అందుకే ఆలస్యం సూపర్ సిక్స్ హామీలపై లోకేశ్ ఏమన్నారంటే..
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్ సూపర్ సిక్స్ హామీలపై స్పందించారు.
కూటమి పార్టీల ప్రధాన ఎన్నికల హామీ సూపర్ సిక్స్. కూటమి గెలిచి ఏడు నెలలు అవుతున్నా, ఈ హామీల అతీగతీ లేదని విపక్షం ఆరోపిస్తోంది. అయితే ఇప్పటికే రెండు హామీలు నెరవేర్చామని, మరో రెండు హామీలకు డేట్లు ఇచ్చామని, మిగతావి త్వరలో అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. నిజంగా సూపర్ సిక్స్ హామీల్లో రెండు అమలు అవుతున్నాయా? ఈ విషయంపై మంత్రి లోకేశ్ స్పందించారు. తమను గెలిపించిన సూపర్ సిక్స్ హామీలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి లోకేశ్. అయితే ఈ హామీల అమలు చేయడంలో జరుగుతున్న జాప్యానికి కారణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేశ్.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్ సూపర్ సిక్స్ హామీలపై స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే సూపర్ సిక్స్ హామీల అమలు ఆలస్యమవుతుందని చెప్పుకొచ్చారు మంత్రి. ప్రభుత్వం ప్రతి నెలా రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్ తో నడుస్తోందని చెప్పిన మంత్రి.. ఆరు గ్యారెంటీలను అమలు చేసి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటామని తెలిపారు. ప్రస్తుతం రెండు వాగ్దానాలు అమలు అవుతున్నాయని, మరో రెండు వాగ్దానాలకు సమయం నిర్ణయించామని చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్ ఉండి, కాళ్ల, భీమవరం తదితర ప్రాంతాలను సందర్శించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాళ్ల మండలం పెద ఆమిరంలోని జువ్వలపాలెం రోడ్డులో ప్రముఖ పారిశ్రామిక వేత్త దివంగత రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పెద ఆమిరం-ఉండి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన లోకేశ్, భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నారు.