సంక్షోభ రాష్ట్రంపై చాప కింద నీరులా కేంద్రం సంచలన నిర్ణయం

ఇప్పటికి 8 నెలలవుతోంది.. రెండు జాతుల మధ్య తలెత్తిన ఘర్షణలు అంతకంతకు తీవ్రం అవుతున్నాయే కానీ.. తగ్గడం లేదు.

Update: 2024-01-23 06:45 GMT

ఇప్పటికి 8 నెలలవుతోంది.. రెండు జాతుల మధ్య తలెత్తిన ఘర్షణలు అంతకంతకు తీవ్రం అవుతున్నాయే కానీ.. తగ్గడం లేదు. మూకుమ్మడి అత్యాచారాలు.. హత్యలు.. దాడులు.. ప్రతిదాడులు అంతా అలజడే.. ఓవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. అక్కడి ఉద్రిక్తతలు రాజకీయంగా అత్యంత వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల మళ్లీ ఘర్షణలు పెరుగుతున్న సూచనలు కనిపించాయి. రాష్ట్ర సీఎం ఓ పక్షానికి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. పరిస్థితి చేజారిపోతుందా? అనే భయాందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చాప కింద నీరులా సంచలన నిర్ణయం తీసుకుంది.

దశాబ్దాల తర్వాత..

దేశంలో ఏదైనా రాష్ట్రంలో అంతర్గత, బాహ్య కల్లోల పరిస్థితులు తలెత్తితే వాటిని ఎదుర్కొనడానికి కేంద్ర ప్రభుత్వం చేతిలోని అస్త్రమే ఆర్టికిల్ 355. అయితే, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించారు. కానీ, శాంతిభద్రతలు కేంద్రం చేతిలోకి వెళ్తాయి. అయితే, రాష్ట్రపతి పాలనకు ముందు ప్రక్రియగా దీన్ని భావిస్తారు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో ఇదే జరగబోతోందా? అనే సందేహాలు వస్తున్నాయి. కుకీ, మెయిటీల మధ్య ఈ రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి పాలన విధించాలని కుకీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. భద్రతా బలగాలు, ప్రభుత్వ విధానాల విషయంలో తటస్థ పరిస్థితులు నెలకొనాలంటే ఇదే సరైన చర్యగా పేర్కొంటున్నారు. కాగా.. మన రాష్ట్రంలో ఆర్టికల్‌ 355 అమల్లో ఉందంటూ సోమవారం రాజధాని ఇంఫాల్‌ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం బీరేన్ సింగ్ వెల్లడించారు. ఇది రాష్ట్రపతి పాలనకు ముందు కేంద్రం రాష్ట్రంలో అధికారాన్ని తన చేతిలోకి తీసుకునే చర్యగా భావిస్తారు.. మరోవైపు గత వారం మణిపుర్‌ భద్రతా సలహాదారు కుల్దీప్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడారు. శాంతిభద్రతల బాధ్యతలు చూస్తున్న ‘ఏకీకృత కమాండ్‌’ ను సీఎం ఎప్పుడైనా సమావేశానికి పిలవొచ్చని చెప్పారు. అయితే.. ఈ కమాండ్‌ లో సీఎం పేరు లేకపోవడంతో రాష్ట్రంలో ఆర్టికల్‌ 355 అమల్లో ఉందంటూ పెద్దఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తాయి. కాగా.. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయంపై సీఎం స్పష్టత ఇచ్చారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీతో భేటీ కావాలని బీరేన్‌ ను అఖిలపక్ష నేతలు కోరారు.

ఎవరికీ చెప్పకుండానే..?

మణిపూర్ లో ఆర్టికల్‌ 355ని అమలు చేస్తున్నట్లు ప్రజలకు కేంద్రంగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ చెప్పకపోవడాన్ని అక్కడి ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. మణిపుర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మేఘచంద్ర సింగ్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఆర్టికల్‌ 355 అమలవుతున్నట్లు సీఎం మొదటిసారిగా అన్ని పార్టీలకు చెప్పారు. దీనిపై ఇంతకుముందు స్పష్టత లేదు. ఈ విషయాన్ని చెప్పడానికి సీఎం ఇంత సమయం తీసుకోవడం దురదృష్టకరం. కేంద్రానికి, రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదని మాకు తెలుసు. ఇప్పుడు అది నిర్ధారణ అయింది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు 25 కుకీ తిరుగుబాటు వర్గాలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతిపక్షాలు అఖిలపక్ష సమావేశంలో కోరాయి.

రాష్ట్రపతి పాలన తప్పదా..?

గతంలో రాష్ట్రాల్లోని గిట్టని ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కూల్చివేసే క్రమంలో ఆర్టికిల్ 356ను ప్రయోగించేవి. ఇలా ప్రతిపక్ష పాలిత ఎన్నో రాష్ట్రాల ప్రభుత్వాలను పడగొట్టారు. ఇప్పుడు మణిపూర్ లో బీజేపీ పాలిత రాష్ట్రమే ఉంది. కానీ, శాంతిభద్రతల పరిస్థితుల కారణంగా ఆ రాష్ట్రంలో ఆర్టికిల్ 355ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తర్వాతి దశ అయిన ఆర్టికిల్ 356 అమలు చేస్తారా? అనేది చూడాలి. కాగా, మణిపుర్‌లో కేంద్ర బలగాలకు రాష్ట్రం సహకరిస్తోందని, రాష్ట్రపతి పాలన అవసరం లేదని పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News