మణిపూర్లో ఇండియా ఎంపీలు..సాధ్యమేనా ?
ఈ అల్లర్లన్నీ ఒక కుట్ర ప్రకారం జరుగుతున్నాయని అందరికీ తెలుస్తునే ఉంది
శనివారం, ఆదివారం నాడు అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపూర్ లో పర్యటించేందుకు ఇండియా కూటమిలోని 20 మంది ఎంపీలు పర్యటించాలని డిసైడ్ అయ్యారు. మణిపూర్లో గడచిన రెండున్నర నెలలుగా అల్లర్లతో పరిస్థితి ఘోరంగా తయారైన విషయం అందరికీ తెలిసిందే. రిజర్వేషన్ల డిమాండ్ల నేపద్యంలో మొదలైన గొడవలు చివరకు కర్ఫ్యూ విధించేంతవరకు చేరుకున్నది. విచిత్రం ఏమిటంటే కర్ఫ్యూ విధించినా అల్లర్లు ఆగటంలేదు. ఒకవైపు కర్ఫ్యూ దారి కర్ఫ్యూదే మరోవైపు అల్లర్ల దారి అల్లర్లదే అన్నట్లుగా సాగుతోంది.
వివాదాన్ని పరిష్కరించటంలోను, దాని నేపధ్యంలో మొదలైన అల్లర్లను అదుపుచేయటంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ ఫెయిలయ్యాయన్నది వాస్తవం. అల్లర్లు, గృహదహనం, దాడుల కారణంగా సుమారు 400 మంది చనిపోయారు. అంతకుమించి తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకుంటున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీళ్ళనంతా ఎక్కడెక్కడో క్యాంపుల్లో ఉంచింది ప్రభుత్వం. ఈ అల్లర్లన్నీ ఒక కుట్ర ప్రకారం జరుగుతున్నాయని అందరికీ తెలుస్తునే ఉంది.
కుట్ర ప్రకారమే అల్లర్లని ఎలా అనగలుగుతున్నారు ? ఎలాగంటే మామూలు జనాల ఇళ్ళేకాదు ఎంఎల్ఏలు, ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి ఇంటిని కూడా అసాంఘిక శక్తులు దహనం చేసేశాయి. అసాంఘిక శక్తుల కారణంగా మామూలూ జనాల ఇళ్ళు తగలబడే అవకాశాలున్నాయి కానీ ఏకంగా ప్రజా ప్రతినిధులతో పాటు కేంద్రమంత్రి ఇంటిని కూడా అల్లరిమూకలు తగలబెట్టారంటేనే అర్ధమైపోతోంది కుట్రకోణం. బాగా సెక్యూరిటీ ఉండే ఇళ్లు కూడా ఎలా తగలబడుతున్నాయో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అందుకనే మణిపూర్లో అల్లర్లు ఇన్నిరోజులకు కూడా కంట్రోల్ కావటం లేదు.
ఇలాంటి కుట్రలన్నీ ప్రపంచానికి తెలుస్తాయనే ప్రభుత్వం ఎవరినీ పర్యటించేందుకు అనుమతించడం లేదు. ఆ మధ్య రాహుల్ గాంధి పర్యటనకు వచ్చినా సాధ్యం కాలేదు. తాను పర్యటించాలని అనుకున్న ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం చెప్పిన ప్రాంతాల్లోనే పర్యటించి వెళ్ళిపోయారు. మరిపుడు రెండురోజుల ఎంపీల పర్యటన మాత్రం సజావుగా సాగుతుందా ? అనుమానంగానే ఉంది. ఎందుకంటే మణిపూర్లోకి బయట ప్రాంతం ప్రముఖులను, రాజకీయ నేతలను కేంద్రం అనుమతించటం లేదు. మరి 20 మంది ఎంపీల పర్యటనను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏమేరకు అనుమతిస్తాయో చూడాలి.