అధినేతల చేతుల్లో అంతుంటుంది... ఫుల్ గా తగ్గిన పిల్లి సుభాష్!
అత్యితే మరోసారి జగన్ ఎంట్రీ అవ్వడంతో ఈ గొడవ... టీ కప్పులో తుపానుగా తేలిపోయింది. ఈ విషయాలపై పిల్లి సుభాష్ తాజాగా స్పందించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ చెల్లుబోయిన వేణుగోపాల్ గా రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అత్యితే మరోసారి జగన్ ఎంట్రీ అవ్వడంతో ఈ గొడవ... టీ కప్పులో తుపానుగా తేలిపోయింది. ఈ విషయాలపై పిల్లి సుభాష్ తాజాగా స్పందించారు.
అవును.. వైసీపీ టికెట్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు రామచంద్రపురం ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ తేల్చి చెప్పిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తాజాగా వెనక్కి తగ్గారు! పార్టీని వీడే ఆలోచన లేదని ప్రకటించారు. జగన్ మాటే తనకు శిరోధార్యం అని అంటున్నారు. ఈ అంశంపై మీడియా ద్వారా ముఖ్యమంత్రి జగన్ కి క్షమాపణ చెబుతున్నట్లు ఆయన తెలిపారు.
కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి సీహెచ్ శ్రీనివాస వేణుగోపాల కృష్ణకు టిక్కెట్ ఇస్తే రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేస్తానని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆదివారం ప్రకటించారు.
ఇదే సమయంలో తనకు టిక్కెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, లేదంటే తన కుమారుడు రామచంద్రపురం నుంచి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. దీంతో బోసు పార్టీ మారబోతున్నారంటూ కథనాలు రావడం మొదలయ్యింది. ఫలితంగా పార్టీలో కలకలం రేగింది. కార్యకర్తల్లో కన్ ఫ్యూజన్ నెలకొంది.
ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ పిల్లి సుభాష్ ను తాడేపల్లికి పిలిపించి చర్చలు జరిపారు. మరి వీరి చర్చల్లో ఏమి జరిగిందో.. జగన్ ఎలాంటి హామీ ఇచ్చారో తెలియదు కానీ... సమావేశం అనంతరం సుభాష్ మెత్తబడినట్లు కనిపించింది.
ఇందులో భాగంగా సమావేశం అనంతరం తిరిగి రామచంద్రపురం వచ్చిన ఆయన... తన అనుచరులతో సమావేశమయ్యారు. తనకు పార్టీని వీడే ఆలోచన లేదని, జనసేన పార్టీలో లేదా మరే ఇతర పార్టీలో చేరే ఆలోచన అస్సలే లేదని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మూలస్తంభాల్లో తాను ఒకడిని అని చెప్పుకున్నారు.
ఈ సందర్భంగా నాడు వైఎస్సార్ అయినా, నేడు వైఎస్ జగన్ అయినా... ఎల్లప్పుడూ తన అభిప్రాయాన్ని గౌరవిస్తారని చెప్పిన ఆయన... ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కొన్ని సమస్యలను పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లానని, అది తన బాధ్యత అని అన్నారు. అయితే అది తన వ్యక్తిగత విషయం కాదని... కార్యకర్తల అభిప్రాయం మేరకే జగన్ కు సూచించినట్లు తెలిపారు.
ఈ క్రమంలో వేణు అనుచరుడు.. బోసు అనుచరుడిపై మంత్రి సమక్షయంలో భౌతిక దాడికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయాలను గుర్తుచేసుకున్న బోసు... తన అనుచరులు, పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసినప్పుడు తాను బాధపడినట్లు చెప్పారు.
ఇదే సమయంలో కొంతమంది నాయకులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించినప్పుడు తాను బాధపడ్డాను అని చెప్పిన ఎంపీ పిల్లి సుభాష్... ఈ విషయాలన్నింటినీ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఫలితంగా... రామచంద్రపురంపై జగన్ సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందని బోసు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఇంతటితో ఈ ఎపిసోడ్ ను ముగించాలని మీడియాకు బోస్ విజ్ఞప్తి చేశారు.
ఆ సంగతి అలా ఉంటే... ఆదివారం నాడు అంత హడావిడి చేసిన బోసు మంగళవారం ఇలా కూల్ అయిపోవడంపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. బోస్ కు జగన్ ఎలాంటి హామీ ఇచ్చి ఏమైఉంటాదంటారండే..? అంటూ నియోజకవర్గంలో తెగ చర్చలు జరుగుతున్నాయి!