దూసుకెళుతున్న ఈవీ వాహన అమ్మకాలు.. ఏడాదిలో ఎంత ఎక్కువంటే?

2023 జులైలో 1,16,221 ఈవీలు అమ్ముడు కాగా.. ఈ ఏడాది అదే నెలలో 1,79,038 అమ్ముడు కావటం విశేషం.

Update: 2024-08-07 06:11 GMT

ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల జోరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గత ఏడాది జులైతో పోలిస్తే ఈ ఏడాది జులైలో ఈవీ వాహన అమ్మకాల భారీగా సాగినట్లు పరిశ్రమల వర్గాలు వెల్లడించాయి. వాహన డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) ఆసక్తికర గణాంకాల్నివిడుదల చేసింది. దీని ప్రకారం ఎలక్ట్రికల్ వాహనాల అమ్మకాల జోరు ఎంత ఉందన్న విషయాన్ని పేర్కొంటూ.. జులైలో 55.2 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. 2023 జులైలో 1,16,221 ఈవీలు అమ్ముడు కాగా.. ఈ ఏడాది అదే నెలలో 1,79,038 అమ్ముడు కావటం విశేషం.

ఈవీల్లో టూవీలర్ల అమ్మకాలు మిగిలిన వాటి కంటే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. గత ఏడాది జులైలో 54,616 వాహనాలు అమ్ముడు కాగా.. ఈ ఏడాది ఈ విభాగంలో 95.94 వ్రద్ధిరేటును నమోదు చేయటంతో 1,07,016 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇక.. త్రిచక్ర వాహన అమ్మకాలు 18.18 శాతం పెరిగి 63,667 అమ్ముడు కాగా.. ప్రయాణికుల వాహనాలు మాత్రం తగ్గటం గమనార్హం. గత ఏడాది జులైతో పోలిస్తే 2.92 శాతం తగ్గి 7,541కు పరిమితమైంది.

దేశంలో ఈవీల డిమాండ్ అంతకంతకూ పెరగటం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ప్రజలు వాటిని ఉపయోగించటానికి ఆసక్తి చూపుతున్నారని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఈవీ వాహనాల్ని అంగీకరిస్తున్నరన్న దానికి ఇదో స్పష్టమైన సంకేతంగా ఫాడా ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా పేర్కొన్నారు. ఈవీల అమ్మకాల్లో జోరుకు ప్రభుత్వ విధానాలు కూడా కారణంగా చెప్పొచ్చు.

ఈవీలపై ఆకర్షణీయమైన రాయితీలతో పాటు.. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీంను ఆపేస్తారన్న ప్రచారం కూడా కొనుగోళ్లు పెరగటానికి కారణంగా చెబుతున్నారు. అయితే.. ఈ ప్రచారానికి భిన్నంగా ఈఎమ్ పీఎస్ స్కీంను సెప్టోంబరు 30 వరకు పొడిగించటంతో పాటు పథకం కేటాయింపుల్ని రూ.500 కోట్ల నుంచి రూ.778 కోట్లకు ప్రభుత్వం పెంచటంతో ఈవీ కొనుగోలుదారులకు వరంగా మారినట్లుగా చెప్పాలి.

Tags:    

Similar News