జగన్ కి పులివెందుల ఊరటను ఇచ్చిందా ?
ఎంతటి కష్టాన్ని అయినా తీర్చి ఓదార్చేది సొంత ఊరే. అందుకే జగన్ కి పులివెందుల ఎంతో సేద తీరుస్తోంది. ఆయనకు కొత్త ధైర్యాన్ని ఇస్తోంది.
భారీ ఓటమి అసలు కోలుకోలేని ఓటమి వైసీపీకి లభించింది. రాజకీయాల్లో చూస్తే జయాపజయాలు సర్వసాధారణం. అయితే ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేరు. ఎంత ఢక్కామెక్కీలు తిన్నవారు అయినా ఓటమి బాధ నుంచి తట్టుకోవడం కష్టమే. 2019లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కేవలం 23 సీట్లు మాత్రమే దక్కడంతో ఇలా ఎందుకు జరిగింది అని వగచి వాపోయారు.
కొన్నాళ్ల పాటు ఆయన అదే మాట్లాడుతూ ఉండేవారు. ఆ తరువాత బాబు తనదైన వ్యూహాలతో ముందుకు సాగారు. ఇక జగన్ విషయం చూస్తే ఆయన చుట్టూ ఒక చిన్న ప్రపంచం ఉంటుంది. ఆయన అందులోనే ఉంటారు అని అంటారు. ఆయన ఎక్కువగా ఎవరినీ కలవరు అన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపధ్యలో భారీ ఓటమి బాధకు తగిన ఓదార్పు లేక ఆయన అల్లాడిపోయారు అని అంటున్నారు.
జగన్ కి కచ్చితంగా గెలుస్తామని చుట్టూ ఉన్న కోటరీ నమ్మించింది. జగన్ అదే నిజం అనుకున్నారని చెబుతారు. తీరా ఫలితాలు తేడా కొట్టాయి. అలా ఇలా కాదు ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతంగా కనీసం ఏ నలభై యాభై సీట్లు వచ్చినా జగన్ కి ఇంత బాధ లేకపోవును. కానీ బొత్తిగా 11 సీట్లే రావడంతో అసెంబ్లీ బిజినెస్ కి కూడా వాలంటరీగా దూరం కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఈ క్రమంలో ఫలితాలు వచ్చిన మూడు వారాల దాకా మధనం అంతర్మధనం చేసుకున్న జగన్ తన సొంత ఊరు వెళ్లారు. పులివెందులలో జగన్ కి ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి ఆయనను చూసేందుకు జనాలు వచ్చారు. ఇక జగన్ ని చూసేందుకు పార్టీ ఆఫీసుకు కూడా జనాలు తరలి వచ్చారు.
ఇలా పెద్ద ఎత్తున వచ్చిన జనంతో జగన్ ముఖం వెలిగిపోయింది. ఆయనలో మళ్లీ ఆత్మ విశ్వాసం తొణికిసలాడింది. యువత మహిళలు వృద్ధులు అందరూ వచ్చి జగన్ కి జేజేలు పలికారు. దాంతో జగన్ సైతం వారి దగ్గరకు వెళ్ళి పలకరిస్తూ వారితో మాట్లాడుతూ ఓటమి బాధను మరచిపోయారు. ఇదివరకు మాదిరిగానే ఆయన ముఖంలో నవ్వు కనిపించింది అని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మరో వైపు చూస్తే పులివెందుల జగన్ కి ఇంతటి కూటమి ప్రభంజనంలోనూ అలాగే సొంత చెల్లెలు ఓట్లు చీల్చినా కూడా యాభై వేల పై చిలుకు భారీ మెజారిటీని అందించింది. దాంతోనే పులివెందుల కేరాఫ్ వైసీపీ కోట అని పిలుచుకునేది. ఇక వైఎస్సార్ కుటుంబానికి అది సొంత ఊరు. సొంత ఊరుని కన్న తల్లితో పోలుస్తారు.
ఎంతటి కష్టాన్ని అయినా తీర్చి ఓదార్చేది సొంత ఊరే. అందుకే జగన్ కి పులివెందుల ఎంతో సేద తీరుస్తోంది. ఆయనకు కొత్త ధైర్యాన్ని ఇస్తోంది. ఇప్పటికి 13 ఏళ్ళ క్రితం 2011లో కూడా కాంగ్రెస్ ని వీడి ఒంటరై వచ్చిన జగన్ కి కడప పులివెందుల కాపాడి కడుపులో పెట్టుకున్నాయి. భారీ మెజారిటీతో ఎంపీగా ఆయన్ని చేశాయి. మళ్ళీ అదే పులివెందుల జగన్ ని ఓటమిలో అక్కున చేర్చుకుంది.
జగన్ పులివెందులలో మూడు రోజుల పాటు ఉంటారు. ఈ సందర్భంగా రాయలసీమ నాలుగు జిల్లాల నేతలతో ఆయన సమీక్ష చేపడతారు అని అంటున్నారు పార్టీ ఓటమికి గల కారణలు ఆరా తీయడంతో పాటు పార్టీని మళ్లీ ఎలా దారిలో పెట్టాలి రాయలసీమలోని వైసీపీ కంచుకోటలను ఎలా నిలబెట్టుకోవాలి అన్న దాని మీద ఆయన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు.