వైసీపీ జంపింగ్‌ల్లో ఆ ముగ్గురూ ఓకే... శ్రీదేవి నో టిక్కెట్...!
గుంటూరుకు చెందిన తాడికొండ ఎస్సీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కూడా వైసీపీ పార్టీ నుంచి బయటకు పంపించింది
ఔను.. వాళ్లంతా సెట్ అయ్యారు. మరి ఆమె మాటేంటి? ఇదీ.. ఇప్పుడు గుంటూరు రాజకీయాల్లో జరుగుతు న్న చర్చ. ముఖ్యంగా వైసీపీ నాయకులు కూడా ఈ విషయంపై చర్చించుకుంటుండడం గమనార్హం. విషయం ఏంటంటే.. ఈఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ.. నలుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ వేటు వేసింది. వీరిలో నెల్లూరుకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్)లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినా.. ప్రస్తుతం వీరు రికార్డుల ప్రకారం వైసీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు.
ఇదిలావుంటే.. వీరితో పాటు గుంటూరుకు చెందిన తాడికొండ ఎస్సీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కూడా వైసీపీ పార్టీ నుంచి బయటకు పంపించింది. అంతేకాదు.. ఆమె పేరు కూడా ఎత్తడం లేదు.
దీంతో ఈ నలుగురు కూడా వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. వీరిలో ముగ్గురికి.. టీడీపీలో చోటు దక్కింది. ఆనంకు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీనికి తగినట్టుగా ఆయన వారానికి మూడు రోజులు అక్కడే ఉంటున్నారు. ఇక, ఉదయగిరి నుంచి మేకపాటికే టీడీపీ టికెట్ దక్కుతుందనే ప్రచారం ఉంది. అయితే..దీనిపై కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
ఇక, నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డిని టీడీపీ తరఫున బరిలో దింపనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఉండవల్లి శ్రీదేవి పార్టీ నుంచి బయటకు వచ్చినా.. ఇప్పటి వరకు ఆమె నోటి నుంచి టీడీపీ అనుకూలంగా ఒక్క మాట కూడా రాలేదు. టీడీపీ వైపు నుంచి కూడా ఎలాంటి స్పందనా లేదు.
ప్రస్తుతం ఉండవల్లి.. హైదరాబాద్‌లో డాక్టర్‌గా ప్రాక్టీసు చేస్తున్నారని తెలుస్తోంది. వారానికి రెండు రోజులు మాత్రమే నియోజకవర్గంలో ఉంటున్నారని తెలిసింది. మొత్తానికి ఆమె మాత్రమే సెటిల్ కావాల్సి ఉందని అంటున్నారు. ఎన్నికలకు ముందు.. ఏమైనా ఈ విషయంలో ప్రకటన చేస్తారా? లేక రాజకీయాల నుంచి తప్పుకొంటారా? అన్నది చూడాలి.