జనసేనాని షార్ట్ పీరియడ్ వార్... టార్గెట్ జనగన్న కాలనీలు!

పేదలకు ఇళ్ళపట్టాలిచ్చి జగనన్న కాలనీలను ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే

Update: 2023-07-28 09:06 GMT

ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ పై మరో షార్ట్ పిరియడ్ పోరాటానికి తెరలేపింది జనసేన. ఇందులో భాగంగా శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు జనసేన నేతలు, కార్యాకర్తలంతా జగనన్న కాలనీలను సందర్శించాలని పిలుపిచ్చింది. ఈ మేరకు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రభుత్వం.. పేదలకు ఇళ్ళపట్టాలిచ్చి జగనన్న కాలనీలను ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. పట్టాలిచ్చిన ప్రాంతాల్లో ప్రభుత్వమే కాలనీలను ఏర్పాటుచేస్తోంది. ఇదే సమయంలో అమరావతిలో సైతం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, ఇళ్ల నిర్మాణానికి పనులు ప్రారంభించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు జరిగిపోతున్నాయి!

మరోవైపు ప్రస్తుతం కుర్తుసోన్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ గురించైతే చెప్పే పనేలేదు! భాగ్యనగరం మొత్తం వరదలతో నిండిపోయిందనే వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఈ వర్షాలవల్ల నదులు పొంగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి సైతం మునిగిపోయిన సంగతి తెలిసిందే.

ఈ సమయంలో ఏపీలో జగనన్న కాలనీల పరిస్థితి ఎలా ఉందో చూడాలని జనసేన నిర్ణయించింది. ఇందులో భాగంగా... శనివారం ఉదయం 10 గంటల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా తమ తమ ప్రాంతాల్లోని జగనన్న కాలనీలను సందర్శించాలని మనోహర్ తెలిపారు. ఇదే సమయంలో అక్కడి పరిస్థితులను ఫోటోలు, వీడీయోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు.

ఈ వానలకే పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు మునిగిపోయాయనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ సూచించారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు శనివారం పార్టీ శ్రేనులతా ఈ పనిలో ఉండాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.

కాగా... గతంలో కూడా రోడ్ల విషయంలో జనసేన ఇలాంటి క్యాంపెయిన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు రోడ్ల మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా వర్షాలకు మునిగిపోయిన జగనన్న కాలనీల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయనున్నారు.

Tags:    

Similar News