పొలిటికల్ ఇండికేషన్స్: జనసేన ప్లీనరీ హీటెక్కిస్తుందా ?
జనసేన అధికారంలో ఉండగా నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ ఇది. దాంతో ఇప్పటికే అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి.
సరిగ్గా మరో నెల రోజులలో జనసేన ప్లీనరీ జరగనుంది. మార్చి 12, 13, 14 తేదీలలో మూడు రోజుల పాటు ప్లీనరీని నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. అది కూడా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఈ ప్లీనరీని ఏర్పాటు చేస్తున్నారు. ఇక పవన్ పార్టీ కోసం కొన్న సొంత స్థలంలో జరగడం మరో విశేషం.
జనసేన అధికారంలో ఉండగా నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ ఇది. దాంతో ఇప్పటికే అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. అయితే ఈసారి ప్లీనరీలో అన్నీ చర్చించి సమగ్రమైన సలక్షణమైన నిర్ణయాలను తీసుకుందామని గత నెలలో పవన్ తన క్యాడర్ కి ఒక బహిరంగ లేఖ రాశారు. అది ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్ కి ఇవ్వాలని టీడీపీ తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో వారికి సోషల్ మీడియా వేదికగా జనసైనికులు కౌంటర్ ఇస్తున్న క్రమంలో పవన్ వారిని వారిస్తూ రాసిన బహిరంగ లేఖ. అందులో ఆయన కౌంటర్లు ఆపాలని కోరడమే కాకుండా జనసేన ప్లీనరీలో అన్నీ చర్చిద్దామని నాడు చెప్పారు.
ఇక ఆ తరువాత మరిన్ని పరిణామాలు రాజకీయంగా చోటు చేసుకున్నాయి. జనసేన అధినేత చాన్నాళ్ళుగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తన శాఖల మీద సమీక్ష చేయడం లేదు. అంతే కాకుండా ఆయన మంత్రివర్గ సమావేశానికి అలాగే తాజాగా నిర్వహించిన మంత్రులు కార్యదర్శుల భేటీకి సైతం గైర్ హాజరయ్యారు. కానీ అదే సమయంలో దక్షిణాదిన రెండు కీలక రాష్ట్రాలు అయిన కేరళ, తమిళనాడులలో పర్యటిస్తున్నారు. ఇవన్నీ ఎంత కాదనుకున్నా దూరాభారాలే. విమానాలతో పాటు రోడ్డు మీద కూడా ప్రయాణించాల్సి ఉంది.
ఇక పవన్ పక్కన సొంత పార్టీ నేతలు ఎవరూ లేరు. కేవలం తన కుమారుడు అఖిరానందన్ ని తోడు తెచ్చుకున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా కొడుకు సాయంతో ఆయన ఈ పర్యటనలు చేస్తున్నారు అంతే కాదు ఆయన మిత్రుడు, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి మాత్రమే ఉన్నారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగతం అని పవన్ మీడియాకు చెప్పారు. ఇదిలా ఉంటే పవన్ ఏకంగా సీఎం చంద్రబాబు ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో పాటు తన సాటి సహచర నేత, మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని అంటున్నారు. నాదెండ్ల ఫోన్ నుంచి చంద్రబాబు మాట్లాడాలని చేసిన ప్రయత్నంగా దానిని చెబుతున్నారు.
ఇవన్నీ చూస్తూంటే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం పెద్దల తీరు పట్ల ఆగ్రహంగా ఉన్నారా లేక అసంతృప్తిగా ఉన్నారా అన్నది తెలియడంలేదు అంటున్నారు. ఎనిమిది నెలల కూటమి ప్రభుత్వంలో చంద్రబాబుకి పవన్ ఎంతో విలువ ఇస్తూ వచ్చారు. అలాగే బాబు కూడా పవన్ ని ఎంతో మర్యాదగా చూసుకున్నారు. కానీ టీడీపీలో కొందరి పెత్తనం ఎక్కువ అయిందని జనసేనలో వినిపిస్తోంది. సీఎం గా బాబు ఉన్నా షాడో సీఎం ల పాత్ర ఎక్కువ అయిందని ఆఖరుకు జనసేన మంత్రులతో పాటు పవన్ నిర్వహించే శాఖల విషయంలోనూ వారి జోక్యం అధికం అయిందన్నది ఒక పుకారుగా షికారు చేస్తోంది.
ఇక అధికారులు సైతం వారి మాటే వింటున్నారని జనసేన మంత్రుల ఆదేశాలను పెద్దగా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రచారం సాగుతోంది. వీటికి తోడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఒక్కరే ఉండాలన్నది ఒక అనధికార కూటమి పార్టీల ఒప్పందంగా ఉందని దానిని కాదని తమ్ముళ్ళు వేరే నినాదం ఎత్తుకోవడం కూడా జనసేన వర్గాలకు నచ్చడంలేదు అని అంటున్నారు
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు పవన్ లోనూ ఈ భావాలు ఉన్నాయా. అందుకే ఆయన కీలక సమావేశాలకు రావడం లేదా అన్న చర్చ సాగుతోంది. ఇక చూస్తే ఈ రకమైన అసంతృప్తి జనసేనలో ఉన్నా టీడీపీ కూటమి పెద్దలు అయితే దానిని ఎంతవరకూ సరిచేస్తారు అన్నది ఒక ప్రశ్నగానే ఉంటుందని అంటున్నారు. మరో వైపు చూస్తే జనసేన ప్లీనరీ మీద ఇపుడు ఆసక్తి పెరుగుతోంది. మూడు రోజుల సమావేశంలో ఏ రకమైన రాజకీయ తీర్మానాలను ఆమోదిస్తారు అన్నది కూడా చర్చకు వస్తోంది. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా పవన్ వైఖరి ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత అన్నది.