పవన్ అక్కడ నుంచే పోటీ..కన్ ఫర్మ్..?

తాజాగా మీడియాతో మాట్లాడుతూ పవన్ భీమవరం నుంచే పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ మేరకు తాను పవన్ని కోరానని ఆయన ఓకే చెప్పారని అంటున్నారు.

Update: 2023-07-21 15:43 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ ఆ పార్టీతో పాటు బయట కూడా సాగుతూనే ఉంది. అయితే పవన్ వారాహి యాత్ర రెండు విడతలుగా ఉమ్మడి గోదావరి జిల్లాలలో చేశారు కానీ ఎక్కడా తాను పోటీ చేసే విషయం మాత్రం ప్రకటించలేదు.

ఇక భీమవరంలో పవన్ ప్రసంగిస్తూ తన నేల ఇది అని అన్నారు. తాను ప్రజల కోసం ఒక శ్రమజీవిగా పనిచేస్తాను అని ప్రకటించారు. ఈ స్టేట్మెంట్ తరువాత పవన్ కచ్చితంగా భీమవరం నుంచే పోటీకి దిగుతారు అని అంతా అనుకుంటున్నారు. భీమవరంలో పవన్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకు 62 వేల పై చిలుకు ఓట్లు లభించాయి.

అదే సమయంలో టీడీపీకి యాభై వేల పై చిలుకు ఓట్లు దక్కినా మూడవ స్థానంలోనే ఉంది. మొత్తం భీమవరంలో పోలింగ్ జరిగిన ఓట్లలో 32 శాతం ఓట్లు పవన్ కి రావడం అంటే అది గొప్ప విషయం అని అంటున్నారు. ఇక ఆయన మీద పోటీ చేసి గెలిచిన గ్రంధి శ్రీనివాస్ కేవలం ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతోనే ఎమ్మెల్యే అయ్యారు.

ఇక వైసీపీ పాలనలో గ్రంధి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా పెద్దగా జనంలో పేరు తెచ్చుకోలేదని, ఆయన పాలన తీరు జనాలు పెదవి విరిచేదిగానే ఉంది అని అంటున్నారు. దీంతో ఈసారి కనుక పవన్ పోటీ చేస్తే భీమవరంలో గెలుపు ఖాయమని అంటున్నారు. దానికి 2019 నాటి లెక్కలను కూడా అంచనా కట్టి చెబుతున్నారు. అప్పట్లో వైసీపీకి వచ్చిన ఓట్లు ఒక వైపు ఉంచితే జనసేన టీడీపీకి వచ్చిన ఓట్లను కలుపుకుంటే ఏకంగా 45 వేల పై చిలుకు మెజారిటీ దక్కుతుందని, ఇపుడు వైసీపీ ఎమ్మెల్యే గ్రాఫ్ బాగా పడిపోయిన నేపధ్యం ఉందని అంటున్నారు.

అందువల్ల పవన్ బరిలో నిలిస్తే జనసేన టీడీపీ పొత్తు ఉంటే రికార్డు స్థాయి మెజారిటీ పవన్ సాధిస్తారు అని అంటున్నారు. అదే టైం లో పవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు అని విమర్శలు వైసీపీ నుంచి ఇప్పటిదాకా వచ్చాయి. వాటికి సరైన జవాబు చెప్పాలీ అంటే భీమవరం నుంచే పవన్ మళ్ళీ పోటీ చేయాలని మెజారిటీ కూడా రికార్డుని బద్ధలు కొట్టేలా ఉంటేనే అదిరిపోయే కౌంటర్ వైసీపీకి ఇచ్చినట్లు అవుతుంది అని అంటున్నారుట.

ఇంకో వైపు చూస్తే వైసీపీ రెబెల్ ఎంపీ ఢిల్లీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ణి కలిసారు. ఆయనతో చాలా విషయాలు చర్చించారు. ఇక ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ పవన్ భీమవరం నుంచే పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ మేరకు తాను పవన్ని కోరానని ఆయన ఓకే చెప్పారని అంటున్నారు.

ఆయన మరో మాట కూడా అంటున్నారు. నూటికి నూరు శాతం జనసేన టీడీపీ బీజేపీల మధ్య ఏపీలో పొత్తు ఉంటుందని. మరి రెబెల్ ఎంపీ పవన్ పోటీ చేసే సీటు ఏంటో చెప్పేశారు. అలాగే ఏపీలో పొత్తుల గురించి చెప్పేశారు. మరి ఇవన్నీ నిజం అవుతాయా అన్నదే చూడాల్సి ఉంది.

Tags:    

Similar News