చూసి నేర్చుకోండయా.. నాయకుడంటే చాందీ!
ఇలాంటి సమయంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఊమెన్ చాందీ.. అసమ్మతి నేతలను కూడా సమ్మతి దారిలో నడిపించి
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, దక్షిణాదిలో అందరికీ పరిచయం ఉన్న నేత...కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమూశారు. 79 ఏళ్ల వయసులో ఆయన అనారోగ్య కారణంగా బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. అయితే.. రాజకీయాల్లో ఎంతో మంది వస్తుంటారు.. మరెంతో మంది పోతుంటారు. కాబట్టి చాందీ కూడా వీరిలో ఒకరేనా? అంటే.. ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే.. ఉన్నది కాంగ్రెస్ పార్టీనే అయినా.. ఆయనలో కమ్యూనిస్టు భావాలు కనిపిస్తాయి.
ఈయనను సాధారణ నాయకుడిగా ఆ లక్షణాలే నిలబెట్టాయి. నిజానికి కాంగ్రెస్ అంటే కలగూర గంప. నిత్య అసమ్మతితో నాయకులు తర్జన భర్జన పడుతుంటారు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట సొంత పార్టీ ప్రభుత్వంపైనే రాళ్లు రువ్వుతారు.
ఇలాంటి సమయంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఊమెన్ చాందీ.. అసమ్మతి నేతలను కూడా సమ్మతి దారిలో నడిపించి.. తనదైన శైలితో ముందుకు సాగారు. ప్రజలు-ప్రజలు అనే మాటకు ఆయన పట్టాభిషేకం చేశారు.
నిజానికి ఇందిరమ్మ హయాం అంటే.. భజన బృందాలు ఎక్కువగా ఉండేవి. ఆమెకు, గాంధీల కుటుంబానికి భజన చేస్తే.. ఇవ్వని పదవి లేదు.. అన్నట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, పిన్న వయసులోనే కేరళలోని పుత్తూపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన చాందీ ఒకసారి ఇందిరమ్మను కలుసుకున్నారు. కేరళ కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ నేతలతో కలిసి ఆయన ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఆమె నాయకుల అభిరుచులు తెలుసుకున్నారు.
ఈ క్రమంలో పలువురు నాయకులు.. తమ అభిరుచి ఇందిరమ్మను ప్రధానిగా చూడడమేనని చెప్పారు. ఇక, చాందీ వంతు వచ్చింది. ఆయన తన అభిరుచి.. ప్రజాక్షేమమేనని ముక్కుసూటిగా చెప్పేశారు. అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజు దగ్గరకు వెళ్లి రాజు కాకుండా వేరే వారు ఇష్టమని చెబితే ఏం జరుగుతుందో అదే జరుగుతుందని.. ఇందిరమ్మ ఆగ్రహంతో ఇక, ఆయనకు టికెట్ రాదని అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా ఇందిరమ్మ రెండు నిమిషాల మౌనం అనంతరం.. చాందీ చెప్పింది నిజమే. నేను కూడా అంగీకరిస్తాను. అని ఆమె చాందీ భుజం తట్టారు. అంతేకాదు.. చాందీని చూసి నేర్చుకోండి. అని నాయకులకు ఇందిరమ్మ సూచించారు.
తర్వాత.. చాందీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. అనేక పదవులు అలంకరించారు. షార్ప్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఏకే ఆంటోనీ వంటి అసమ్మతి నాయకులను కూడా కలుపుకొని పోయారు. అందుకే చాందీ ఒక అమేయం.. ఒక అసాధారణం అన్నట్టుగా రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు.