ వైసీపీ మద్దతు కోసం బీజేపీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. అయితే వైసీపీ తమకు ఎందుకు మద్దతు ఇస్తుందో తెలియదు అని పురంధేశ్వరి చెప్పడం విశేషం అని అంటున్నారు.
పైగా బిజూ జనతాదళ్ కూడా తమకు మద్దతు ఇస్తోంది అని ఆమె చెప్పుకొచ్చారు. అలా జగన్ని ఒడిషా సీఎం తో పోల్చుతూ ఆమె మాట్లాడడం కూడా గమనార్హం. అయితే బిజూ జనతాదళ్ చాలా విషయాల్లో మోడీ సర్కార్ తీరుని ఎండగడుతోంది. వైసీపీ మద్దతు ఇస్తోంది. వైసీపీకి బీజేపీకి మధ్య ఏదో తెలియని దోస్తీ ఉందని అంతా అంటున్న నేపధ్యం ఉంది.
అయితే మాకు వైసీపీ మద్దతు అవసరం లేదన్నట్లుగా చిన్నమ్మ మాట్లాడడమే చర్చకు దారి తీస్తోంది. దీని మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇకపోతే పురంధేశ్వరి కామెంట్స్ వైసీపీ లైట్ తీసుకుంటుందా లేక ఘాటుగా రిప్లై ఇస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంది.