టెన్షన్ లో విమానయానం... జీపీఎస్‌ సిగ్నల్‌ స్పూఫింగ్‌ అంటే తెలుసా?

రోడ్లపై వెళ్తున్న కార్లు, లారీలు గూగుల్ సిగ్నల్ లో కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందనే దానికి చాలా ఉదాహరణలే ఈ మధ్యకాలంలో చాలానే జరిగాయి.

Update: 2023-10-01 09:22 GMT

రోడ్లపై వెళ్తున్న కార్లు, లారీలు గూగుల్ సిగ్నల్ లో కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందనే దానికి చాలా ఉదాహరణలే ఈ మధ్యకాలంలో చాలానే జరిగాయి. జీపీఎస్ సిగ్నల్ రాంగ్ గా చూపించడం వల్ల ఒక లారీ బ్యారేజ్ లోకి వెళ్లిపోతే... మరో కారు కూలిన బ్రిడ్జిపై నుంచి ఏటిలో పడిపోయింది. రోడ్లపైనే పరిస్థితి ఇలా ఉంటే... మరి గాల్లో ప్రయాణిస్తున్న విమానాలు ఉన్నఫలంగా జీపీఎస్ సిగ్నల్ లాస్ట్ అయితే... ఆ ప్లేస్ లోకి నకిలీ సిగ్నల్ వస్తే పరిస్థితి ఏలా ఉంటుంది? ప్రస్తుతం అదే పరిస్థితిని గత రెండు వారాల్లో 20 మంది పైలైట్లు అనుభవించారు.. అనుభవిస్తున్నారు.

అవును... గత 15 రోజుల వ్యవధిలో దాదాపు 20 విమానాలు దారి తప్పినట్లు ఫ్లైట్‌ డేటా ఇంటెలిజెన్స్‌ వెబ్‌ సైట్‌ "ఓపీఎస్‌ గ్రూప్‌" ప్రకటించింది. నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ వల్లే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. విమానయాన వ్యవస్థల నావిగేషన్‌ వ్యవస్థను సైతం ఏమార్చగలిగే స్థాయిలో ఇవి పనిచేస్తూ... విమానాలను తప్పుదోవ పట్టించేంత శక్తిమంతంగా తయారవడం ఆందోళనకరంగా మారిందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే.. ఈ మధ్య ఇరాన్‌ - ఇరాక్‌ గగనతలంలో విమానాలు తరచూ దారి తప్పుతున్నట్లు తేలిందట. అసలు ఈ ప్రాంతంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది.. ఒకసారో రెండు సార్లో అయితే ఏదో అనుకోవచ్చు.. వరుసపెట్టి ఎందుకు ఇలా జరుగుతున్నాయి.. దీని వెనుకున్న అదృశ్య శక్తి ఏమిటి అనే విషయాలపై దృష్టి సారించారంట. దీంతో... ఇలా విమానాలు దారితప్పడానికి నకిలీ జీపీఎస్‌ సిగ్నల్సే కారణం అని ప్రాథమికంగా తేలిందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా.. బోయింగ్‌ 777, బోయింగ్‌ 737, 747 సహా పలు ఇతర విమానాలు ఈ నకిలీ సిగ్నల్స్‌ బారిన పడిన వాటిలో ఉన్నాయని అంటున్నారు. ఓ బోయింగ్‌ 777 విమానంలోని పైలట్లకైతే.. అసలు వారు ఎక్కడున్నారో కూడా అర్థం కాలేదని ఫ్లైట్‌ డేటా ఇంటెలిజెన్స్‌ వెబ్‌ సైట్‌ "ఓపీఎస్‌ గ్రూప్‌" తెలిపింది. దీంతో వెంటనే వారు బాగ్దాద్‌ లోని "ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌"ను సంప్రదించి... తామెక్కడున్నదీ తెలిపాలని, అసలు ఇప్పుడు సమయం ఎంత అయ్యిందో చెప్పాలని అడిగారంట. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు... రాంగ్ సిగ్నల్ వ్యవస్థ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అనేది!

అయితే ఇదేదో ఇరాన్ – ఇరాక్ ప్రాంతాల్లోని విమానాల సమస్య అనుకుంటే పొరపాటే సుమా... ఈ ఘటనలు చోటు చేసుకుంటున్న ప్రాంతం మీదుగా భారత్‌ కు చెందిన విమానాలు సైతం తరచూ ప్రయాణిస్తుంటాయి. ఇందులో భాగంగా భారత్‌ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కో, ఇస్తాంబుల్‌, బాకు, లండన్‌ కు వెళ్లే ఎయిరిండియా, ఇండిగో, విస్తారా విమానాలు ఈ మార్గం నుంచే వెళతాయి. అయితే, ఇప్పటివరకూ ఇవి కూడా నకిలీ జీపీఎస్‌ బారిన పడ్డాయో లేదో మాత్రం ఇంకా తెలియలేదు!

ఏమిటీ జీపీఎస్‌ సిగ్నల్‌ స్పూఫింగ్‌:

ఇలా నావిగేషన్‌ వ్యవస్థను ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్‌ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియను "జీపీఎస్‌ సిగ్నల్‌ స్పూఫింగ్‌" అని అంటారు. నిజమైన శాటిలైట్‌ సిగ్నల్స్‌ ను అడ్డుకొని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్‌ రిసీవర్‌ ను తప్పుదోవ పట్టించడమే వీటి పని. దీంతో పైలైట్ కు తప్పుడు లొకేషన్‌, తప్పుడు సమయం చూపిస్తుంది. ఇలా చేయడాన్నే సిగ్నల్‌ స్పూఫింగ్‌ అంటారు. గతంలో ఇవి అడపాదడపా జరిగినా... ఈ స్థాయిలో జరగలేదని చెబుతున్నారు. దీంతో వ్యవస్థలు ఇష్యూని సీరియస్ గా తీసుకున్నాయని తెలుస్తుంది.

ఇలా ఈ మధ్యకాలంలో ఇరాన్‌ గగనతలం నుంచి వెళ్లే యూఎం688 ఎయిర్‌ వే లో ఈ ఘటనలు జరుగుతున్నట్లు గుర్తించి సీరియస్‌ గా రియాక్ట్ అయిన అమెరికా "ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ " ఓ మెమోను జారీ చేసింది.

అంత ప్రమాధం కాదా?:

ఈ విషయాలపై కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తుంటే... సిగ్నల్‌ జామింగ్‌ అంత ప్రమాదకరం ఏమీ కాదని విమానయాన నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఇవి తరచూ జరుగుతుంటాయని.. దీన్ని వెంటనే గుర్తించవచ్చని.. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలో కూడా ఫ్లైట్‌ మాన్యువల్‌ లో స్పష్టంగా ఉంటుందని చెబుతున్నారు.

సాధారణంగా నావిగేషన్‌ వ్యవస్థ, జీపీఎస్‌ వ్యవస్థల్లో విమానం ఉన్న ప్రదేశం వేర్వేరుగా చూపిస్తే.. తక్షణమే జీపీఎస్‌ ను ఆపేయాల్సి ఉంటుందని చెబుతున్న నిపుణులు... ఒకవేళ పైలట్లు అది గమనించకుండా నకిలీ సిగ్నల్స్ గైడెన్స్ ప్రకారం దారి తప్పితే ఏటీసీ వెంటనే అప్రమత్తమై వారిని హెచ్చరిస్తుందని అన్నారు. కానీ.. ఆ సమయానికి ఎవరూ గమనించకపోతే మాత్రం ఇది పెద్ద ప్రమాదానికే దారి తీయొచ్చని చెబుతున్నారు.

Tags:    

Similar News